
ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మబలికి ఓ 22 ఏళ్ళ అవివాహిత యువతిని వంచించిన ఓ రౌడీషీటర్ ఉదంతమిది.
స్థానిక టౌన్ పోలీసుల కథనం ప్రకారం… కైకలూరుకు చెందిన బిజేపీ నాయకుడు గరికిపాటి రాంబాబు కుమారుడు సత్యనారాయణరాజు (రాజా) గత 4 సవత్సరాలుగా తన ఇంటి సమీపంలో నివాసం ఉన్న బిఎస్పీ డిగ్రీ చదువుకున్న అవివాహిత యువతితో చనువు ఏర్పరుచుకుని, ప్రేమిస్తున్నానని నమ్మించి శారీరకంగా, మానసికంగా తనను లోబర్చుకుని చివరకు వంచించాడని పేర్కొంటూ బాధితురాలు మంగళవారం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో అతని ఇంటికి తీసుకువెళ్ళి బలవంతంగా పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ సమయంలో ఫోటోలు కూడా తీసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. అదేమంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడని, తాను అతని ఇంటికి వెళ్లటానికి నిరాకరిస్తే ఫోటోలు వాట్సాప్ లో అందరికీ పంపుతానని బెదిరించేవాడని, తాను విజయవాడ హాస్టల్ లో ఉన్నప్పుడు అక్కడికి కూడా వచ్చి తనన బెదిరించి బయటకు తీసుకువెళ్లేవాడని, కాదంటే తన తండ్రిని చంపుతానని బెదిరించే వాడని బాధిరాలు వాపోయింది. ఇటీవల తనకు 4 నెలల గర్భిణీ రాగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో తానే తన భర్తనని చెప్పి అబార్షన్ చేయించాడని పేర్కొంది. తనపై లైంగికదాడికి పాల్పడే విషయాలు అతని తగ్జాండ్రులకు కూడా తెలుసునని, తనను కోడలుగా చేసుకుంటామని చెప్పేవారని, వారి ఇంటిలో స్వేచ్ఛగా ఉండమని చెప్పేవారని పేర్కొంది. ఇటీవల పెళ్లి చేసుకోమని అడిగితే రాజా నిరాకరించాడని, అతని
తల్లిదండ్రులను అడిగితే కులాలు వేరని, స్తోమత లేనిదానవని, వేరే పెళ్లి చేసుకుంటే ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొంది. అదేమంటే నిన్ను, నీ కుటుంబాన్ని భూమి మీద లేకుండా అంతం చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. తనను నమ్మించి మోసం చేసి బెదిరించిన రాజా, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకుని, వారి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కైకలూరు టౌన్ ఎస్ఎ షణ్ముఖసాయి ఐపిసి 376, 420, 313, 354, 506, 109, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.