
ఉదయం పదకొండున్నరైంది. ఒడిశాలోని బరిపదా బస్ స్టేషన్ దగ్గర కారు నిలిపి మేం మయూర్ భంజ్ లెప్రసీ హోమ్ ఎక్కడుంది? అని అడిగాం.
ఒక తోపుడుబండి వ్యక్తి… చౌరస్తా నుంచి అర కిలోమీటర్ వెళ్లి తర్వాత లెఫ్ట్ తీసుకుంటే సెంటర్ వస్తుంది సార్ అన్నారు.
నేను, బాబూ, లెప్రసీ హోమ్ వెళ్లాలి, సెంటర్ కాదు అన్నా. ఈసారి తను కాస్త చిరాగ్గా అదేలే, సార్లుండే సెంటర్ అదే అన్నారు.
నేను ఇంకోసారి అడిగే ధైర్యం చేయలేదు. అక్కడకు వెళ్లేసరికి పెద్ద గేట్ కనిపించింది. దానిపైన 1902లో నిర్మించిన ఈ భవనం ‘మహారాణి లక్ష్మీ దేవీకి అంకితం’ అని ఉంది.
లోపల దట్టమైన చెట్ల మధ్యనున్న ఒక దారి లోపలికి తీసుకెళ్తోంది. మూడు చిన్న చర్చి గుడిసెలున్నాయి. వాటి పక్కనే మామిడి, పనస చెట్ల నీడలో కొంతమంది మహిళలు పచ్చి మామిడికాయలు కొడుతూ ఎండలో ఆరబెడుతున్నారు.

ఆస్ట్రేలియా మిషనరీ గ్రాహమ్ స్టెయిన్స్ తన సగం జీవితాన్ని గడిపిన లెప్రసీ షెల్టర్ హోమ్ (కుష్ఠురోగ నివారణ కేంద్రం) ఇదే.
1999 జనవరి 22 మధ్యాహ్నం ఆయన తన చివరి భోజనం ఇక్కడే కుష్ఠురోగులతో కలిసి చేశారు.
అదే రాత్రి, సమీప కియోంఝర్ జిల్లాలోని మనోహర్‌పూర్ గ్రామంలో గ్రాహం స్టెయిన్స్, ఆయన ఇద్దరు కొడుకులు ఫిలిప్ (10), తిమోతీ (8)లను హత్య చేశారు. ఒక ఉగ్రమూక ముగ్గురినీ వారి జీపులోనే తగలబెట్టారు.
కుష్ఠురోగుల సేవా కేంద్రం ముసుగులో గ్రాహం స్టెయిన్స్ పేద గిరిజనులను మతం మారుస్తున్నారని వారు భావించారు. అయితే తరవాత కేసు విచారణ జరిపిన వాధ్వా కమిషన్ తన రిపోర్టులో ఈ ఆరోపణలు తప్పని చెప్పింది.
కానీ ఆ విషయం బయటపడే సమయానికి గ్రాహం స్టెయిన్స్, ఆయన కొడుకులు కియోంఝర్‌లోని ఒక సిమెట్రీలో సమాధులైపోయారు.

గ్రాహం స్టెయిన్స్ ఇప్పటికీ బతికే ఉన్నారు: ప్రత్యక్ష సాక్షి
లెప్రసీ హోమ్ దగ్గర 55 ఏళ్ల నిమాయీ హంసదా మాకోసం చాలా ఎదురుచూస్తున్నారు.
మొదట మమ్మల్ని ‘తిన్నారా’ అని అడిగారు. తర్వాత ‘ఏమైంది’ అన్నారు.
నేను ‘గ్రాహం స్టెయిన్స్, ఆయన కొడుకు చనిపోయి 20 ఏళ్లైంది’ అన్నాను.
దానికి నిమాయీ ‘అందరూ ఇక్కడే ఉన్నారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లలేదు. మాలో గ్రాహం స్టెయిన్స్ ఇప్పటికీ బతికే ఉన్నారు. మా బాగోగులు చూసుకుంటున్నారు’ అన్నారు.
నిమాయీ ఒడిశాలోని బారిపదాలో ఇదే లెప్రసీ షెల్టర్ హోంలో పుట్టారు. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ కుష్ఠురోగ బాధితులు. గ్రాహం స్టెయిన్సే వారికి చికిత్స చేసేవారు.
నాకు ఆరు నెలల వయసప్పుడు గ్రాహం నన్ను ఒక వేలితో పట్టుకుని ఎత్తుకునేవారని మా అమ్మ చెప్పేది అని చెప్పారు.

ఆ రోజు ఏం జరిగిందంటే…
1999 జనవరి 22న సార్ అన్నం తిన్నారు. తర్వాత మేం చర్చికి పక్కనే ఉన్న ఆయన ఇంటికెళ్లాం. మనోహర్‌పూర్ వెళ్లాలి. ఆయన ఇద్దరు కొడుకులు, కూతురు కూడా వస్తామని చెప్పారు. గ్రాహం కూతురిని తల్లి దగ్గరే ఉండమన్నారు. మేం రెండు జీపుల్లో బయటికెళ్లాం.
గ్రాహం స్టెయిన్స్ ఆయన కొడుకు మనోహర్‌పూర్‌లో చిన్న చర్చిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్నారు. ఆయనపై దాడి చేసి హత్య చేసిన వారికి ఆయన ఆ ముసుగులో మతమార్పిడిలు చేయిస్తున్నారని అనిపించింది.
రాత్రి భోంచేసిన తర్వాత మేం గుడ్ నైట్ చెప్పి పడుకోడానికి వెళ్లిపోయాం. గ్రాహం, ఆయన కొడుకులు పెద్ద జీప్‌లోనే దోమతెర కట్టుకుని పడుకుంటే, నేను ఇంట్లో పడుకున్నా. రాత్రి 12 గంటలప్పుడు జీపును కొడుతున్నట్టు శబ్దం వినిపించింది. బయటికెళ్లేసరికి జీపు దగ్గరున్న చాలా మంది దాన్ని కొడుతుండడం కనిపించింది.
జనం దగ్గరికి వెళ్లి ఎదుకు కొడుతున్నారని అడిగానని నిమాయీ చెప్పారు.
అడుగుతూనే ఉన్నా, కొందరు ‘కొట్టండి, కొట్టండి, వాడ్ని కొట్టండి’ అన్నారు. అంతే నన్ను కొట్టడం మొదలుపెట్టారు. నేను పరిగెత్తా.
తర్వాత జీపుకు పెట్టిన మంటను ఆర్పడానికి నీళ్లు తీసుకొచ్చా. కానీ మళ్లీ కొట్టారు. తర్వాత నేను ఊళ్లోవాళ్లను పిలిచి వారిని కాపాడాలని ప్రయత్నించా. కానీ అప్పటికే టైర్లు పేలిపోతున్నాయి. మేం ఏం చేయలేకపోయాం.
నిమిషాల్లోనే గ్రాహం స్టెయిన్స్, ఆయన కొడుకులను కాల్చేస్తూ మంటలు పైకి ఎగిశాయి. గ్రామంలో వారంతా వచ్చేసరికే ఆలస్యమైపోయింది.

అప్పట్లో కల్యాణ్ కుమార్ సిన్హా బరిపదా జర్నలిస్టుగా పనిచేసేవారు. ఆయన ఆకాశవాణి ప్రతినిధిగా ఉండేవారు. తర్వాత ఉదయం మనోహర్‌పూర్‌లో ఘటనా స్థలం దగ్గరికి మొదట వచ్చిన జర్నలిస్ట్ కల్యాణే.
ఆయనకు ఇప్పటికీ ఆ రోజు ఉదయం గుర్తుంది. నేనక్కడికి చేరుకునేప్పటికి ఎక్కువ మంది లేరు. ఆ ప్రాంతం అంతా కాలిన టైర్లు, పెట్రోల్ వాసన వస్తోంది. గ్రాహం, ఆయన కొడుకులను బలవంతంగా జీపులోనే కట్టేసి దాన్ని తగలబెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కల్యాణ్ సిన్హా ఘటనాస్థలానికి రావడానికి కాస్త ముందే గ్రాహం భార్య గ్లాడిస్ స్టెయిన్స్ అక్కడికి చేరుకున్నారు. కాస్త దూరంలో కూర్చుని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆమె ఆరోజు చూపించిన ధైర్యం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇదంతా ఎవరు చేశారని నేను ఆమెను అడిగా. దానికి గ్లాడిస్ ‘ఎవరు చేశారో వారిని నేను క్షమిస్తున్నా, ఎందుకంటే ఇది దేవుడి ఆదేశం అయ్యుంటుంది. దేవుడు క్షమించాలని కూడా చెబుతారు’ అన్నారు.

ఈ కేసు ప్రస్తుత పరిస్థితి ఏంటి
గ్రాహం స్టెయిన్స్ హత్య ఆరోపణల్లో హిందూ సంస్థ భజరంగ్ దళ్ సభ్యుడు రవీందర్ కుమార్ పాల్ ఉరఫ్ దారాసింగ్‌ను దోషిగా గుర్తించారు. ఆయనకు మరణ శిక్ష విధించారు.
తర్వాత దారాసింగ్ కోర్టులో క్షమాభిక్ష కోసం అపీల్ చేసుకున్నారు. ఆయన ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చారు.
ప్రస్తుతం దారాసింగ్ కియోంఝర్‌లోని ఒక జైల్లో ఉన్నారు.
తగిన ఆధారాలు లేవనే కారణంతో మిగతా నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.
గ్రాహం స్టెయి,న్స్ ఆయన కొడుకుల హత్యను విచారించిన వాధ్వా కమిషన్ గ్రాహంపై మతమార్పిడుల ఆరోపణలను తోసిపుచ్చడంతోపాటు ఈ హత్యల్లో భజరంగ్‌దళ్ పాత్ర కూడా లేదని కొట్టిపారేసింది.
ఈ హత్యలు జరిగి ఇప్పటికి 20 ఏళ్లైంది. కానీ ఫేక్ న్యూస్, వదంతుల కారణంగా పక్కా ప్రణాళికతో ఇలాంటి వాటికి పాల్పడడం అనేది బహుశా గత కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటి కేసు.
ఈ ఘటన భారత్‌నే కాదు, మొత్తం ప్రపంచాన్నే కుదిపేసింది.
అక్కడ గ్రాహం స్టెయిన్స్ కేసులో కూడా ఫేక్ న్యూస్, వదంతులది చాలా పెద్ద పాత్రే. ఇక్కడ తేడా ఏంటంటే ఇప్పటి వాట్సాప్, సోషల్ మీడియాకు బదులు అప్పట్లో కరపత్రాలు, బ్యానర్లు, జనాన్ని రెచ్చగొట్టే వదంతులను ప్రచారం చేస్తూ వచ్చాయి.

ఆయన మా దృష్టిలో దేవుడు
గ్రాహం స్టెయిన్స్ లెప్రసీ షెల్టర్ హోంలో ఇప్పటికీ ఆయన దగ్గర చికిత్స తీసుకుని వ్యాధి నుంచి కోలుకున్న రోగులు ఉన్నారు.
ఇక్కడ శారదా ద్రదూ అనే 75 ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమెకు కుష్ఠురోగం రావడంతో 25 ఏళ్ల క్రితం ఇంటి నుంచే కాదు, గ్రామం నుంచే బయటకు పంపించేశారు.
గ్రాహం పేరు చెప్పగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘ఆయన మా దృష్టిలో దేవుడు. ఎందుకంటే అయినవాళ్లంతా ఇంటి నుంచి గెంటేస్తే ఆయన నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు. చికిత్స చేశారు, నాకొక గౌరవం ఇచ్చారు’ అన్నారు.
గ్రాహం, ఆయన కొడుకుల హత్య తర్వాత వృత్తిరీత్యా నర్సు అయిన ఆయన భార్య గ్లాడిస్ స్టెయిన్స్ ఏళ్ల పాటు భారత్‌నే తన ఇల్లుగా భావించారు. కుష్ఠురోగులకు సేవ చేశారు.
భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న గ్లాడిస్ 2004లో బీబీసీతో “భారతదేశమే నా ఇల్లు, ఇంటిని ఎవరైనా వదిలి వెళ్తారా” అన్నారు.
సుమారు మూడేళ్ల ముందు గ్లాడిస్ కూడా ఎక్కడికో వెళ్లిపోయారు. తర్వాత తిరిగి రాలేదు. లెప్రసీ హోమ్‌లో అందరూ ఇప్పటికీ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు.
వెళ్లడానికి ముందు నేను నిమాయీ హంసదాను గత కొన్నేళ్లుగా లించింగ్ లేదా మూక దాడులు జరిగాయనే విషయం మీకు తెలుసా అని అడిగాను.
గ్రాహం స్టెయిన్స్ ఆయన కొడుకుల హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన నిమాయీ “అన్నీ తెలుసు. అలాంటివి జరగకూడదు. అన్ని మతాలవారూ పరస్పరం శాంతితో ఉండాలి. లేదంటే ఈ ఘోరాలు జరుగుతూనే ఉంటాయి” అన్నారు.
Courtesy – BBC