– మహిళా జర్నలిస్ట్‌కు భారీ పరిహారం చెల్లింపు
– 2015లో లైంగికదాడికి గురైన షియోరీ ఇటో
టోక్యో : ప్రపంచ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమ ఫలితంగా లైంగికదాడులకు గురైన మహిళలు, యువతులు గళమెత్తుతున్నారు. న్యాయపోరాటం కోసం ఉద్యమిస్తున్నారు. బాధితుల నుంచి వేల సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈకేసులపై విచారణ చేపడుతున్న ప్రత్యేక న్యాయస్థానాలు దోషులకు శిక్ష, జరిమానాలు విధిస్తున్నాయి.
జపాన్‌లో 2015లో ప్రఖ్యాత మహిళా జర్నలిస్ట్ షియోరీ ఇటో లైంగికదాడికి గురయ్యారు. అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. జపాన్ ప్రధాని షింజో అబేకు సమీప బంధువు, మాజీ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్ట్ నోరియుకీ యమగుచీ షియోరీపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మీడియా సంస్థలో కీలక పదవి ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఆమెను స్టూడియోకు రప్పించాడు. కూల్‌డ్రింక్‌లో డ్రగ్స్ కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. లైంగికదాడికి గురైనట్టు గుర్తించిన బాధితురాలు న్యాయం కోసం పోరాడారు. నోరియుకీపై లైంగికదాడి కేసు నమోదు చేయాలని అభ్యర్థిస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఆమెకు న్యాయం జరగలేదు.
అతను ప్రధానికి సమీప బంధువు కావడంతో ఎఫ్ఐఆర్ చేసేందుకు పోలీసులు నిరాకరించారు. న్యాయం కోసం లైంగికబాధితురాలు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. దాదాపు నాలుగేండ్ల నుంచి న్యాయం కోసం ఆమె పోరాడుతూనే ఉన్నారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నోరియుకీపై నమోదైన అభియోగాలన్నీ కోర్టులో రుజువయ్యాయి.
అతన్ని దోషిగా తేల్చిన జపాన్ న్యాయస్థానం 30,375డాలర్ల ( రూ.21,55,713) పరిహారం విధించింది. అయితే, లైంగికదాడికి గురైన షియోరీని పోలీసులు వైద్యపరీక్షలకు పంపకపోవడంతో అతన్ని దోషిగా తేల్చేందుకు సహకరించే డీఎన్ఏ రిపోర్టులు లభించలేదు. ఈ రిపోర్టు ఉన్నట్టయితే నోరియుకీకి మూడు నుంచి ఐదేండ్ల జైలుశిక్ష పడే అవకాశముండేదని ప్రాసిక్యూషన్ విభాగం వెల్లడించింది. కాగా, కోర్టు తీర్పుపై షియోరీ స్పందించారు.
ఈకేసులో నోరియుకీ దోషిగా తేలడంతో తనకు న్యాయం జరిగిందన్నారు. నాలుగేండ్ల నుంచి తన పోరాటానికి మద్దతు పలికిన మహిళలకు, పలు పార్టీల కార్యకర్తలకు,నేతలకు, విద్యార్థినులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లైంగికదాడికి గురైన బాధిత మహిళల పక్షాన నిలిచి తానూ పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. లైంగికదాడులకు గురైన బాధితులను సమాజం చిన్నచూపు చూస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను లైంగికదాడికి గురైన విషయాన్ని బహిర్గతం చేయడాన్ని విమర్శిస్తూ అనేక సందేశాలు, ఈమెయిల్స్,బెదిరింపులు వచ్చాయని షియోరీ తెలిపారు. అయితే, ఏ దశలోనూ తాను వెనక్కి తగ్గలేదని అన్నారు.
Courtesy: NT