నిజమైన బహుజన,వామపక్ష శక్తులు రాజకీయ ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదగకుండా ఆధిపత్య కుల దురహంకారాన్ని అడ్డుకోలేమనే విషయం బహుజనులు గుర్తించలేనంతకాలం బహుజన ప్రజల బలిదానాలు తప్పవనేది రుజువైయ్యింది…!!
ఇటీవల కాలంలో ఆంధ్రాలో దళిత ప్రజలపై జరుగుతున్న ధాష్టికాలను పరిశీలిస్తే బహుజనులు ముఖ్యంగా విద్యావంతులైన బహుజన యువత తీవ్రంగా ఆలోచించాలి.
★ ఒక దళిత యువతిని మత్తుమందులిచ్చి అత్యాచారం చేసి పోలిస్టేషన్ ముందే పడేసే దైర్యమెక్కడిది వారికి…
మాస్కు పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని పోలీసులు కొట్టిచంపే తెగింపు ఎక్కడినుండి వచ్చింది.
మరో ఘటనలో దళిత యువకుడి సిరోముండనం చేసే ధాష్టిక దైర్యం ఎలా వచ్చింది…!
కారణమొక్కటే మొన్నటి వరకు కమ్మ ఆధిపత్యం, ఇప్పుడు రెడ్డి ఆధిపత్య ప్రభుత్వాలు ఉండడమే…
★ ఆంధ్రాలో కమ్మ ,రెడ్ల అధికార ఆధిపత్య పోరులో బహుజనులే బలిదానాలు చేయాలి. తెలంగాణలో వెలుమ,రెడ్డి,కమ్మ ఆధిపత్యపోరులో బహుజనులే బలిదానాలు అవుతున్న విషయాన్ని గమనించలేని
బహుజనులు రాజకీయ బానిసలుగా బతుకుతున్నారు.
★ తెలంగాణ ఆధిపత్య కులానికి చెందిన ఒక మహిళపై అత్యాచారం జరిగితే ఏపీ సిఎం జగన్ రెడ్డి దిశా చట్టం తెస్తే, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నింధితులను రోడ్డుపై కాల్చిపారేశారు…
అంతకుముందే ఒక ఎస్సీ మహిళ, ముగ్గురు బిసి బాలికలను అత్యాచారం జరిపి హత్యలు చేసిన ఆధిపత్య కులానికి చెందిన నింధితుడితోపాటు కేవలం అరెస్ట్ మాత్రమే చేసి జైలులో నిర్భంధించారు. ఉత్తర తెలంగాణ పల్లెల్లో నిత్యం ఏదో ఒక గ్రామంలో బహుజనుల గ్రామ బహిష్కరణాలు నిత్యకృత్యమైయ్యాయి..!!
★ తెలంగాణాంధ్రలో టిఆర్ఎస్,వైసీపీ పార్టీలు జెండాలు వేర్వేరుగా ఉన్నా వాటి కుల వర్గ స్వభావం ఒకటే అనేది
విద్యావంతులైన బహుజనులు అర్థం చేసుకోలేనంతకాలం బహుజనుల మాన, ప్రాణాలకు ఏలాంటి విలువ ఉండదని 73 సంవత్సరాల స్వరాజ్య చరిత్ర రుజువు చేస్తోంది.
★ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో 93%మున్న ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీలైన బహుజన ఉద్యమ శక్తుల ఐక్యతతోనే ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఆవిర్భావించే అవకాశాలు ఉన్నాయి.
మహాత్మా జ్యోతిబా ఫూలే,సావిత్రి బాయిఫూలే ల భావజాలంతో పని చేసే బిసి సమాజంలోని ఎంబిసి,సంచారజాతులు, నిజమైన ఫూలే అంబెడ్కర్ భావజాలం పునాదులపై పనిచేసే ఎస్సీకుల ఉద్యమ సంస్థలు, జాతీయ స్థాయిలో పనిచేస్తున్న వామన్ మెశ్రమ్,ప్రజాబంధు పార్టీ, డాక్టర్ శివబాగ్యరావు గారు ఏర్పాటు చేసిన అంబెడ్కర్ రాజనీతి మూమెంట్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్,డాక్టర్ చెరుకు సుధాకర్ గార్ల నాయకత్వం వహిస్తున్న పార్టీలు, వివిధ అంబెడ్కర్ సంఘాలు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ లో భాగస్వామిక పార్టీలైన ఎంసిపిఐయు, బహుజన కమ్యూనిస్టు పార్టీ,బహుజన లెఫ్ట్ పార్టీ, అంబెడ్కర్ పార్టీ, తెలంగాణ లోక్ సత్తా,ఎంబీటి,యుసిసిఆర్ఐ ఎంఎల్,ఇండియన్ లేబర్ పార్టీ తోపాటు మరికొన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తున్న బహుజన,వామపక్ష రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కలిసి పనిచేయడానికి ముందుకు రావలసిన చారిత్రక ప్రాధాన్యం ఏర్పడింది.
పైన పేర్కొన్న బహుజన,వామపక్ష రాజకీయ పార్టీలు సంస్థలన్ని భావసారుప్యత కలిగిన సంస్థలే.
★ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు, తెలంగాణ రాష్ట్రానికి బిసి ముఖ్యమంత్రి, మంత్రి వర్గం ఏర్పాటు నుండి మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పోరేషన్,కౌన్సిల్ వరకు సామాజిక న్యాయ పొందిక పాటింపుతో బహుజనుల ఓట్లు బహుజనులే వేసుకోవాలి. బహుజనులను బహుజనులే పాలించాలి అనే నినాదంతో పైన పేర్కొన్న పార్టీలు,సంఘాలు, సంస్థలు,వ్యక్తులు కలిసిపని చేయడానికి ఏలాంటి అభ్యంతరం ఉండాలసిన అవసరం లేదు. పైకి బహుజన రాజ్యాధికారం అంటూ అంతర్గతంగా వేరే అజెండా ఉంటే అది వేరే విషయం.
★ తెలంగాణ సమాజంలో ప్రస్తుతం కుల సంఘాల నిర్మాణం కంటే బహుజన రాజకీయ ఉద్యమ నిర్మాణమే బహుజన ప్రజలకు రక్షణ కవచంగా ఏర్పడుతుంది.
★ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించే కుల సంఘాల నాయకత్వాలకు ప్రత్యామ్నాయంగాఆయా బహుజన కులాల విద్యావంతులు తమ తమ కులాల ప్రజలకు బహుజన రాజకీయ పాఠాలు చెప్పే ప్రయత్నమొకటి మొదలు పెట్టాలి.
★ సోషల్ మీడియా బహుజన ఉద్యమ వాలెంటర్స్ కు విజ్ఞప్తి…
సోదరి సోదరులారా…!
పొద్దస్తమానం ఫూలే అంబెడ్కర్ ల కొటేషన్లతో బహుజన రాజ్యంరాదు. పెద్ద చిన్న తేడా లేకుండా ఎవరి శక్తిని బట్టి వారు గ్రామం,మండలం, నియోజకవర్గం,జిల్లాలను యూనిట్ లుగా ఎంచుకోని బహుజన ఉద్యమ నిర్మాణానికి
పునాదులు వేయండి.. అప్పుడు మాత్రమే మన మహానీయులైన ఫూలే,సావిత్రి బాయి, అంబెడ్కర్ పెరియార్,మార్క్స్,కాన్షీరాం, మారోజు,ఉసాలు కలలుగన్న సమతా మమతాల సమరాజ్య నిర్మాణం సాధ్యమవుతుంది.
జైభీం లాల్ సలాంలతో…
కన్వీనర్
బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్
తెలంగాణ రాష్ట్ర కమిటీ.