ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • వచ్చే 48 గంటలు అత్యంత సంక్లిష్టం!
  • సైనిక ఆస్పత్రికి అమెరికా అధ్యక్షుడి తరలింపు.. కొవిడ్‌ చికిత్స ప్రారంభం
  • యాంటీ బాడీస్‌ మిశ్రమాన్ని ఎక్కించిన వైద్యులు
  • రెమ్‌డెసివిర్‌నూ ఇచ్చారు: వైట్‌హౌస్‌.. ఆరోగ్యం బాగానే ఉందన్న డాక్టర్లు
  • అధికారాలను బదలాయించని ట్రంప్‌.. 4 రోజుల కిందటే సోకిన వైరస్‌

వాషింగ్టన్‌, అక్టోబరు 3: కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే జ్వరంతో బాధపడుతున్న ఆయన శరీరంలోని ప్రాథమిక ప్రమాణాలు (వైటల్స్‌) అంటే బీపీ, పల్స్‌ రేటు, రెస్పిరేషన్‌ రేటు మొదలైనవి ఉండాల్సిన స్థాయి కంటే  తక్కువగా ఉంటున్నాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ సమాచారం ప్రకారం- ఆయన ఆక్సిజన్‌ స్థాయి 60-70కి తగ్గింది.  ఊపిరితిత్తుల్లో విపరీతంగా ఇబ్బంది (కంజెషన్‌) వచ్చింది. దాంతో వెంటనే ఆయనకు కృత్రిమంగా ఆక్సిజన్‌ను అందించడం మొదలు పెట్టారు. పరిస్థితి విషమించవచ్చని భావించి- శుక్రవారం మధ్యాహ్నం ఆయనను శ్వేత సౌధం నుంచి వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలటరీ మెడికల్‌ సెంటర్‌లో చేర్పించారు. అధ్యక్షుడి ప్రత్యేక హెలికాప్టర్‌ మెరైన్‌ వన్‌లో ఆయనను హుటాహుటిన తరలించారు. వచ్చే 48 గంటలూ చాలా కీలకమని, సంక్లిష్టంగా మారే ప్రమాదముందని వాల్టర్‌ రీడ్‌లో ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన ఓ వ్యక్తి మీడియాకు వెల్లడించారు. ‘ఆయన ప్రమాదం నుంచి బయటపడలేదు.

అసలు ఎప్పటికి కోలుకుంటారన్న విషయమే డాక్టర్లు చెప్పలేని పరిస్థితి నెలకొంది’ అని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ సమాచారంతో అమెరికాలో ఆందోళన తారస్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి ఆయనకు రీజెనరాన్‌ కంపెనీ తయారుచేసిన  యాంటీబాడీస్‌ మిశ్రమాన్ని ఎక్కించారు. ఇందులో రెండు మోనోక్లోనల్‌ ప్రతిరక్షకాలు (యాంటీబాడీస్‌) ఉంటాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను తాత్కాలికంగా బలోపేతం చేసి వైర్‌సతో పోరాడేందుకు సహకరిస్తాయి. ఎనిమిది గ్రాముల డోసును ఆయనకు ఎక్కించారని, అంతా సాఫీగా జరిగిందని వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ సీన్‌ కాన్లే ఓ ప్రకటనలో తెలిపారు. వైర్‌స-నిరోధక మందు రెమ్‌డెసివిర్‌ను కూడా ఆయనకు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే కాన్లే పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించకుండా కొంత గోప్యత పాటించారు. శ్వేతసౌధంలో ఉన్నపుడే ఆయనకు ఆక్సిజన్‌ ఎక్కించారా అన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. వాల్టర్‌ రీడ్‌కు తెచ్చిన తరువాత ఆయన ఆరోగ్యం బాగుందని, ఆక్సిజన్‌ను కూడా పెట్టలేదని ఆయన చెప్పుకొచ్చారు. కాన్లే చెబుతున్న దానికి, వాల్టర్‌ రీడ్‌ వర్గాలు చెబుతున్నదానికి అస్సలు పొంతన లేదని సీఎన్‌ఎన్‌, బీబీసీ, ఎన్‌బీసీ సహా ప్రధాన వార్తాసంస్థలన్నీ పేర్కొన్నాయి. నిజానికి వైట్‌ హౌస్‌లోనే క్వారంటైన్‌ అయి… విధులు కొనసాగిస్తారని మొదట ప్రకటించినప్పటికీ వాల్టర్‌ రీడ్‌, జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ వైద్యుల సూచనల మేరకు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వయసు, ఇతరత్రా ఇబ్బందుల దృష్ట్యా ఆసుపత్రిలో ఉంచడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు.  జ్వరం, ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉండడంతో ఆయనకు అదనంగా కొన్ని మందులూ ఇస్తున్నారు.

వైట్‌హౌస్‌ వర్గాల సమాచారం ప్రకారం…ఆయనకు ఫెమోటిడిన్‌, మెలాటినిన్‌, ఆస్ర్పిన్‌లతో పాటు జింక్‌, విటమిన్‌-డీ కి సంబంధించిన మందులూ ఇస్తున్నారు. అయితే ఇవి తాజాగా మొదలెట్టారా లేక కొంతకాలంగా తీసుకుంటున్నారా అన్నది తెలియరాలేదు. తాజాగా తేలిన మరో విషయమేంటంటే.. ట్రంప్‌కు కరోనా సోకిన విషయం బుధవారమే బయటపడింది. పాజిటివ్‌ వచ్చిందని తెలిసీ కూడా ఆయన న్యూజెర్సీలో 2 సార్లు మద్దతుదారులతో సమావేశమయ్యారు. నిధుల సేకరణ ర్యాలీలో పాల్గొన్నారు.

వీడియో విడుదల
ఆసుపత్రికి వెళ్లే ముందు ట్రంప్‌ ఓ చిన్న వీడియోను ట్విటర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. ‘మీరు చూపుతున్న మద్దతుకు కృతజ్ఞుణ్ణి… నేను బాగానే ఉన్నా… అన్నీ సజావుగానే సాగుతాయని ఆశిస్తున్నా… ఫస్ట్‌ లేడీ ఆరోగ్యమూ బాగుంది..అందరికీ కృతజ్ఞతలు… ప్రేమతో….’ అని ట్రంప్‌ అందులో పేర్కొన్నారు. 18 సెకన్లు మాత్రమే ఉన్న ఆ వీడియోలో ఇతర వివరాలేవీ లేవు. ట్రంప్‌ ఇంత తక్కువ నిడివి ఉన్న వీడియోను ఎన్నడూ విడుదల చేయలేదు. మరో విషయమేంటంటే ఆయన ఆరోగ్యం విషయంలో శ్వేతసౌధ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఏ డాక్టరూ మీడియా ముందుకు వచ్చి ఏమీ చెప్పకపోవడం, ఆయన ఏఏ మందులు తీసుకుంటున్నారన్నది అధికారికంగా వెల్లడించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాగా శ్వేతసౌధంలో ట్రంప్‌ సహాయకులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది.

కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ హోప్‌ హిక్స్‌కు ఇంతకుముందే ఇది రాగా, తాజాగా- వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కేలీ మెకానీ, మాజీ కౌన్సిలర్‌ కెలానీ కాన్వే, ట్రంప్‌ ప్రచార మేనేజర్‌ బిల్‌ స్టెపియన్‌, ముగ్గురు సెనేటర్లకు సోకింది. ఈ సెనేటర్లు ట్రంప్‌ గత నెల మూడోవారంలో శ్వేతసౌధం రోజ్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామక ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. అందులో కనీసం 25 మందికి ఇది సోకి ఉండొచ్చని  అంటున్నారు. వైట్‌హౌస్‌ సిబ్బందిలో ఇంకా ఎంతమందికి ఇది సోకినదీ తేలాలి. క్లీవ్‌లాండ్‌లో జరిగిన తొలి ముఖాముఖి చర్చకు ట్రంప్‌తో పాటు వెళ్లిన అధికారగణంలో 11 మంది వైరస్‌ బారిన పడ్డారు. కాగా, వైట్‌హౌ్‌సలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి కాదని ఓ అధికారి వివరించారు.

పెన్స్‌కు అధికారాలివ్వని ట్రంప్‌!
మరోవైపు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌కు అధికారాలు బదలాయించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అధ్యక్షుడు చికిత్సలో ఉన్నపుడు, అనస్తీషియా కూడా తీసుకుంటున్నపుడు అధికారాలను ఉపాధ్యక్షుడికి అప్పగించాలని, కోలుకున్నాక తిరిగి స్వీకరించాలని రాజ్యాంగంలోని 25వ సవరణ సెక్షన్‌ 3 చెబుతోంది. కానీ ట్రంప్‌… అధికారాలను తన వద్దే అట్టేపెట్టుకుని ఆసుపత్రి నుంచి విధులు నిర్వర్తించాలని నిర్ణయించుకోవడం సరికాదని న్యాయ నిపుణులు, రాజకీయవేత్తలు అంటున్నారు. ట్రంప్‌ దంపతులు త్వరగా కోలుకోవాలని డెమొక్రాట్‌ ప్రత్యర్థి జో బైడెన్‌, మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, క్లింటన్‌ సహా అనేకమంది సందేశాలు పంపారు.

RELATED ARTICLES

Latest Updates