వర్షంతో పిల్లర్ కింద నిలబడ్డ యువతి
- మూడో అంతస్తు నుంచి రాలిన పెచ్చులు
- తలకు తీవ్రగాయాలు.. కాసేపటికే మృతి
- అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద ఘటన
- భర్తకు జాబ్‌తో ఆర్నెల్ల క్రితమే నగరానికి
- పెళ్లయిన ఏడాదికే పెను విషాదం
అది అమీర్‌పేట మెట్రో స్టేషన్! జోరుగా వర్షం పడుతోంది. అప్పుడే తన సోదరితో కలిసి మెట్రోరైలు దిగిన ఓ యువతి.. తడవకుండా ఉండేందుకు మెట్రో పిల్లర్ కిందకు వెళ్లింది. అదే ఆమె చేసిన తప్పయింది. కొద్దిసేపటికే పైనుంచి పెచ్చులు ఊడి నేరుగా ఆమె తలపై పడ్డాయి. అంతెత్తు నుంచి పడ్డ ఆ రాకాసి పెచ్చుల ధాటికి ఆమె తల పగిలింది. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే కుప్పకూలి రక్తపుమడుగులో గిలగిలాకొట్టుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. ఆదివారం మధ్నాహ్నం అమీర్‌పేట మెట్రోస్టేషన్ కింద చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను హతాశులను చేసింది. మృతురాలిని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న మౌనిక (26)గా గుర్తించారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మౌనిక స్వస్థలం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్. భర్త కంతాల హరికాంత్ రెడ్డి. ఏడాది క్రితమే వీరికి పెళ్లయింది.
హరికాంత్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీ్‌సలో ఉద్యోగం రావడంతో ఆరు నెలల క్రితమే ఈ దంపతులు నగరానికి వచ్చారు. కూకట్‌పల్లి ఫేజ్- 3 ఎస్‌ఆర్ హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. తన చిన్నాన్న కూతురు నిఖితను అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో చేర్పించేందుకు ఆమెతో కలిసి మౌనిక ఆదివారం మధ్యాహ్నం కూకట్‌పల్లిలో మెట్రోరైలు ఎక్కింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఇద్దరు అమీర్‌పేటలో దిగారు. వర్షం పడుతుండటంతో సారథి స్టూడియో వైపు ఉన్న మెట్ల ద్వారా కిందకు దిగారు. వాన పడుతుండటంతో ఇద్దరూ ఏ-1053 మెట్రో పిల్లర్ కింద నిల్చున్నారు. అనుకోకుండా మూడో అంతస్తులోని గోడకు చెందిన పెచ్చులు ఒక్కసారిగా ఊడి మౌనిక తలపై పడ్డాయి. 9 మీటర్ల ఎత్తునుంచి పెచ్చులు పడటంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమె సోదరి, స్థానికుల్లో కొందరు బాధితురాలిని ఓ ఆటోలో హుటాహుటిన దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలికి ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు.
కన్నీరుమున్నీరైన భర్త సోదరిని హాస్టల్‌లో చేర్పించి గంటలో తిరిగి వస్తానని తనతో చెప్పి వెళ్లిన భార్య.. కొద్దిసేపటికే తిరిగిరానిలోకాలకు వెళ్లిందని తెలిసి మౌనిక భర్త హరికాంత్‌రెడ్డి షాక్‌కు గురయ్యాడు. మృతదేహం వద్ద భోరున విలపించాడు. ‘పెళ్లైన సంవత్సరానికే నన్ను వీడి వెళ్లావా’ అంటూ అతడు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనకు మెట్రో అధికారులే బాధ్యత వహించాలని, మృతురాలి కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీజేపీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కన్వీనర్ బూర్గుల శ్యాంసుందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. కాగా మెట్రోస్టేషన్‌లో పెచ్చులూడి వివాహిత మృతి చెందిన ఘటనలో బాధితురాలి కుటుంబానికి పరిహారంపై మెట్రో అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
చిన్న ప్లాస్టర్ పీస్ పడింది ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లర్ కింద నిల్చున్నవారిలో ఓ యువతిపై స్టేషన్ సర్ఫే్‌సవాల్ నుంచి చిన్న ప్లాస్టర్ పీస్ పడింది. అది మొనదేలి ఉండటం.. 9మీటర్ల ఎత్తు నుంచి పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని ఎల్ అండ్ టీ సిబ్బంది వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె మృతిచెందింది. ఈ ఘటన దురదృష్టకరం. మౌనిక కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థకు సూచించాం.
Courtesy Andhrajyothi