నిజానికి కరోనా వైరస్ మనిషిని చంపదు. ఏ వైరస్ కీ మనిషిని చంపేటంత శక్తి ఉండదు. అందుకే యాంటీ వైరల్ మందులపై పెద్దగా పరిశోధనలూ ఉండవు. ఏమీ చేయలేని వాటిపై కోట్లకు కోట్లు పెట్టి పరిశోధనలు చేయడం దండగే కనుక. ఐతే కరోనా సోకితే మరణాలెందుకు జరుగుతున్నాయి?
కరోనా వైరస్ ఐనా మనిషి శరీరంలో వారం పదిరోజులకు మించి ఉండదు. అది శరీరంలో వృద్ధి చెందడం ఆపేశాక, శరీరం అపుడు రెస్పాండవడం మొదలౌతుంది. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరగడమంటారు కదా.. సరిగ్గా అలాగేనన్నమాట. శరీరంలోని ఇమ్యున్ సిస్టం కొంతమందిలో హైపర్ రియాక్షన్ చూపుతుంది. దానితోనే అసలు కష్టం. ఏ పేషంట్ లో ఎంత హైపర్ రియాక్షన్ చూపుతుంది అనేది చెప్పలేం. ఈ రియాక్షన్ ఎంతకాలం ఉంటుందో కూడా చెప్పలేం. అది వారి జన్యువులను బట్టి కూడా నిర్ణయమౌతుంది. ఒక్కోసారి వారి అవగాహన బట్టి కూడా.
సరైన సమయంలో, అంటే ఈ హైపర్ రియాక్షన్ మొదలైన ఆరు గంటలలోపు ట్రీట్మెంట్ మొదలుపెడితే అసలే ఇబ్బందులూ లేకుండా ఈ హైపర్ రియాక్షన్ ని తగ్గించగలం. అలా కాకుండా ఆలస్యం చేసే కొద్దీ అది పడగ విప్పిన పాములాగా మరింత క్రూరంగా తయారవుతూ పోతుంది.
ఒక స్టేజ్ కి చేరిన తరువాత ఆ వేగాన్నీ విషాన్నీ కంట్రోల్ చేయడం ఎవరి తరమూ కాదు. అందుకే
1. ఎపుడు వైరస్ బాడీలోకి ఎంటర్ అయింది.
2. ఎపుడు బాడీ రియాక్షన్ చూపడం మొదలైంది.
3. ఎపుడు హైపర్ రియాక్షన్ చూపడం మొదలైంది 4.అది తీవ్రమై ఎంతకాలం బాడీలో ఉండబోతోంది అనే నాలుగు దశలను పాథో ఫిజియాలజీ అంటారు. EBM ద్వారా ట్రీట్ చేయగల వైద్యుడు పై అన్ని దశలకూ ఎలా ట్రీట్మెంట్ చేయాలో తెలిసి ఉంటాడు.
మొదటి రెండు దశలలో గల వారికి ట్రీట్మెంట్ చేయడం సులభం. మూడోదశలో ఆలస్యం చేసిన వారు నాలుగో దశకు వెళ్ళిపోతారు. ఈ రెండు దశలలో వారికి ట్రీట్మెంట్ చేయడం కష్టం. ముఖ్యంగా హైపర్ రియాక్టివిటీ తీవ్రంగా ఉన్న నాలుగవ దశలో దాదాపు ఏ మందూ పని చేయకపోవచ్చు.
అసలు మొదటి రెండు దశలలో పిచ్చి పిచ్చి మందులు వేసుకునే వారు మూడో దశలోకి వెళ్ళే అవకాశం ఉంది. కనీసం మూడవదశలో కూడా అలర్ట్ కాలేని వాళ్ళకు ఇహ మరోమార్గం లేదు.
అందుకే EBM డాక్టర్ ఈ దశల మీద పూర్తి అవగాహన తో ట్రీట్మెంట్ చేస్తాడు. వేరే సో కాల్డ్ వైద్యులు రెండవదశలో లక్షణాలు తగ్గిపోగానే తాము కరోనాని తగ్గించేశామని విర్రవీగి పోతుంటారు. అలాంటి వారికి మూడవ దశలో బాడీలో మొదలై మూడునాలుగు రోజుల్లో విజృంభించే cytokine storm అన్నా macrophage activation syndrome అన్నా కనీస అవగాహన కూడా ఉండదు.
మిత్రులారా..! సైంటిఫిక్ గా ఉండండి.
సైన్సుని తెలుసుకోండి.
జీవితం ఊరికే రాదు.
-డాక్టర్ విరించి విరివింటి