ఇటు చలి పులి.. అటు కోరలు చాస్తున్న కాలుష్యం
నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యత
ఈ నెల తొలి వారంలో పరిస్థితి మరీ దారుణం
ఓవైపు చలి క్రమంగా పెరుగుతోంది.. మరోవైపు భాగ్యనగరంలో కాలుష్యం కోరలు చాస్తోంది. వాయు నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్వచ్ఛమైన గాలి సుదూరమవుతోంది. ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ధూళికణాల తీవ్రత ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. గత మూడు నెలలతో పోలిస్తే డిసెంబరు తొలి వారంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా గోచరిస్తోంది. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ) గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. వేసవి, వర్షాకాలాలతో పోలిస్తే శీతాకాలంలో కాలుష్య తీవ్రత అధికంగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
దేశంలోని 100 నగరాలు, పట్టణాలకు సంబంధించి ఏక్యూఐని నిత్యం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) విడుదల చేస్తోంది. ఆయా ప్రాంతాల్లోని సీఏఏక్యూఎంఎస్ (కంటిన్యూస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్)లో సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 10), అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5), నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమ్మోనియా తదితర ఎనిమిది రకాల కాలుష్య ఉద్గారాల తీవ్రతను సాయంత్రం నాలుగు నుంచి మర్నాటి సాయంత్రం 4 గంటల వరకు (24 గంటలు) లెక్కిస్తోంది. ఆయా ఉద్గారాల సగటు ఆధారంగా ఏక్యూఐని రూపొందించి నివేదికను విడుదల చేస్తోంది.
సూక్ష్మధూళి కణాల తీవ్రత
అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5), సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 10) నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తల వెంట్రుక మందం 50 మైక్రోగ్రాములు కాగా అతి సూక్ష్మ ధూళికణం వెంట్రుక మందంలో 20వ వంతుంటుంది. ఊపిరి పీల్చుకోవడమే ఆలస్యం.. అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతోంది. వెంట్రుక మందంలో అయిదో వంతుండే పీఎం 10.. ఊపిరి పీల్చుకోకుండా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తుంది. గాలిలో అయా కణాల పరిమాణం ఎంత మొత్తంలో ఉండొచ్చో సీపీసీబీ, డబ్ల్యూహెచ్వో పేర్కొన్నాయి.
(Courtesy Eenadu)