కాళ్లకింద మట్టి
గడ్డగట్టే ఉపన్యాసాలు
ఉద్యమాలకు చూపునిచ్చే కొత్తపాటలు
సత్యశోధన సిరాతో
రాజ్యానికీ నిచ్చెనలేసే “ఎదురీత’ రచనలు
మహజన మార్చ్ ముందు
నీ పొలికేక మా తరానికి పోరు నెలవంక
వాడకు గుండె ధైర్యం
ఊరుకు సామాజిక న్యాయం
కాలానికి సిద్దాంతం
పోరాటాలకు చూపుడువేలు
మార్క్స్ పూలే అంబేద్కర్ ల వరుసలో
మహోన్నత శిఖరం
అస్తిత్వాల దిక్సూచి ఉక్కు మనిషి
ప్రపంచ కార్మికులారా
ఏకంకండి పాతమాట
మేమెంతమందిమో మా కంత వాట కొత్తమాట
పాతమాట సాక్షిగా కొత్తపాటను
సామాజిక చరిత్రగా తిరుగరాసిన
ఉద్యమాల ఉపాధ్యాయుడు
వర్గరహిత స్థాపనకు మార్క్సిజాన్ని నమ్మినా
మహాజన అధికారానికి
పూలే అంబేద్కరిజమే అజేయమన్న ఆధునిక సత్యశోధకుడు
పావురంలా
పల్లెలన్నీ తిరిగి
సామాజిక రైతులా
అణువణువూ అస్తిత్వ విత్తనాలు చల్లిన
బహుజన దీపదారి
మన కాలపు బౌద్ధ ఉపాళి
అలల్లా ఆలోచనలు
నిప్పుల్లా నినాదాలు
ఆకాశమంత ఆశయం
సముద్రమంతా సంస్కారం
ప్రతి మలుపులో ఉద్యమ ఉదయం
అడుగడుగులో మహాజనోదయం
మట్టికి మాటల పాలు పట్టి
పిట్టలకు హక్కులు బోధించి
దళిత బహుజన విముక్తి పోరుకు
దారులు పరిచిన చైతన్య శిఖరం
సామాజిక తెలంగాణకు
ఊపిరి పోసిన సమతాయోధుడు
పారే ఏరులో నీ పాటుంది
మండె ఉద్యమంలో నీ మాటుంది
నీ అడుగులో అడుగును ఎత్తుకోవటమే
నిజమైన నివాళి
ఉ.సా (ఉ. సాంబశివరావు)
ఉద్యమాల ఉపాధ్యాయుడికు కన్నీటి నివాళితో..
– వనపట్ల సుబ్బయ్య