క్యాబ్ బిల్లుని చట్టబద్ధం చేయడం ద్వారా ఎన్నో ఏళ్లుగా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన ఇండియా ప్రమాదకరమైన పరిస్థితులని ఆహ్వానించేలా ఓ నిర్ణయాత్మక అడుగు ముందుకు వేసిందనే చెప్పొచ్చు. మతపరమైన విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పౌరునికీ సమాన హక్కులు అనే అత్యున్నతమైన రాజ్యాంగ విలువకి వీడ్కోలు పలికేలా,ముస్లింలని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే ప్రయత్నాలకి ఊతమిచ్చేలా ఈ చట్టం ఉంది.
ఇది ఖచ్చితంగా ఇండియాని హిందూ దేశంగా మార్చే ప్రక్రియలో భాగంగా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమే ఔతుంది. ఐతే ఈ సమయంలో ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షాలపై ఎలాంటి ఆశలూ పెట్టుకునే పరిస్థితులు లేవనేదీ స్పష్టమే.
ఈ బిల్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని చాలామంది కోర్టులని ఆశ్రయిస్తారనే విషయంలో నాకెలాంటి సందేహం లేదు ఐతే అంతకన్నా ముందు దీన్ని మనం ఓ చట్టపరమైన,రాజ్యాంగ సమస్యలానే కాక రాజకీయ,నైతిక సమస్యగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.
ఈ బిల్లుకి వ్యతిరేకంగా అహింసాయుతమైన నిరసనలు ఏ విధంగా తెలియజేయాలనే నేను అన్వేషిస్తున్న క్రమంలో మహాత్మా గాంధీ 1930 లో చేసిన సహాయ నిరాకరణోద్యమం గుర్తొచ్చింది. అప్పటి ఒకానొక బ్రిటిష్ చట్టానికి నిరసనగా దండి ప్రాంతంలో ఉన్న సముద్రతీరంలో ఉప్పుని తయారు చేసి గాంధీతో పాటూ సుమారు 60,000 మంది జైలుకి పంపబడ్డారు. ఈ విధానం ప్రకారం ఏ నిరసనకారుడైనా రాజ్యం ప్రతిపాదించిన ఒక సమస్యాత్మక చట్టాన్ని అతిక్రమించడమే కాదు,అందుకు శిక్ష విధించమని కూడా డిమాండ్ చేయాలి. అప్పుడు రాజ్యానికి వారిని శిక్షించడమో లేక చట్టాన్ని రద్దుచేయడమో తప్ప వేరే ఆప్షన్లేం ఉండవు.
కానీ క్యాబ్ మరియు NRC చట్టాల విషయంలో ఈ పద్ధతి వర్కౌట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే కేవలం ఇండియన్ ముస్లింలు మాత్రమే శిక్షించబడే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎలాగూ ఈ చట్టం ఉద్దేశ్యం మతాధారితంగా కొందరిని పక్కనపెట్టడమే కాబట్టి నేను ఆ చట్టాన్ని అతిక్రమించినా నా మతం కారణంగా శిక్షించబడకపోవచ్చు. తద్వారా నిరసన ఉద్దేశ్యం కూడా నెరవేరకపోవచ్చు.
2017 లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ముస్లిం దేశాల నుంచి వచ్చే వలసదారులపై ఆంక్షలు విధించినప్పుడూ కొంతమంది అమెరికన్లు ఎయిర్ పోర్ట్ల దగ్గర వారి సహ ముస్లిం ప్రయాణీకులకి మద్దతుగా బ్యానర్లు,ప్లకార్డులు ప్రదర్శించారు. ఐతే మేడలీన్ అల్బ్రైట్ అనే ఒకావిడ తాను తన పూర్వపు మతవిశ్వాసాలన్నీ వదిలేసి ముస్లింగా నమోదు చేసుకుంటానని ప్రకటించిన ట్వీట్ నన్ను ఆ సమయంలో బాగా ఆకర్షించింది.
సిక్కుల కుటుంబంలో పుట్టిన నేను కూడా క్యాబ్ మరియు NRC కి వ్యతిరేకంగా నా అఫిషియల్ ప్రభుత్వ రికార్డుల్లో మతాన్ని మార్చుకున్నట్టైతే అప్పుడు చట్టాన్ని అతిక్రమించి కూడా శిక్షనుంచి తప్పించుకోకుండా ఉండగలిగే పరిస్థితి నాకు ఎదురయ్యే అవకాశం లేదు కాబట్టి నా నిరసన ఉద్దేశ్యం నెరవేరే అవకాశాలే ఎక్కువ.
ఇది మీకు కలలా అనిపించొచ్చు కానీ మత విశ్వాసాల ఆధారితంగా కొంతమంది వ్యక్తుల హక్కులని లాక్కొని,ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చడానికి ప్రయత్నించే చట్టాలకి నిరసనగా ఎంచుకున్న ఈ విధానంలో ఏవైతే నైతికపరమైన అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించబడతాయి. మన దేశంలో కేవలం పేర్ల ద్వారా మతాన్ని తెలుసుకునే వెసులుబాటు లేదు,అధికారిక ప్రభుత్వ రికార్డుల్లో తప్పిస్తే. మా కుటుంబంలో అందరి పేర్లు కూడా అన్ని సంస్కృతుల మేళవింపుతో మోడిఫై చేయబడ్డాయి కాబట్టి నా సాటి ముస్లిం సోదరులపై ఏవైతే ఆంక్షలు విధించబడతాయో అవన్నీ నాపైనా విధించాల్సిందే అని డిమాండ్ చేస్తాను.
అంబేద్కర్ గారు చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి పౌరులందరి మధ్యా సౌభ్రాతృత్వం,సోదరభావం ఉండి తీరాలి కాబట్టి నేను ఈవిధంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాను. ఇందులో నేను ఒంటరినైపోతాననుకోవడం లేదు,మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడానికి మీరంతా కూడా ఈ నిరసన విధానాన్ని స్వీకరించడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.