అమెరికా ఆర్థిక సారథులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

వైట్‌ హౌస్‌కు అత్యంత కీలకమైన బడ్జెట్, ప్రెస్‌ టీమ్‌లను పూర్తిగా మహిళా సారథ్యం కిందికే తెచ్చారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌. పేరుకు బైడనే అధ్యక్షుడు అయినప్పటికీ అమెరికాను మున్ముందు నడిపించబోతున్నది మాత్రం మహిళలేనని ఆయన నియామక నిర్ణయాలను బట్టి అర్థం అవుతోంది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కి పోలైన ఓట్లలో సగానికి పైగా మహిళలవే! వందేళ్ల క్రితం ఓటు హక్కును సాధించుకున్న అమెరికన్‌ మహిళ ఆ హక్కును ఒక అస్త్రంలా ఉపయోగించి తనను గెలిపించిందన్న సంగతిని బైడెన్‌ సరిగానే గుర్తు పెట్టుకున్నారు. అందుకు నిదర్శనమే వైట్‌ హౌస్‌లోని మూడు ముఖ్య ఆర్థిక బాధ్యతలను మహిళలకే ఆయన అప్పగించడం. ఆర్థికమే కాదు, వైట్‌ హౌస్‌కు అత్యంత కీలకమైన ప్రెస్‌ టీమ్‌ను కూడా  మొత్తం మహిళలతోనే భర్తీ చేశారు జో బైడెన్‌. ఈ టీమ్‌తోనే ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

నీరా టాండన్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌. సెసీలియా రౌజ్‌ ఎకనమిక్‌ అడ్వయిజర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు. జానెట్‌ ఎలెన్‌ ట్రెజరీ సెక్రెటరీ. ఈ మూడు విభాగాలూ వైట్‌ హౌస్‌లో ఉన్న అమెరికా స్ట్రాంగ్‌ రూమ్‌లోని డబ్బు బీరువాల్లాంటివి. వాటి తాళం చెవులను నీరా, రౌజ్, జానెట్‌ల చేతికిచ్చారు బైడెన్‌. ఇక శ్వేత సౌధంలోని ఏడుగురు సభ్యుల ప్రెస్‌ టీమ్‌లో కూడా అందరూ మహిళలే. ఒక్కొక్కరి కెరీర్‌ కొండంత. అనుభవం ఆకాశమంత. కేట్‌ బెడింగ్‌ఫీల్డ్‌ ప్రెస్‌ టీమ్‌ డైరెక్టర్‌. జెన్‌ ప్సాకి ప్రెస్‌ సెక్రెటరీ. సైమన్‌ శాండర్స్‌ ఉపాధ్యక్షురాలి ముఖ్య ప్రతినిధి. యాష్లీ ఎటిన్‌ హ్యారిస్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌. కెరీన్‌ జీన్‌ పియరీ ప్రిన్సిపల్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రెటరీ. ఎలిజబెత్‌ అలెగ్జాండర్‌ ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌. పిలి తోబర్‌ డిప్యూటీ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌. ఈ ఏడుగురూ బైడెన్‌ గెలుపులో కీలకపాత్ర వహించిన ప్రచార వ్యూహకర్తలు.

కేవలం మహిళ గానే కాక వ్యక్తిగతంగా కూడా ఎవరి విలక్షణతలు వాళ్లకు ఉన్నాయి. బడ్జెట్‌ డైరెక్టర్‌ నీరా టాండన్‌ ‘ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌’కు ఇప్పటి వరకు నామినేట్‌ అయిన మూడవ మహిళ మాత్రమే. (సెనెట్‌ ఆమోదం పొందవలసి ఉంది). తొలి ఇండో–అమెరికన్‌. ఎకనమిక్‌ అడ్వయిజర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు సెసీలియా రౌజ్‌ ఆఫ్రికన్‌–అమెరికన్‌. ట్రెజరీ సెక్రెటరీ జానెట్‌ ఎలెన్‌ ఆ పదవిలోకి వచ్చిన తొలి మహిళ. ప్రెస్‌ టీమ్‌లోని కెరీన్‌ జీన్‌ పియరీ, పిలి తోమర్‌ లెస్బియన్‌ హక్కుల పరిరక్షణ కార్యకర్తలు. కెరీన్‌ హైతీ, తోబర్‌ గటెమలా సంతతి వారు. ఇంతటి ప్రోగ్రెసివ్‌ టీమ్‌ అమెరికా చరిత్రలోనే ప్రథమం అని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వ్యాఖ్యానించింది. పేరుకు బైడనే అధ్యక్షుడు అయినప్పటికీ అమెరికాను నడిపించబోతున్నది మాత్రం మహిళలే అని అమెరికన్‌ పత్రికలు కొన్ని రాశాయి. నియామక నిర్ణయం గొప్పదైనప్పుడు ఫలితాలూ గొప్పగానే ఉంటాయి.

Courtesy Sakshi

RELATED ARTICLES

Latest Updates