– రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో వారికే అత్యధికం
– ఆత్మనిర్భర్ అభియాన్లో ప్రభుత్వ వ్యయం తక్కువ
– ఉపాధి, ఆదాయాల్ని పెంచే చర్యలు శూన్యం: ఆర్థిక నిపుణులు
– భారమంతా ఆర్బీఐపై నెట్టేసి తప్పించుకున్న కేంద్రం
కారణాలేమైనా…భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీనిని గాడిలో పెట్టాలంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి. ఇది జరగాలంటే ప్రభుత్వ వ్యయం పెరగాలి. ప్రఖ్యాత ఆర్థిక సిద్ధాంతకర్త ‘కీన్స్’ థియరీ (డిగ్ ద హోల్…ఫిల్ ద హోల్) కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అభివృద్ధి, సంక్షేమరంగాల్లో ప్రభుత్వం చేసే వ్యయం కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తుందన్నది ఈ థియరీ సారాంశం.
తద్వారా మార్కెట్లో కొనుగోలు శక్తి(డిమాండ్) పెరుగుతుంది. కానీ మోడీ సర్కార్ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (ఆర్థిక ప్యాకేజీ రూ.20లక్షల కోట్లు)లో ఈ లక్షణాల్లేవు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అంతేగాక ఆర్థిక ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వ అసలు వ్యయం సుమారుగా రూ.2.10లక్షలకోట్లు మాత్రమే ఉన్నది.
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంతటి సంక్షోభంలో కూరుకుపోయింది. గతకొన్నేండ్లుగా పాలకులు చేస్తున్న తప్పులు, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి మరింత అగాధంలోకి నెట్టబట్టడం, కార్పొరేట్లకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడం, వాటికితోడు కరోనా మహమ్మారి ప్రబలటంతో వ్యవస్థల్ని చిన్నాభిన్నం అయ్యాయి. ఇందులో ప్రధాన సమస్య ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పడిపోవటం. దీనిని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలి. ఇందుకోసంగాను ఈ ఆరేండ్లలో మోడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరోనా నేపథ్యంలో రూ.20లక్షల కోట్లతో మోడీ సర్కార్ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. వార్షిక జీడీపీలో 10.3శాతంతో ఆర్థిక ప్యాకేజీ తీసుకొచ్చామని పాలకులు ఘనంగా చెప్పుకున్నారు. అయితే కేంద్రం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ అభియాన్’ ప్యాకేజీపై ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. రూ.20లక్షల కోట్లలో కేంద్రం నేరుగా చేస్తున్న వ్యయం కేవలం 2.10లక్షల కోట్లుమాత్రమేనని, మిగతాదంతా ఆర్బీఐపై భారాన్ని నెట్టేశారని విశ్లేషించారు.
ద్రవ్యలభ్యత, రుణాలు
బ్యాంకింగ్, ఫైనాన్స్రంగంలోకి ద్రవ్యలభ్యత కోసం రూ.9.73లక్షల కోట్లు కేటాయించారు. ఇదంతా ఆర్బీఐ ద్వారా చేస్తామని చెప్పారు. రైతులకు, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు గ్యారెంటీ లేకుండా (తనఖా లేకుండా) రుణాలిస్తామని, సులభతర, తక్కువ వడ్డీ రుణాలు ఇస్తామని 6.25లక్షలకోట్లు కేటాయించారు. ద్రవ్యలభ్యత, రుణసౌకర్యం కోసం ప్యాకేజీలో కేటాయిం చిన మొత్తం రూ.15.98 లక్షల కోట్లు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టంకింద అదనంగా కేటాయిం చిన రూ.40వేల కోట్లు, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.1.7లక్షల కోట్లు… ప్రభుత్వం నేరుగా చేస్తున్న వ్యయంగా భావించాలి. ప్రజలకు ఉపాధి, ఆదాయాల్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న వ్యయం రూ.2.10లక్షల కోట్లు మాత్రమే ఉందని నిపుణులు లెక్కతేల్చారు.
ఉత్పత్తి పెరిగితే లాభమేంటి ?
ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు రుణాలు అందజే స్తామని, ఆ బాధ్యత (రూ.15.98 లక్షల కోట్లు) ఆర్బీఐపై కేంద్రం నెట్టేసింది. దీనిని సాధారణ భాషలో చెప్పాలంటే, పరిశ్రమలకు విరివిగా రుణాలు అందుబాటులోకి తీసుకు రావటం. కానీ ఏ పరిశ్రమలోనూ ఇప్పుడు ఉత్పత్తి లేదు. మార్కెట్లో కొనుగోలు శక్తి (డిమాండ్) పడిపోయినవేళ పరిశ్రమలు వస్తు ఉత్పత్తులు ఎలా చేపడతాయి? తయారీయేలేనప్పుడు పరిశ్రమలకు భారీగా రుణాలు ఇస్తామని, భవిష్యత్తులో ఇంత ఇస్తాం…అంత ఇస్తామని చెప్పడం దేనికని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
వస్తు సేవలు
వస్తుసేవలకు డిమాండ్ పెరగటం ప్రజల కొనుగోలు శక్తిపై ఆధారపడిన విషయం. అంటే ప్రజలకు ఉపాధి, ఆదాయం మెరుగ్గా ఉంటే వస్తు సేవలకు డిమాండ్ ఉంటుంది. లాక్డౌన్, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నికోట్లమంది రోడ్డునపడ్డారో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో వస్తు సేవలకు డిమాండ్ ఎలా ఏర్పడుతుందన్నది ప్రశ్న. రెపో రేటు తగ్గించి తద్వారా బ్యాంకులకు పెద్దమొత్తంలో ద్రవ్యలభ్యత అందుబాటులోకి తీసుకొచ్చినా.. బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు రుణాలుగా వెళతాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలకు రుణాలు ఇస్తూ, వ్యయాన్ని పెంచుతామని ప్యాకేజీ చెప్పటం లేదు.
కేంద్రం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ..ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తిని పెంచలేదని నిపుణులు భావిస్తున్నారు. కారణం ఇందులో అత్యధికభాగం ద్రవ్యలభ్యత, రుణాలకే కేటాయించటం. నిరుద్యోగం రికార్డుస్థాయికి చేరుకున్నవేళ, ఆదాయాలు పడిపోయిన వేళ ప్రజలకు కావాల్సింది చేతినిండా పని. ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం నేరుగా వ్యయం చేయకపోతే దానిని ఆర్థిక ప్యాకేజీగా ఎలా భావిస్తామని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆత్మనిర్భర్ అభియాన్తో పెద్దగా ఒనగూడేదేమీ లేదని వారు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటుపరం చేయాలనుకోవడం మోసపూరితమని పలువురు తెలిపారు.
Courtesy: NT