– రెండో స్థానంలో ఢిల్లీ
– తెలుగురాష్ట్రాలు వెనుకే..
– అధ్వాన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్
న్యూఢిల్లీ : అక్షరాస్యత అనగానే ముందు గుర్తుకొచ్చేది కేరళ. ఈసారి కూడా తన స్థానాన్ని ఆ రాష్ట్రం నిలబెట్టుకుంది. 96.2శాతంతో దేశంలో అత్యంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా నిలిచింది. 88.7శాతంతో ఆ తర్వాత స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నిలవగా, ఉత్తరాఖండ్ (87.6), హిమాచల్‌ప్రదేశ్ (86.6), అసోం (85.9) వరుస మూడు, నాలుగు, ఐదు స్థానాలను ఆక్రమించాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విద్యపై తాజా గణాంకాల నివేదికను వెల్లడిం చింది. కాగా, చివరి స్థానం అనగానే గుర్తుకొచ్చేది బీహార్. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అక్షరాస్యతలో ఆఖరి స్థానానికి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పడిపో యింది. అతి తక్కువగా 66.4 శాతంతో చివరి స్థానంలో ఏపీ నిలవగా, ఉత్తరప్రదేశ్ 73.0శాతం, తెలంగాణ 72.8శాతం, బీహార్ 70.9శాతం, రాజస్థాన్ 69.7 శాతంతో రాష్ట్రాలు ఏపీ కన్నా ముందున్నాయి. జాతీయ సగటు 77.7శాతం కాగా.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు వెనుకబడే ఉన్నాయి. 2018-19 సంవత్సరం లో ఏడు సంవత్సరాలకు పైబడిన వారి డేటా ఆధారంగా ఎన్ఎస్ఓ ఈ గణాంకాలను విడుదల చేసింది.
బాలురు-బాలికల మధ్య అంతరం…
ఇక దేశవ్యాప్తంగా బాలురు-బాలికల మధ్య అక్షరాస్యత రేటును పరిశీలిస్తే.. కేరళలో వీరి మధ్య వ్యత్యాసం కేవలం 2.2శాతం మాత్రమే. కాగా, దేశంలో బాలుర అక్షరాస్యత 84.7శాతం కాగా, బాలికల్లో అక్షరాస్యత రేటు 70.3గా నమోదైంది. జాతీయ అంతరం 14.4శాతంగా నమోదైంది. మరోవైపు తెలంగాణలో ఈ అంతరం భారీగా ఉన్నది. బాలుర అక్షరాస్యత 80.5శాతం ఉండగా, బాలికల అక్షరాస్యత 65.1గా నమోదైంది. ఇక ఏపీలో బాలుర శాతం 73.4, బాలికల అక్షరాస్యత 59.5శాతం మాత్రమే ఉన్నది. తెలంగాణలో ఈ వ్యత్యాసం 15.4గా ఆంధ్రప్రదేశ్‌లో 13.9గా నమోదైంది. రాజస్థాన్‌లో 23.2, బీహార్‌లో 19.2, యూపీలో 18.4గా ఉన్నది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంతరం
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత అంతరం 27.2 శాతంతో ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. కాగా, అక్షరాస్యతలో టాప్‌లో ఉన్న కేరళలో పట్టణ, గ్రామీణ అక్షరాస్యత వ్యత్యాసం చాలా స్వల్పం. కేరళలో ఇది 1.9 శాతం పాయింట్లు కాగా, ఇందులోనూ తెలుగు రాష్ట్రాలు చాలా అధ్వా న్నంగా ఉన్నాయి. తెలంగాణలో ఈ అంతరం 23.4కాగా, ఆంధ్ర ప్రదేశ్‌లో ఇది 19.2శాతం. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య 80 శాతంతో కేరళ అగ్రస్థానంలో ఉన్నది. ఇందులో ప్రధానమైన 22రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలు 70శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
Courtesy: NT