మరో ప్రేమ హత్య…!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* యూపీలో దళిత యువకుడికి నిప్పు
* పోలీస్‌ కావాలనే లక్ష్యంతో చదువు.. అంతలోనే ఇలా
* ఆధిపత్య వర్గాల ఆగ్రహాలకు బలౌతున్న అణగారిన ప్రజలు
 లక్నో : ‘అభిషేక్‌ చురుకైన కుర్రాడు. తనది నిరుపేద కుటుంబం అయినా బాగా చదువుతాడు. తన మిత్రులందరూ ఇంటర్మీడియట్‌తోనే ఆపేసినా పోలీస్‌ కావాలనే లక్ష్యంతో చదువును కొనసాగిస్తున్నాడు. ఓ వైపు కాలేజీ, మరోవైపు తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయం చేస్తూ ఆ ఊరిలో అందరి నోళ్లలో నాలుకలా మారాడీ దళిత యువకుడు. చదువు ముగియగానే ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలని కన్నవారిని బాగా చూసుకోవాలని అతడు కన్న కలలు ఒక్కసారిగా కల్లలయ్యాయి. ఈ నెల 14న రాత్రి గ్రామంలోని ఓ ఇంట్లో పూర్తిగా కాలిన దేహంతో విగతజీవిగా పడున్నాడు. ఆధిపత్య కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించడమే అభిషేక్‌ చేసిన నేరం.’ ఇది ఒక్క అభిషేక్‌ కథే కాదు.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి దళిత యువకుడు ఎదుర్కొంటున్న సమస్య.

డిజిటల్‌ యుగంలో ఉన్నామనీ, చందమామ వద్దకు రాకెట్లను పంపిస్తున్నామని చెప్పుకుంటున్నా దేశం ఇంకా అనాగరిక దశలోనే ఉన్నదనేది ఇప్పటికీ కాదనలేని వాస్తవం. కులం, మతం పేరిట ఇక్కడ జరుగుతున్న మారణహౌమాలు సర్వసాధారణమైపోయాయి. మరీ ముఖ్యంగా గత ఐదారేండ్లుగా పాలకులు సైతం వీటిని ప్రోత్సహిస్తుండటం, ఈ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లను సన్మానించడం మరింత ఆందోళనకరంగా మారుతున్నది. తాజాగా యూపీకి చెందిన అభిషేక్‌ పల్‌(23).. అగ్రవర్గానికి చెందిన ఓ యువతిని ప్రేమించినందుకు గానూ అతడిని అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు సజీవదహనం చేశారు. హర్దోరు జిల్లా బడైచా గ్రామానికి చెందిన పల్‌ది నిరుపేద దళిత కుటుంబం. గ్రామంలో అగ్రవర్ణాలదే పెత్తనం. అభిషేక్‌ తల్లిదండ్రులిద్దరూ (మితిలేశ్‌, రంబేటి) కొంతభూమిని కౌలుకు తీసుకుని బతుకులీడుస్తున్నారు.

చిన్నప్పటి నుంచి తన కొడుకును పోలీస్‌గా చేయాలనేది మితిలేశ్‌ కల. అందుకనుగుణంగానే అభిషేక్‌ చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్‌ వచ్చేవాడు. పోలీస్‌ శాఖలో ఉన్నత శిఖరాలధిరోహించాలంటే డిగ్రీ చదువు తప్పనిసరనీ, అంతేగాక ఇంగ్లీషూ నేర్చుకోవచ్చునని బీ.ఏలో చేరాడు. ఈ క్రమంలోనే గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు. చదువు పూర్తైన తర్వాత ఇద్దరూ చెరో ఉద్యోగం తెచ్చుకుని పట్నం వచ్చి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ, ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు అభిషేక్‌పై కక్ష గట్టారు. ఈనెల 14న తన తల్లి అనారోగ్యానికి గురికావడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లిన బాధితుడు.. అక్కడ కట్టాల్సిన డబ్బు కోసం అదే రోజు రాత్రి తన గ్రామానికొచ్చాడు. ఇదే అదునుగా భావించిన నిందితులు.. అభిషేక్‌ను ఓ గదిలో బంధించి, రక్తమోడేలా కొట్టారు. అంతేగాక ఓ మంచానికి కట్టేసి పెట్రోల్‌పోసి నిప్పంటించారు. మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వాళ్లు వెళ్లి తలుపులు తీసేసరికే అభిషేక్‌ దేహం పూర్తిగా కాలిపోయింది. తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరుసటి రోజు మరణించాడు. తన కొడుకు మరణ వార్త విని రంబేటి కూడా అదే ఆస్పత్రిలో కన్నుమూయడం మరింత విషాదకరం.

పెత్తందార్ల రాజ్యం.. దళితులకు ప్రాణ సంకటం
దేశ రాజకీయ యవనికపై యూపీది ప్రత్యేక స్థానం. అంతేగాక ఇక్కడ దళితుల జనాభా అధికం. కానీ గ్రామాలలో ఉండే అతికొద్ది మంది ఆధిపత్య వర్గాలదే పెత్తనం. వారు చెప్పిందే వేదం. రిజర్వేషన్లతో సర్పంచ్‌లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా దళిత నాయకులు ఎన్నికవుతున్నా వారిపైనా పెత్తందార్లదే ఆధిపత్యం. దీంతో దళితులు ఇప్పటికీ వివక్షనూ, ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటునే ఉన్నారు. అణగారిన వర్గాల ప్రజలు పెండ్లి వేడుకలు చేసుకున్నా.. ఉన్నత కులాల యువతులను ప్రేమించినా.. కనీసం వారు మంచి దుస్తులేసుకున్నా ఆధిపత్య కులాలు భరించడం లేదు. దీనికి సంబంధించిన ఉదంతాలు గడిచిన ఐదేండ్లలో నిత్యకృత్యమయ్యాయి. 2016 నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం.. యూపీలో దళితులపై దాడులు, హత్యలు గతంలో కంటే పెరిగాయి. ఒక నివేదిక ప్రకారం.. యూపీలో ప్రతి గంటకు ఒక దళితుడి మీద దాడి జరుగుతున్నది.

రాజకీయ చైతన్యం వచ్చినా..!
ప్రముఖ సామాజికవేత్త రామశంకర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. దళితులు చైతన్యవంతులవడం ఆధిపత్య వర్గాలకు గిట్టడం లేదన్నారు. ఆర్థిక, రాజకీయ అధికారాలు శాశ్వతంగా తమ వద్దే కేంద్రీకృతం అవ్వాలంటే దళితులు రాజకీయంగా చైతన్యవంతులు కావొద్దని వారు భావిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే దళితులపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. అందుకే దళిత ముఖ్యమంత్రులు వచ్చినా, రాజకీయంగా ఎదిగినా దళితుల బతుకులు బాగుపడటం లేదనీ, వివక్ష కొనసాగుతున్నదని ఆయన వివరించారు.

Courtesy NavaTelangana..

RELATED ARTICLES

Latest Updates