నయా కశ్మీర్‌లో కొత్త భూస్వామ్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

షకీర్ మీర్

జమ్మూ-కశ్మీర్ భూ చట్టాలకు కేంద్రప్రభుత్వం చేసిన సవరణలు ఒక కొత్త జాగిర్దారీ వ్యవస్థకు ప్రాణ ప్రతిష్ట చేయనున్నాయి. కార్పొరేట్ కంపెనీలు ఇక జమ్మూలోనూ, కశ్మీర్ లోయలోనూ పెద్ద ఎత్తున భూములను స్వాయత్తం చేసుకుంటాయి. కశ్మీరీల విలక్షణ, విశిష్ట అస్తిత్వపు ప్రతి ప్రతీక విధ్వంసానికి గురవుతుంది. ‘ఏడు దశాబ్దాల సంస్కరణలు, ప్రగతిశీల రాజకీయాలూ పూర్తిగా నిరర్థకమయిపోయాయని’ ఒక రాజనీతి శాస్త్రవేత్త వాపోయాడు.

జమ్మూ–కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఉపసంహరణకు, ఒక తార్కిక ముగింపునిచ్చేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. రాజ్యాంగ అధికరణ 370 కింద కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని 2019 ఆగస్టులో రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఇప్పుడు, గతనెల 26న కేంద్ర హోం మంత్రిత్వశాఖ జమ్మూ-కశ్మీర్ భూచట్టాలకు పలు సవరణలను ప్రకటించింది. వాటి ప్రకారం ఇక మీదట భారతీయులు ఎవరైనా సరే అక్కడ భూములు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు కశ్మీర్ పౌరులు మాత్రమే ఆ రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలకు అర్హులు. అయితే వ్యవసాయ భూములకు మాత్రం ఈ కొత్త సవరణలు వర్తించవని, సాగు భూములను సాగు చేసేవారు మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రప్రభుత్వ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. జమ్మూ-–కశ్మీర్ పునర్వ్య వస్థీకరణ (కేంద్రప్రభుత్వ చట్టాల అనుసరణ) చట్టంలోని మూడో ఆదేశం కింద ఈ సవరణలను ప్రకటించారు.

భూ చట్టాలలో సవరణలపై కశ్మీర్‌లో సహజంగానే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం ఎదురులేని కార్యనిర్వాహక అధికారాలతో తమ హక్కులను పూర్తిగా కాలరాచి వేస్తోందని కశ్మీరీలు ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికి రెండు సంవత్సరాలకు పైగా జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వం లేదు. ఈ కేంద్రపాలిత ప్రాంత చట్టాలలో మార్పులు చేయ డం, కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం అంతా కేంద్రప్రభుత్వ నిర్దేశాల ప్రకారమే జరుగుతోంది. గతంలో కశ్మీర్ భూ ముల క్రయవిక్రయాలు ఒక రాజకీయ అంశంగా ఉండేవి. ఇప్పుడు కశ్మీర్ పౌరులను వివాహం చేసుకున్న కశ్మీరేతర స్త్రీ లేదా పురుషుడు కూడా కశ్మీర్ స్థిరనివాసులుగానే గుర్తింపు పొందుతున్నారు. అలాగే నివాసానికి సంబంధించిన నిబంధనలు కూడా సరళీకరించారు. నిజానికి ఈ సవరణలు సామాన్య కశ్మీరీలు సైతం ఊహిస్తున్నవీ, భయపడుతున్నవే. అక్కడి జనసంఖ్యామానంలో పెను మార్పులు తీసుకువచ్చేందుకే చట్టాల రద్దు, మార్పు జరుగుతోందని వారు విశ్వసిస్తున్నారు.

కేంద్రం రద్దు చేసిన 12 చట్టాలలో, చరిత్రాత్మకమైన ‘బిగ్ ల్యాండ్ ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్ -1950’ ఒకటి. జమ్మూ- కశ్మీర్‌లో భూ స్వామ్యానికి చరమగీతం పాడిన చట్టమిది. భూమిని పునఃపంపిణీ చేసి గ్రామీణ ప్రాంతాలు సిరిసంపదలతో తులతూగడానికి ఆ చట్టం ఎంతగానో దోహదం చేసింది. భారత ఉపఖండంలోనే ప్రప్రథమ వ్యవసాయ సంస్కరణల చట్టంగా గుర్తింపు పొందిన దీన్ని రద్దు చేయడం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల, వేలాది స్వాతంత్ర్య సమరయోధుల అనుపమాన త్యాగాలను అవమానపరచడమే. చరిత్ర తిరగరాసే మొరటు ప్రయత్నంగా ఈ చట్టం రద్దును ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అభివర్ణించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

1950వ దశకంలో ఆనాటి జమ్మూ–-కశ్మీర్‌లో అమలయిన భూ సంస్కరణలు అత్యంత ప్రగతిశీలమైనవి. విప్లవాత్మక మార్పులకు విశేషంగా దోహదం చేసిన భూ సంస్కరణలు ఒక కమ్యూనిస్టేతర దేశంలో అమలవడం అదే మొదటిసారి. కీర్తిశేషుడు షేక్ అబ్దుల్లా ‘నయా కశ్మీర్ కార్యక్రమ’ లక్ష్యాలను నెరవేర్చిన సంస్కరణలవి. దున్నేవాడికి భూమినిచ్చిన ‘బిగ్ ల్యాండ్ ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్’ ప్రకారం భూకమతాల సగటు విస్తీర్ణం గరిష్ఠంగా 22.75 ఎకరాలకు మించి ఉండకూడదు. ఎవరికైనా ఇంతకు మించి సాగు భూమి ఉంటే అది స్వతస్సిద్ధంగా సాగుదారులకు బదిలీ అవుతుంది. ఇలా భూ యాజమాన్య హక్కులు పొందిన సాగుదారు, ఆ భూమి పాత యజమానికి ఎటువంటి నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం లేదు. ఈ చట్టం ప్రకారం కశ్మీర్‌లో దాదాపు పదివేలమంది భూస్వాములు తమ అదనపు భూమిని సాగుదారులకు దఖలు పరిచారు. 1952 నాటికల్లా ఎలాంటి భూ వసతిలేని 7,90,000 మంది రైతుల (వీరిలో అత్యధికులు ముస్లింలు) తాము సాగు చేసే భూములపై హక్కులు పొందారు. అలాగే జమ్మూ ప్రాం తంలో రెండున్నర లక్షల మంది కింది కులాల హిందువులు కూడా సాగు భూములు పొం దారు. ఈ భూ యాజమాన్య హక్కులను మరింత హేతుబద్ధం చేసేందుకు షేక్ అబ్దుల్లాయే 1976లో వ్యవసాయ సంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చారు. ఆయన అమలుపరిచిన భూ సంస్కరణలు సంపూర్ణంగా సఫలమయ్యాయి. 1970 సంవత్సరం నాటికి భారతదేశమంతటా భూసంస్కరణల కింద 9.5 లక్షల ఎకరాలు పునఃపంపిణీ అయితే అందులో 4.5 లక్షల ఎకరాలు పునఃపంపిణీ ఒక్క జమ్మూ–-కశ్మీర్‌లోనే జరిగింది. ఈ అంశాన్ని మరింత వివరంగా తెలుసుకోవసిన అవసరముంది. కశ్మీర్‌లో భూ సంస్కరణలకు, మిగతా భారతదేశంలో అమలయిన భూ సంస్కరణలకు మధ్య ఒక ప్రధాన వ్యత్యాస‍ం ఉంది. కశ్మీరేతర భారతదేశంలో నష్టపరిహారం చెల్లింపు, కౌలు తగ్గింపు, సాగుదారుల హక్కుల రక్షణల కల్పనతో జమిందారీ వ్యవస్థలు రద్దు కాగా కశ్మీర్ సంస్కరణలు భూస్వాములకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండానే వ్యవసాయభూముల పునఃపంపిణీకి ప్రాధాన్యమిచ్చాయి. మరో విశేష మేమిటంటే కశ్మీరేతర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ భూ సంస్కరణలు పటిష్ఠంగా, ప్రభావశీలంగా అమలు కాలేదు. అలా అమలైంది ఒక్క జమ్మూ-కశ్మీర్లోనే. షేక్ అబ్దుల్లా నాయకత్వంలో భూ సంస్కరణలు చాలా నిర్దుష్టంగా అమలయ్యాయని, ఫలితంగా రైతులే గాక యావత్ గ్రామీణ జనాభా జీవనస్థితిగతులు ఇతోధికంగా మెరుగయ్యాయని ప్రపంచ భూ సంస్కరణలపై అధ్యయనం జరిపిన జర్మన్ నిపుణుడు వోల్ఫ్ లడ్జెన్ స్కీతో పాటు పలువురు నిర్ధారించారు.

1950వ దశకంలో అమలయిన భూసంస్కరణల ప్రభావం అచిరకాలంలోనే కశ్మీరీల జీవనరీతుల్లో పూర్తిగా ప్రతిబింబించింది. అనేక అభివృద్ధి సూచీలలో జమ్మూ-కశ్మీర్ అగ్రస్థానంలో ఉండడమే ఆ సంస్కరణల సంపూర్ణ సాఫల్యానికి ఒక తిరుగులేని తార్కాణం. భూ కమతాలపై 22.75 ఎకరాల గరిష్ఠ పరిమితి ‘బిగ్ ల్యాండ్ ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్’ ప్రధాన అంశం. భూచట్టాలకు తాజా సవరణలతో ఈ గరిష్ఠ పరిమితి నిబంధన పూర్తిగా తుడచిపెట్టుకుపోయింది. ఫలితంగా జమ్మూ-–కశ్మీర్‌లో ఒక నయా జాగిర్దారీ వ్యవస్థ పున రుద్ధరణకు మార్గం సుగమమయింది. పాత రూపంలో కాకుండా కొత్త తీరులో ఉండే జాగిర్దారీ వ్యవస్థ కశ్మీర్ రైతులను గతంలో కంటే మరింతగా అవస్థలపాలు చేసే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో అసలే కుంగిపోయి ఉన్న కశ్మీరీలకు భూచట్టాల సవరణలు పిడుగుపాటులా పరిణమించాయనడం సత్యదూరం కాదు. కొత్త నిబంధనలతో తమ కష్టాలు మరింత అధికమవుతాయని వారు కలవరపడుతున్నారు. జమ్మూ-కశ్మీర్ పాలనా యంత్రాంగం ఎక్కడా ఎలాంటి నిరసన ప్రదర్శనలను అనుమతించడం లేదు. ప్రభుత్వ వైఖరికి భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంపై అన్నివిధాల నిషేధం విధించారు. ఆన్‌లైన్ స్పేసెస్‌పై కూడా పటిష్ఠ నిఘా ఉంచారు. పత్రికా స్వాతంత్ర్యాన్ని నిరాకరిస్తున్నారు. ఆందోళనలలో పాల్గొంటున్న వారిని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. అభియోగాలు మోపకుండా పోలీసు కస్టడీలో ఉంచుతున్నారు. ‘జాతి-వ్యతిరేక’ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఉద్వాసనకు గురవుతారని ప్రభుత్వోద్యోగులను బెదిరిస్తున్నారు.

1950వ దశకపు భూ సంస్కరణలు కశ్మీరీ సమాజాన్ని భూస్వామ్య శృంఖలాల నుంచి విముక్తం చేసి షేక్ అబ్దుల్లా సామ్యవాద దార్శనికతకు అనుగుణంగా అన్ని జీవనరంగాల ఆధునికీకరణకు దోహదం చేశాయి. జమ్మూ–-కశ్మీర్ ఇప్పుడు పెట్టుబడిదారీ దోపిడీకి ఒక విలువైన ఆస్తిగా రూపొందింది. కార్పొరేట్ కంపెనీలు ఇక జమ్మూలోనూ, కశ్మీర్ లోయలోనూ పెద్దఎత్తున భూములు స్వాయత్తం చేసుకుంటాయి. కశ్మీరీల విలక్షణ, విశిష్ట అస్తిత్వపు ప్రతి ప్రతీక విధ్వంసానికి గురవుతుంది. ‘ఏడు దశాబ్దాల సంస్కరణలు, ప్రగతిశీల రాజకీయాలూ పూర్తిగా నిరర్థకమైపోయాయని’ ఒక రాజనీతి శాస్త్రవేత్త వాపోయారు. కశ్మీరీలకు గత ఏడాది ఆగస్టులో సంభవించిన పెద్ద హాని కంటే ఎక్కువ చేటు తాజా నిర్ణయాలతో వాటిల్లింది. ఏడాది క్రితం హఠాత్పరిణామాలకు దిగ్భ్రాంతి చెందినప్పటికీ పలువురు కశ్మీరీలు పూర్తిగా ఒక నిశ్చిత వైఖరికి రాలేకపోయారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కేంద్రప్రభుత్వ నిర్ణయాలు, చర్యల పట్ల వారి వైఖరి స్పష్టాతిస్పష్టంగా ఉంది. తమ విలక్షణ మనుగడను పూర్తిగా దెబ్బతీయడమే న్యూఢిల్లీ పాలకుల లక్ష్యమనేది కశ్మీరీలకు అర్థమైపోయింది. కశ్మీర్‌లో శతాబ్దాలుగా విలసిల్లుతున్న జాతుల సహజీవనం, సంస్కృతుల సమ్మేళనం ఛిద్రమవడం ఖాయమని కశ్మీరీలు తీవ్రంగా వ్యాకుల పడుతున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates