ఇంతకీ తెలంగాణను భస్మీపటలం చేయటానికి వస్తున్న ఆ భూతం పేరేమిటో తెలుసుకుందాం! అదే యురేనియం. భూమి లోపల వుండే అత్యంత ప్రమాదభరితమైన ఒక భార ఖనిజం. ఈ ఖనిజంతో చేయగలిగినవి రెండు అంశాలు వుంటాయి. ఒకటి విద్యుచ్చక్తి తయారీ, రెండోది విద్యుచ్చక్తి తయారీ క్రమంలో విడుదల అయిన ఇతర మూలకాలతో ఆటం బాంబు తయారు చేయటం. భూమి అట్టడుగు పొరల్లో వున్నంతసేపు దీని నుంచి ఏ ప్రమాదమూ వుండదు. కానీ దాన్ని ఛేదించి బయటకు వెలికి తీసిన మరుక్షణం నుంచి దాని అణుధార్మిక శక్తి పర్యావరణంలోకి ప్రవేశిస్తుంది. దీని ప్రభావం అత్యంత హానికరం.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నిండా ఐదు సంవత్సరాలు గడిచాయో లేదో ఒక పెనుభూతం తెలంగాణ చిత్రపటాన్నే మార్చి వేయటానికి నిశ్శబ్దంగా రంగం సిద్ధపరచుకుంటోంది. ఈ భూతం ఇంతకు ముందు కూడా ఇక్కడకు రావాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, ప్రజలు సంఘటి తంగా వ్యతిరేకించడంతో తన ప్రయత్నాలను విరమించు కున్నట్లే అనిపించింది. అయితే, అది మళ్ళీ తన ప్రయత్నాలను చేసుకుంటోందని తేటతెల్లమైపోయింది. తెలంగాణాకు మణిహారంలా వుండే నల్లమల అటవీప్రాంతాన్ని కబళించాలని అ భూతం సాంకేతికంగా ఏ సమస్యలు రాకుండా ‘దేశ అభివృద్ధి’ పేరుతో తనకు అవసరమైన అన్ని అనుమతులనూ రప్పించుకుంటోంది.
ఇంతకీ తెలంగాణను భస్మీపటలం చేయటానికి వస్తున్న ఆ భూతం పేరేమిటో తెలుసుకుందాం! అదే యురేనియం. భూమి లోపల వుండే అత్యంత ప్రమాదభరితమైన ఒక భార ఖనిజం. ఈ ఖనిజంతో చేయగలిగినవి రెండు అంశాలు వుంటాయి. ఒకటి విద్యుచ్చక్తి తయారీ, రెండోది విద్యుచ్చక్తి తయారీ క్రమంలో విడుదల అయిన ఇతర మూలకాలతో ఆటం బాంబు తయారు చేయటం. భూమి అట్టడుగు పొరల్లో వున్నంతసేపు దీని నుంచి ఏ ప్రమాదమూ వుండదు. కానీ దాన్ని ఛేదించి బయటకు వెలికి తీసిన మరుక్షణం నుంచి దాని అణుధార్మిక శక్తి పర్యావరణంలోకి ప్రవేశిస్తుంది. దీని ప్రభావం అత్యంత హానికరం. కేవలం తవ్వి తీసిన చోటినుంచే కాదు, అనేక దూరప్రాంతాలకు కూడా ఈ హానికారకమైన అణుధార్మిక వాయువులు ప్రయాణించి గాలిని, నీటిని, సమస్త జీవ జంతుజాలాన్ని ప్రభావితం చేస్తాయి. మామూలుగా చెబితే ఇదంతా అర్థమయ్యే అంశం కాదు. అందుకే ఈ ఖనిజం అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవటం అత్యంత ముఖ్యమైనది. ఈ ఖనిజానికున్న అసాధారణ శక్తి అణు ధార్మికత. దానితో పాటు పరమాణు విచ్ఛేదక శక్తి కూడా వుంది. అదే ఆటంబాంబు తయారీకి మూలం.
అణుశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచి 2030 నాటికి దేశమంతా విద్యుత్ అవసరాలు తీర్చడమే తన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ లక్ష్య ప్రకటనలో నల్లమల ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం ఉనికే ఇప్పుడు ప్రశ్నార్ధక మవుతోంది. అక్కడ నివసించే అత్యంత ఆదిమ చెంచు తెగల జీవన భద్రత కూడా ప్రమాదంలో ఉన్నట్లే. ఒకప్పుడు పులుల రక్షణ కోసమంటూ వారిని అడవి నుంచి బయటకు తరమటానికి ఎన్ని కుటిల ప్రయత్నాలు ప్రభుత్వాల వైపు నుంచి జరిగాయో అందరికీ తెలుసు. ఇప్పుడు దేశ అభివృద్ధి కోసమంటూ పులులనే కాదు, అడవిని, అడవితో పెనవేసుకున్న ఆదివాసీ జీవనభద్రతనీ, అడవితోవున్న ప్రాచీన, చారిత్రక శైవ క్షేత్రాల ఉనికిని కూడా పణంగా పెట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. యురేనియం నిక్షేపాలు అత్యంత భారీ స్థాయిలో ఉన్నాయనేది అణుశక్తి శాఖ చెబుతున్న విషయం. ఈ నిక్షేపాలు గుర్తించడానికి నాలుగువేల బోర్లు ఎనభైమూడు చదరపు కిలోమీటర్లలో ఏకధాటిగా అడవిలో వేస్తూ వెళతారు. అణుశక్తిశాఖ ప్రతిపాదనలో చాలా పరిమితులున్నప్పటికీ దేశ అభివృద్ధి, ప్రయోజనాల కోసం ఈ నిక్షేపాల అన్వేషణకు అనుమతి ఇస్తున్నాం అని 2019 మే 22 న పర్యావరణ, అటవీ శాఖ చెప్పటం ఎంత వరకు సబబు?
పైగా ఇక్కడ లభ్యమవ్వబోయే యురేనియం ఖనిజం ఎంతో అత్యుత్తమమైనదని చెప్పటం ద్వారా ఎవరూ ఏమీ వ్యతిరేకించకూడదు అనే బెదిరింపు కూడా కనిపిస్తోంది. నిజానికి, ఎక్కడ యురేనియం నిక్షేపాలు వున్నాయని తెలిసినా మొట్టమొదట చెప్పే అంశమే ఇది. ఇంతకూ ముందు 2003లో నాగార్జునసాగర్‌ని ఆనుకునేవున్న అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా లంబాపూర్, పెద అడిసర్లపల్లిలో యురేనియం తవ్వకాలను, శుద్ధి కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదన సమయంలో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. పైగా ఇవన్నీ సాంకేతిక పరమైన అంశాలనీ, ప్రజలకు అర్థం కావని కూడా చెప్పారు. ఆ అంశాలనే ప్రజలు వివరించి, ప్రశ్నించి తమ జీవనానికే ముప్పుగా పరిణమించబోతున్న యురేనియం తవ్వకాలను, శుద్ధికర్మాగారం ఏర్పాటును సంఘటితంగా తిప్పికొట్టారు.
అక్కడ సాధ్యం కాదనుకున్న అణుశక్తి శాఖ 2008 నుంచీ నల్లమల అటవీ ప్రాంతంలో తన అన్వేషణను మొదలుపెట్టింది. అప్పటి నుంచి ప్రజల వ్యతిరేకత వున్నప్పటికీ చాపకింది నీరులాగా అనుమతులను తెచ్చుకుంటూ ఇప్పుడు ఏకంగా అటవీ ప్రాంతమంతా జల్లెడపట్టెయ్యటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
యురేనియం ఖనిజానికి వున్న అణుధార్మికశక్తి స్వభావాన్ని కనుగొని వంద సంవత్సరాలు నిండాయి. అయితే, ఇది ఎంత విధ్వంసం సృష్టించగలదో ప్రపంచ దేశాలకు అర్థమయింది మాత్రం రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే. ఆ విధ్వంసానికి సాక్ష్యంగా హిరోషిమా, నాగసాకీ పట్టణాలు నిలిచివున్నాయి. అక్కడి ప్రజలు ఇప్పటికీ ఆ దుష్పరిణామాలను ఎదుర్కుంటూనే ఉన్నారు. విద్యుత్ అవసరాలకోసం అంటూ ముందుకు తీసుకు వస్తున్న ఈ విధ్వంసకర ప్రతిపాదనలన్నీ అంతకు ముందు జరిగిన ప్రమాదాలను ఎందుకని పరిగణనలోకి తీసుకోవటం లేదు? సాంకేతికంగా రక్షణ చర్యలు తీసుకుంటాం అని చెప్పొచ్చు గాక! కానీ, అసలు మూల ఖనిజమే అత్యంత ప్రమాదభరితం కదా! ఈ అంశాన్ని ఎందుకని విస్మరిస్తున్నారు? అంటే, ప్రజలకు చెప్పకూడని అంశాలేవో ఇందులో వున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా, యూరోప్ దేశాలే అణు విద్యుత్ వద్దు అనుకుంటున్నప్పుడు, తీవ్ర ప్రమాదం వుందని తెలిసినప్పటికీ, ఆర్ధికంగా భరించలేనంత భారం అని తెలిసినా, ప్రత్యామ్నాయ విద్యుత్ అవసరాల అన్వేషణకు ప్రయత్నించకుండా, యురేనియం తవ్వకాలనే ముందుకు తీసుకు వెళ్ళటమంటే, పైకి చెబుతున్న కారణాలు సహేతుకంగా అనిపిస్తాయా?
ప్రపంచ వ్యాపితంగా జరిగిన అణువిద్యుత్ కేంద్రాలలో జరిగిన ప్రమాదాలను గమనిస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ప్రపంచ అణువిద్యుత్ రంగంలోనే అత్యంత విధ్వంసం 1986 లో పూర్వపు సోవియట్ యూనియన్ చెర్నోబిల్ లో సంభవించింది. వేలమంది చనిపోయారు. ఆ ప్రమాదం జరిగి ముప్ఫై సంవత్సరాల పైన అయింది. ఆ పట్టణం ఇప్పటికీ ఆవాసయోగ్యంగా లేదు. ఇంక ఎప్పటికీ ఉండబోదు కూడా! ఈ ప్రమాద ఫలితం కేవలం ఆ పట్టణానికి మాత్రమే పరిమితమవ్వలేదు. నాటి సోవియట్ యూనియన్ చుట్టుపక్కల దేశాలలోని ప్రజల్ని కూడా యుద్ధప్రాతిపదికన సుదూర ప్రాంతాలకు తరలించారు.
అంతెందుకు, జపాన్ లో 2011 మార్చి 11వ తేదీన ఫుకుషిమా అణు విద్యుత్ కర్మాగారంలో సంభవించిన అతిపెద్ద ప్రమాదం తాలూకూ పరిణామాలు గమనిస్తే విపత్తు స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే కేవలం 5 కిలోమీటర్ల దూరంలోని ప్రజలను తరలించటానికే ఎంతో కష్టమైంది. ఏసీలు వాడకూడదని, కిటికీలు తెరవకూడదని, బయట బట్టలు ఆరేయకూడదని, నల్లల్లో నీళ్లు తాగవద్దని, పాలు వాడకూడదని, బయటకు రాకూడదని నిషేదాజ్ఞలు ప్రకటించడం అంటే ఆ ప్రమాదం ఎంత తీవ్రమయినది అయి వుంటుంది? ఈ పరిస్థితి ఎంతకాలం వుంటుందో కూడా చెప్పలేదు. ఆ వెనువెంటనే ముప్ఫై కిలోమీటర్ల వరకూ ప్రజలు ఖాళీ చేసేయాలని ప్రకటించడం కూడా ప్రమాద తీవ్రతను తెలిపేదే! అక్కడి ప్రజలందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపుల్లోనే నివసిస్తూ తమ శరీరాల్లోకి వెళ్ళిన అణుధార్మిక వ్యర్ధాల మోతాదు ఎంతో తెలుసుకునేందుకు బిక్కుబిక్కుమంటూ క్యూలల్లో నిలబడి పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఫుకుషిమా ప్రమాదం జరిగిన వారంరోజులకే, అణుధార్మిక ప్రభావంతో అమెరికా తీరప్రాంత ప్రజలు అయోడిన్ టాబ్లెట్లు(కె1) వాడే పరిస్థితికి చేరుకున్నారు. అంటే ఎంతదూరం ఈ అణుధార్మిక శక్తి గాలివాటుగా ప్రయాణించిందో అర్ధం చేసుకోవచ్చు. అప్రమత్తమైన అమెరికా శాస్త్రజ్ఞులు అణు విద్యుత్ కేంద్రం నుంచి 80 కిలోమీటర్ల వరకూ ప్రజల్ని ఖాళీ చేయించమని కూడా సూచించారు.
ఇప్పుడు మనదేశంలో ఝార్ఖండ్ రాష్ట్రం జాదుగోడలో జరుగుతున్న యురేనియం గనుల తవ్వకాల పరిస్థితి గురించి తెలుసుకుందాం. 50,000 మందికి పైగా ప్రజలు అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వ్యంధ్యత్వం పెరిగింది. అంటే సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోవడం అన్నమాట! పుట్టిన పిల్లలు కూడా వివరించ వీలుకాని వికలత్వంతో పుడుతున్నారు. అక్కడి ప్రజల ఆరోగ్య సమస్యలపై సామాజిక బాధ్యతతో కొంతమంది డాక్టర్లు చేసిన పరిశోధనల రిపోర్టులు గమనిస్తే ‘అభివృద్ధి’ అనే ముసుగు వెనకాల ప్రభుత్వాలు ముందుకు తీసుకు వస్తున్న వికృత కోణం అర్థమవుతుంది. అక్కడి ప్రజల జీవిత కాలం తగ్గింది. చిన్నవయసులోనే మరణిస్తున్నారు. స్త్రీ, పురుషుల జననాంగాలలో క్యాన్సర్లు, చర్మ క్యాన్సర్లు, శారీరిక, మానసిక వైకల్యాలు తీవ్రంగా వున్నాయని తేలింది. ఏ అభివృద్ధి కోసం ఎవరు మూల్యం చెల్లిస్తున్నారు? ఇప్పుడు ఆమ్రాబాద్ నల్లమలలో జరగబోయేది కూడా ఇదే! దేశ అభివృద్ధి కోసం ఆదిమ తెగల ప్రజలు, సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
మేఘాలయ రాష్ట్రంలోని దొమిసియాత్‌లో కూడా చాలా భారీ స్థాయిలో యురేనియం నిల్వలు వున్నప్పటికీ, ప్రజల వ్యతిరేకతతో అక్కడి ప్రభుత్వం తవ్వకాలు జరపటానికి కేంద్ర అణుశక్తి శాఖకు ఎప్పుడో అనుమతి నిరాకరించింది. మరి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమిచేస్తుంది? కత్తి బంగారమని మెడ కోసుకుంటుందా లేక ప్రమాదాన్ని నిలవరించే సాహసాన్ని చేస్తుందా? నల్లగొండ ప్రజలకు పనికిరాని యురేనియం మైనింగ్ అమ్రాబాద్ నల్లమల ప్రజలకు మాత్రం ఎలా పనికి వస్తుంది? జీవావరణంలోకి వచ్చిన తర్వాత రెండు గ్రాముల యురేనియం శిధిలమయ్యి ఒక గ్రాముగా మారటానికి 450,00,00,000 (నాలుగు వందల యాభై కోట్లు) సంవత్సరాలపాటు పడుతుంది. అప్పటివరకూ దాని విధ్వంసం కొనసాగుతూనే వుంటుంది. మరి ఈ ‘ప్రమాదకర ఖనిజాన్ని వెలికితీయటం ’ తెలంగాణకు అవసరమా??

సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్