Navasakam News Network Telugu News Updates – Andhra Pradesh & Telangana

17/07/2020

యురేనియం అన్వేషణకు నో..

Filed under: Government,News,Telangana — Tags: , , — Navasakam Media @ 10:44

సిఫారసు చేయడం లేదంటూ కేంద్రానికి పీసీసీఎఫ్‌ లేఖ
నల్లమలలో జంతు, వృక్షాలతో పాటు మనుషులకు ముప్పు
ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రానికి తెలిపిన తెలంగాణ
‘యురేనియం’ ప్రతిపాదనలను పక్కన పెట్టనున్న కేంద్రం

హైదరాబాద్‌: అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పింది. అమ్రాబాద్‌ అటవీ ప్రాంతం లోని 83 చదరపు కి.మీ.ల పరిధిలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు అనుమతులు కోరుతూ కేంద్ర ప్రభుత్వ విభాగం ‘అటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఏఎండీఈఆర్‌) చేసిన ప్రతిపాదనలను సిఫారసు చేయడం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటవీ శాఖ ముఖ్య సంరక్షకులు (పీసీసీఎఫ్‌) ఆర్‌.శోభ గత మే 14న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్‌)కు లేఖ రాశారు.

నాగార్జునసాగర్‌ వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఫారెస్ట్‌ డివిజినల్‌ అధికారి, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం ‘ప్రాజెక్టు టైగర్‌’ఫీల్డ్‌ డైరెక్టర్, అటవీ ముఖ్య సంరక్షణ అధికారి, నాగర్‌కర్నూల్‌ జిల్లా అటవీ అధికారి వేర్వేరుగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి యురేనియం నిక్షేపాల అన్వేషణను వ్యతిరేకిస్తూ సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. యురేనియం నిక్షేపాల అన్వేషణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ తిరస్కరించడం లాంఛనమేనని రాష్ట్ర అటవీ శాఖ వర్గాలు తెలిపాయి.

ఉద్యమాలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
నాగార్జున సాగర్‌ అభయారణ్యం పరిధిలోని నిడ్గూల్‌ రిజర్వు ఫారెస్టు పరిధిలో 7 చ.కి.మీ.లు, అమ్రాబాద్‌ అభయారణ్యం పరిధిలో 76 చ.కి. మీ.లు కలిపి మొత్తం 83 చ.కి.మీ.ల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు అనుమతి కోరుతూ 2015 జనవరి 1న అటమిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ ప్రతిపాదనలు చేసింది. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న ఈ ప్రాంతం పరిధిలో ఐదేళ్ల పాటు యురేనియం అన్వేషణ చేసుకునేందుకు అనుమతి కోరింది. ఈ ప్రతిపాదనలకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ.. కేంద్ర అటవీ శాఖకు సిఫారసు చేసింది. నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు లేవని, పూర్తి సమాచారాన్ని సమర్పించాలని కేంద్ర అటవీ శాఖ కోరటంతో మళ్లీ అటమిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ సవరించిన ప్రతిపాదనలను పంపించింది. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యమాలు ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. యురేనియం అన్వేషణకు వ్యతిరేకంగా గతేడాది శాసనసభలో ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.

పెను ప్రమాదం.. సిఫారసు చేయలేం..
అటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ సమర్పించిన సవరించిన ప్రతిపాదనలపై రాష్ట్ర అటవీ శాఖ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించి నివేదికలు తెప్పించుకుంది. ప్రతిపాదిత ప్రాంతం పరిధిలోని అమ్రాబాద్‌ రేంజ్‌లో 16.38 లక్షల చెట్లు, మద్దిమాడుగు రేంజ్‌లో 19.30 లక్షల చెట్లు, నాగార్జున సాగర్‌ అభయారణ్యం పరిధిలో 489 చెట్లున్నాయని, యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాలు జరిపితే వీటి మనుగడ ప్రమాదంలో పడనుందని క్షేత్ర స్థాయి పరిశీలన జరిపిన అధికారులు నివేదించారు. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అటవీ కుక్కలు, నీల్గాయ్, చార్‌ సింగ, జింకలు, నక్కలు తదితర ఎన్నో అరుదైన జంతుజాతులు, వృక్ష జాతులున్నాయని, తవ్వకాలతో వీటి ఆవాసాలు దెబ్బతింటాయని స్పష్టం చేశారు. ప్రతిపాదిత ప్రాంతం టైగర్‌ రిజర్వు ఏరియా పరిధిలోకి వస్తుందని, అక్కడ ఖనిజాన్వేషణకు అనుమతి గుర్తు చేశారు.

యురేనియం అన్వేషణ లో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 3,000 బోరు బావులు వేసేందుకు అనుమతి కోరారని, దీని కోసం భారీ యంత్రాలు, సామగ్రి, సిబ్బం ది, వాహనాలను అడవిలోకి తీసుకురావాల్సి ఉంటుందని, అటవీ ప్రాంతం లోపల కొత్త రహదారులు ఏర్పాటవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అటవీకి నష్టం జరగడం ఖాయమని తేల్చి చెప్పారు. ప్రతిపాదిత ప్రాంతం, కుందు నదులకు పరీవాహక ప్రాంతంగా ఉందని, యురేనియం తవ్వకాలు జరిపితే తాగు, సాగునీరు, భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

కృష్ణా నది గుంటూరు, విజయవాడల మీదుగా బంగాళాఖాతంలో కలవనుందని, ఈ ప్రాంతం పరిధి వరకు ఈ నీటిని వినియోగించే ప్రజలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వ్యవసాయం దెబ్బతింటుందని నివేదికల్లో పేర్కొన్నారు. అమ్రాబాద్‌ పరిధిలోని ఉడిమిల్ల, ఇప్పాలపల్లి, వెంకేశ్వరం, పెట్రాల్‌చెను, చిట్లంకుంట, కుమ్మరోనిపల్లి, పదరా, రాయలగండి, మాచారం గ్రామాలతో పాటు ఇక్కడ నివాసముండే 1000 కుటుంబాలు యురేనియం అణుధార్మికతకు లోనై అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే సిఫారసు చేయడం లేదని క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన అధికారులందరూ తమ నివేదికల్లో తేల్చి చెప్పారు.

Courtesy Sakshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress