అడవి బిడ్డలు మన పౌరులు కారా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హరితహరం, పర్యావరణం పేరిట తెలంగాణ ప్రభుత్వం పోడు సేద్యం చేసుకుని జీవిస్తున్న మోరియా గిరిజనులను వారి భూముల నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నది. బాక్సైట్ పేరుతో మోరియా గిరిజనులును చిన్నాభిన్నం చేస్తున్నప్పుడు, యురేనియం పేరుతో చెంచుల పాదాల కింద నేలతో పరిహాసం ఆడుతున్నప్పుడు ఈ ప్రభుత్వానికి పర్యావరణ సమతూకం, వాతావరణ పరిరక్షణ గుర్తు రాలేదా? అడవి బిడ్డలను అడవులకు దూరంగా తరుముతూ, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఆధునిక ప్రభుత్వాలు వారి పట్ల వివక్షను పాటిస్తూనే ఉన్నాయి.

నాగరికులమనే అహంతో సాటి మనుష్యుల్ని మనుషులుగా గౌరవించని అనాగరిక వాతావరణం ఆధునిక మానవుల్లో కనిపిస్తుండగా, ఆధునిక ప్రభుత్వాలు కూడా అదే ఒరవడిని సాగిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల సమస్య వచ్చినప్పుడు స్థానిక గిరిజనులు, గొత్తికోయలు అనబడే మోరియా జాతి గిరిజనులు పట్ల విభజించి పాలించే ధోరణిలో మాట్లాడింది. అంతేగాక మోరియా తెగ సేద్యం చేసుకుంటున్న పోడు భూములపై ఒత్తిడి తెచ్చింది. మీడియాలో సైతం వారిని నేర పూరిత మనస్తత్వం ఉన్న తెగగా చూపెడుతూ వార్తలు వెలువడ్డాయి.

మోరియా తెగ గిరిజనుల ఒకప్పటి నివాసం దట్టమైన దండకారణ్యం. ప్రస్తుత ఛత్తీస్‌గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో నివసించేవారు. రాజ్యాంగ యంత్రం ఉక్కు పాదం మోపడంతో ప్రస్తుతం చెల్లా చెదురై ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళ నాడు వరకు చెదిరిపోయారు. తమ రెక్కల కష్టాన్ని చౌకధరకు అమ్ముతూ చెట్టుకొకరూ పుట్టకొకరై జీవిస్తున్నారు. ఆహారపు అలవాట్లు గమనిస్తే వీరు ఎంత వెనుకబడిన తెగవారో అర్థం అవుతుంది. తాళింపు ఎలా ఉంటుందో వీరికి తెలియదు. అడవిలో, చెలకల్లో దొరికే పచ్చి గోంగూరను నీళ్ళలో ఉడక పెట్టుకొని తింటారు. అడవులలో లభించే కాయ, గరుగు వీరి ప్రధాన ఆహారం. వీరికి మిర్చి పండించడం తెలియదు కాని అదంటే వల్లమాలిన ఇష్టం! ఖమ్మం, వరంగల్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో భూములు ఆక్రమించిన నాగరిక జాతులు వందల ఎకరాలలో మిర్చి వాణిజ్య పంట సాగుచేసి కళ్ళాల్లో ఆరబోస్తే, అడవుల్లో తిరిగే మోరియా గిరిజనులు మిర్చిని తీసుకెళ్ళడానికి ప్రయత్నించేవారు. నాగరిక భూస్వాములు గూండాలతో దాడిచేయించి దొరికిన గిరిజనులను చంపేసేవారు. ఈ ఉదంతాలపై ఏ కేసులూ ఉండేవి కావు. నలభైఏళ్ళ క్రితం నుంచి ఏజెన్సీ పోలీసు రికార్డులు తిరగేస్తే ఈ విషయం అవగతం అవుతుంది. మోరియా గిరిజనులు సామూహికంగా కల్లాలపై దాడిచేసి మిర్చిని ఎత్తుకుపోయినప్పుడు, వారిపై కేసులు పెట్టే క్రమంలో భూస్వాములు ఈ తెగ గురించి తెలియక, కోయలను పోలి ఉంటారు కనుక కత్తికోయలుగా పేర్కొనేవారనీ, క్రమేణా అది గొత్తికోయలుగా మారిందని అంటారు. భయంకరమైన దొంగలుగా అప్పట్లో వీరిపై జరిగిన ప్రచారం కారణంగా, నాగరిక సమాజం దృష్టిలోను, ప్రభుత్వాల దృష్టిలోను వారి నేటికీ నేరస్థులుగానే మిగిలిపోయారు.

మోరియా తెగ బలవంతంగా వలసలకు గురికావటం వెనుక ఛత్తీస్‌గడ్ రాజకీయ నేపథ్యమూ ఉంది. ఇరవై ఏళ్ల క్రితం దండకారణ్యంలో పెద్ద రాజకీయ ఉపద్రవం వచ్చింది. దండకారణ్యంలో మోరియా గిరిజన తెగ ఉన్న ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పట్టు సాధించింది. ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం మావోయిస్టులను నేరుగా ఎదుర్కోలేక మహేంద్ర కర్మ నేతృత్వంలో సల్వాజుడుం పేరిట ఒక ప్రైవేటు సేనను ఏర్పాటు చేసింది. మోరియా గిరిజనులు నక్సలైట్లకు మద్దతుగా నిలిచారని భావించిన సల్వాజుడుం సేనలు వారి గ్రామాల పైబడి హింసా కాండకు తెగబడ్డాయి, ఊళ్ళకు ఊళ్ళు తగులబెట్టాయి. సల్వాజుడుంకు ప్రతిగా మావోయిస్ట్ పార్టీ భూంకాల్ మిలీషియా అనే సంస్థను స్థాపించడంతో ఈ రెండు సంస్థల మధ్య జరిగిన పోరాటాంలో గిరిజన తెగ నలిగిపోయి, సుమారు లక్ష దాకా గిరిజన కుటుంబాలు కట్టుబట్టలతో, కావడి బద్దలతో, కుటుంబాలతో సహ ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దు అడవుల్లోకి పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. ఫారెస్టు సిబ్బంది వేధింపులు భరించలేక కొందరు తెలుగు రాష్ట్రం దాటిపోగా, మరికొందరు అటవీ ప్రాంతాల్లోనే ఆవాసం ఏర్పరచుకొని పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్నారు. నాటి ఉమ్మడి రాష్ట్రంగానీ, నేటి తెలంగాణ రాష్ట్రంగానీ వీరిని మానవీయ కోణంలో చూడడం లేదు. వీరికి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ ప్రభుత్వాలు ఇవ్వటం లేదు. ఫలితంగా వీరు పోడు భూములపై హక్కులేక, సరైన పౌష్టికాహారం లేక రక్తహీనతతో మరణిస్తున్నారు. అడవుల్లో ఆకులు అలములు తింటూ తిరిగే వీరి పిల్లలకు అక్షర జ్ఞానం అందడం లేదు. మోరియా గిరిజనులపై దొంగలని, హంతకులని ముద్రలు వేసి ప్రచారం చేయటం, మానవీయ కోణంలో వీరిని చూడలేకపోవడం నాగరిక ప్రపంచ వివక్షకు నిదర్శనం. తోటి దేశ పౌరులుగా సభ్యసమాజం, ప్రభుత్వాలు వీరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది.

హరితహరం, పర్యావరణం పేరిట తెలంగాణ ప్రభుత్వం పోడు సేద్యం చేసుకుని జీవిస్తున్న మోరియా గిరిజనులను వారి భూముల నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నది. బాక్సైట్ పేరుతో మోరియా గిరిజనులును చిన్నాభిన్నం చేస్తున్నప్పుడు, యురేనియం పేరుతో చెంచుల పాదాల కింద నేలతో పరిహాసం ఆడుతున్నప్పుడు ఈ ప్రభుత్వానికి పర్యావరణ సమతూకం, వాతావరణ పరిరక్షణ గుర్తు రాలేదా?

గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్వల్ప నిధులను ఎలా ఖర్చు చేయాలన్న విషయంపై అటు ప్రభుత్వాలలో కాని, ఇటు అధికారులలో కాని స్పష్టత లేదు. వారికి కేటాయించిన నిధులేవీ ఖర్చు కాకుండా మిగిలిపోవటమే దీనికి నిదర్శనం. గిరిజనుల భూముల పరిరక్షణకు 1/70చట్టం చేయబడింది కాని అదీ సక్రమంగా అమలు జరిగిన దాఖలాలు లేవు. గిరిజన గురుకులాలు నడుస్తూనే ఉన్నా వారి అక్షరాస్యత30శాతంగానే ఉండడం, గిరిజన మహిళల అక్షరాస్యత మరింత దిగజారి 25శాతానికి చేరడం విచిత్రం. గిరిజనుల జీవన స్థితిగతుల గురించి కాని, వారికి విద్యా వైద్య సదుపాయాల గురించి కాని పాలకులు చిత్తశుద్ధితో ఆలోచించడం లేదు. అడవి బిడ్డలను అడవులకు దూరంగా తరుముతూ, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఆధునిక ప్రభుత్వాలు వారి పట్ల వివక్షను పాటిస్తూనే ఉన్నాయి. మూలవాసులపై ఇంకెన్నాళ్ళు ఈ మూర్ఖ వివక్ష?

యన్. తిర్మల్

Courtesy andhrajoythi

RELATED ARTICLES

Latest Updates