బతుకే లేనప్పుడు ఊరుంటే ఏం లాభం?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రాజెక్టులో భూములన్నీ పోయినై.. కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్నం
మల్లన్నసాగర్‌ నిర్వాసితుల ఆవేదన
కోర్టు స్టే కాదని కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కు
బాధితులు అడ్డుకుంటున్నారని రాత్రివేళ కట్ట పనులు
నవతెలంగాణ-గజ్వేల్‌/తొగుట
‘మా భూములు మల్లన్నసాగర్‌ కాల్వల పోయినై. ఏడాదిగా పను ల్లేక అవస్థలు పడుతున్నాం. సర్కారోళ్లు భూములు తీసుకోకముందు మస్తుమాటలు జెప్పి పనులైతే చూయిస్తలేరు. కన్నీళ్లతో కడుపు నింపు కుంటున్నం. దిక్కులేనోళ్లకు ఊరుంటే ఏంది.. పోతే ఏంది?’ అంటూ మల్లన్నసాగర్‌ నిర్వాసితులు తమ గోడు వినిపిస్తున్నారు. కోర్టు స్టేను ఉల్లంఘించి అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బాజాప్తుగా పనులకు పూనుకుంటున్నారు. ఎంతమంది ఉపాధి కోల్పోతున్నరో ఇంటింటికీ తిరిగి సర్వే చేయకుండా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కేస్తున్నారు. గత పదిరోజులుగా తోగుట నిర్వాసితులు అడ్డుపడుతున్నారని మూడ్రో జులుగా రాత్రివేళ మల్లన్నసాగర్‌ కట్ట పనులు కొనసాగిస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం, పునర్‌ ఉపాధి కోసం సిద్దిపేట జిల్లా తోగుటకు చెందిన 73 మంది నిర్వాసితులు కోర్టుకెళ్లారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు పనులు చేపట్టొద్దని స్టే కూడా విధించింది. ఈ నేపథ్యంలో తూతూమంత్రంగా సర్వే చేపట్టి మధ్య లోనే ఆపేసి పనులు కొనసాగించారు. బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించడంతో సీరియస్‌గా పరిగణించింది. తొగుట రెవెన్యూ అధికారులు, ఎస్‌ఐకి జైలు శిక్ష కూడా ఖరారు చేసింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు, అధికారులు మళ్లీ పనులు చేపట్టారు. కోర్టు తీర్పును ఉల్లంఘించొద్దని ఉత్తర్వుల కాపీ అధికారులకు చూపెట్టినా వాటిని చిత్తుకాగితాలుగా అభివర్ణించారు. దీంతో ఆగ్రహించిన నిర్వాసితులు న్యాయం జరిగేదాకా పనులు చేయొద్దని గత పది రోజులుగా ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు జరిగే ప్రదేశంలో ఆందోళన చేస్తున్నారు. అయితే పొద్దంతా పనులు అడ్డుకుంటున్నారని గత మూడురోజులుగా రాత్రివేళల్లో రోజుకు మూడు కిలోమీటర్ల చొప్పున పనులు చేస్తున్నారు.
భూములిచ్చినంక పట్టని హామీ
గతంలో మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఆర్డీవోలు ఇతర గ్రామాల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఏ ప్యాకేజీ ఇస్తామో ఇక్కడ కూడా దాన్నే వర్తింపజేస్తామని చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. మల్లన్నసాగర్‌ కట్ట కాలువ పనుల్లో తొగుట మండల కేంద్రానికి చెందిన 150 మంది రైతులు 2600 ఎకరాలు కోల్పోయారు. గ్రామంలో మొత్తం 3600 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 300 కుటుంబాలకు ఆ భూమే జీవనాధారం. ప్రస్తుతం అక్కడ ఎకరాకు రూ.15 లక్షల నుంచి 20 లక్షల వరకు ధర పలుకుతున్నది. ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.6లక్షలు చెల్లిస్తున్నది. అదే వేములఘాట్‌లో మూడేండ్లు రిలేదీక్షలు చేయడంతో సర్కార్‌ దిగొచ్చి రూ.11 లక్షలు చెల్లించింది. దీంతో మంత్రి, అధికారుల ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని నిర్వాసితులు ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించలేక దినదినగండంగా గడుపుతున్నారు. ఉపాధి కోసం గజ్వేల్‌, సిద్దిపేట, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. మరికొందరు పక్క గ్రామాల్లోని పంటలకు కలుపుతీసేందుకు, ఎరువు చల్లేందుకు వెళ్తున్నారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు విగ్రహల వద్ద అన్నదానంతోనే కడుపు నింపుకున్నారంటే వారి దయనీయ పరిస్థితి అర్థమవుతున్నది.
ఇంత ఇసమిచ్చి గుంజుకోండ్రి : పతుకుల పెంటయ్య
ఊరు ఉంచి భూములు తీసుకున్నరు. ఎట్లా బతకాలో సర్కార్‌ చూయించాలే. లేదంటే ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి. కొడుకు, కోడళ్లను, పిల్లలను కోళ్లను కమ్మినట్టు గంప కింద కమ్మల్నా. సార్లు చెప్పాలి. లేదంటే ఇంత ఇసమిచ్చి భూములు గుంజుకోండ్రి. మా గొంతుల పానం ఉండంగా మాత్రం భూమియ్యం.
బతుకుదెరువులో మన్నుపోసిండ్రు : పయ్య లక్ష్మి, వ్యవసాయ కూలీ
ఆకలి ఎలా తీర్చు కోవాలో తెలియడం లేదు. తెల్లారితే ఆగం ఉంది. పోరగాళ్లు ఎట్టా బతకాలి. వారిని ఎట్లా సాదాలి. ఉన్న బతుకు దెరువులో సర్కార్‌ మన్ను పోసింది. రెక్కలతో కష్టం చేసుకుందామంటే పని కూడా లేదు. పొద్దు ఏట్లా గడుస్తదోనని ఆందోళన పడుతున్నం.

Courtesy Navatelangana

 

RELATED ARTICLES

Latest Updates