– ఇదంతా పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంది
– అవినీతి, అక్రమ సంపాదన, వాణిజ్య పన్ను ఎగవేతలే కారణం: గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ నివేదిక
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థలో భారీ ఎత్తున అక్రమ వాణిజ్య లావాదేవీలు(లెక్కాపత్రం లేనివి) జరుగుతున్నాయని, దీనివల్ల రూ.6.14లక్షల కోట్ల రూపాయలు (దేశ జీడీపీలో 3.05శాతం) పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంటే ఈ డబ్బంతా కూడా అక్రమ సంపాదన, అవినీతి, హవాలా, వాణిజ్య పన్ను ఎగవేతలతో కూడినదని అర్థం. ప్రపంచంలో ఇలాంటి వాణిజ్య అక్రమాలు జరుగు తున్న మూడో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచిం దని అమెరికాకు చెందిన మేథోబృందం ‘గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ’ (జీఎఫ్ఐ) నివేదిక తెలిపింది. నివేదికలో పేర్కొన్న మరికొన్ని విషయా లు ఇలా ఉన్నాయి.
ఎలా తెలుస్తుంది?
ఉదాహరణ1 : అమెరికాకు 20 మిలియన్ డాలర్ల (రూ.147కోట్లు) అరటిపండ్లు ఎగుమతి అయ్యాయని ఈక్వెడార్ వాణిజ్య పన్ను కార్యాల యంలో నమోదైంది. అరటిపండ్లను దిగుమతి చేసుకున్న అమెరికాలో నమోదైన లెక్క 15 మిలియన్ డాలర్లు (రూ.110కోట్లు). తేడా 5 మిలియన్ డాలర్లు (రూ.36కోట్లు) ఉంది.
ఉదాహరణ-2 : దేశ సరిహద్దుల గూండా మాదక ద్రవ్యాలు మాఫియా చేతిల్లోకి చేరుతాయి. మాఫియాగ్రూపులు ఎంచక్కా డాలర్లరూపంలో సరఫరాదార్లకు నగదు చెల్లిస్తున్నారు. సరఫరాదార్లు కోరిన దేశానికి తుప్పుపట్టిన, సెకండ్ సేల్స్ కార్ల ఎగుమతి పేరుతో డాలర్లను చెల్లిస్తున్నారు. పై రెండూ అక్రమ వాణిజ్య లావాదేవీలే.
135 దేశాల్లో అధ్యయనం
వాణిజ్య సంబంధిత ఆర్థిక అక్రమాలు-135 అభివృద్ధి చెందిన దేశాలు : 2008-17..పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. భారత్లో 2017లో వాణిజ్య అక్రమ లావాదేవీల మొత్తం 83.5 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో ఇది రూ.6.14లక్షల కోట్లకు సమానం. వార్షిక జీడీపీలో 3.05శాతం. భారత వాణిజ్య ఎగుమతులు, దిగుమతుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాణిజ్య పన్నుల వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటం వల్లే ఇదంతా జరిగిందని జీఎఫ్ఐలో పనిచేస్తున్న సీనియర్ ఆర్థికవేత్త రిక్ రౌడెన్ అభిప్రాయపడ్డారు.
టాప్ 10లో భారత్
2007-2017 మధ్య పదేండ్ల కాలానికి సంబంధించి అక్రమ వాణిజ్య లావాదేవీల వివరాల్ని నివేదిక బయటపెట్టింది. పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకున్న వాణిజ్య లావాదేవీలను లెక్కగట్టారు. మనదేశంలో ఏటా సగటున 77.9 బిలియన్ డాలర్ల (రూ.5.72లక్షల కోట్లు) అక్రమ వాణిజ్య లావాదేవీలు జరిగాయి. 2017లో వాణిజ్య అక్రమ లావాదేవీల విలువ రూ.6.14లక్షల కోట్లు (83.5 బిలియన్ డాలర్లు). దీనికి సంబంధించి 135 దేశాల జాబితాలో భారత్ ప్రతిఏటా టాప్-10లో నిలిచింది.
Courtesy: NT