ఏడు దశాబ్దాల జనచైనా… విజయాలు, ఆకాంక్షలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రభాత్‌

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సుదీర్ఘ సంక్షోభంలో కూరుకుపోతుంటే ప్రత్యామ్నాయ అభివృద్ధి పంథా అనుసరిస్తున్న జనచైనా తన విప్లవ ప్రస్థానంలో ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. 1949 అక్టోబరు 1న మావో సేటుంగ్‌ చైనా అంతర్యుద్ధంలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించిందనీ, జనచైనాను గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తూ చైనాను సోషలిస్టు వ్యవస్థగా మల్చటానికి కృతనిశ్చయులై ఉన్నామని ప్రకటించి ఏడు దశాబ్దాలు గడిచింది. ఎర్రసేన మహా ప్రస్థానం విజయవంతం కావటంతో అప్పటి వరకు చైనా పాలకుడిగా ఉన్న కొమింటాంగ్‌ అధినేత చాంగైషేక్‌ తైవాన్‌ పారిపోయి ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి ప్రపంచ గతిని మార్చిన జనచైనా ఆవిర్భావం అక్టోబరు 1తో 70వసంతో త్సవాలు జరుపుకొంటోంది.
1949 అక్టోబరు ఒకటిన విజయోత్సవ ప్రకటనకు ముందు మావో, ”చైనా ప్రజలు సంఘటితమై స్వదేశీ విదేశీ దురాక్రమణ నుంచి మహత్తర ప్రజా విముక్తి సైన్యపు త్యాగాలతో దేశాన్ని విముక్తి చేసుకున్నాం. ఇకపై చైనా ఎవరి చేతుల్లోనూ అవమానాల పాలుకావల్సిన పని లేదు” అని ప్రకటించారు. 1839లో నాటి తొలి నల్లమందు యుద్ధంతో మొదలై 1949 వరకు చైనా విదేశీ శక్తుల పీడనకు బలైంది. బ్రిటిష్‌ వలసగా ఉన్న భారతదేశం నుంచి పెద్దఎత్తున సాగుతున్న నల్లమందు దిగుమతుల్ని నాటి చైనా చక్రవర్తులు వ్యతిరేకించటంతో బ్రిటిష్‌ ప్రభుత్వం చైనాపై యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధంలో చైనాను ఓడించి శాశ్వతంగా తన నల్లమందు సరఫరాకు మార్కెట్‌గా మార్చుకుంది. ఈ యుద్ధం తర్వాత చైనాలో పలు ఓడరేవుల్ని బ్రిటన్‌, జపాన్‌లు ఆక్రమించుకున్నాయి. శతాబ్దకాలపు దోపిడీ, పీడన, అణచివేతల నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ మావో నేతృత్వంలో దేశాన్ని విముక్తి చేసింది. 1949లో జన చైనా ఆవిర్భావంతో సోషలిస్టు చైనా నిర్మాణం మొదలైంది.
రెండో ప్రపంచ యుద్ధానంతరం మొదలైన సామ్యవాద దేశాల ఆవిర్భావం భౌగోళికంగానూ, వనరుల రీత్యానూ విశాలమైన చైనా సోషలిస్టు శిబిరంలో రష్యాతో జత కలవడంతో మరింత బలోపేతమైంది. దీంతో ఆందోళన చెందిన పెట్టుబడిదారీ దేశాలు, వాటికి నాయకత్వం వహిస్తున్న అమెరికా స్వదేశంలో కూడా వామపక్ష భావాల్ని అణచివేసేందుకు మెకార్థీయిజాన్ని ఓ విధానంగా పాటించింది. ప్రపంచ ప్రఖ్యాత మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్తల్లో ఒకరైన పాల్‌ ఎం స్వీజీ, హారీ మెగ్డాఫ్‌, బరాన్‌లు ఈ మెకార్థీయిజానికి బలయ్యే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పదవులను వదులుకోవాల్సి వచ్చింది. బహుశా సోషలిస్టు అభివృద్ధి నమూనా, పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాల మధ్య ప్రఛ్చన్నయుద్ధం మొదలైంది కూడా 1949నుంచే అని చెప్పుకోవచ్చు. చరిత్రను వికృతీకరించటంలో అందెవేసిన సామ్రాజ్యవాద విశ్లేషకులు ఈ కాలాన్నే ప్రపంచంపై ఆధిపత్యం సాధించటానికి ఓ వైపు రష్యా మరోవైపు అమెరికాలు పోటీ పడ్డాయని చరిత్ర పుస్తకాలు రాశారు. తర్వాతి తరాలకు అవే పాఠ్యపుస్తకాలయ్యాయి.
ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా దురాక్రమణలను ప్రతిఘటించటానికి సిద్ధపడిన వర్ధమాన దేశాలకు, కొత్తగా విముక్తి పొందిన దేశాలకు ఆర్థిక, మానవ వనరులతో సహాయ సహకారాలు అందించటంలో రష్యాతో కలిసి జనచైనా కూడా తన వంతు పాత్ర పోషించింది. ఈ కాలంలోనే ప్రపంచాన్ని వాణిజ్య కూటములుగా విభజించే ప్రయత్నం సాగాయి. ఈ పరిస్థితుల్లో చైనా, రష్యాలు వర్ధమాన దేశాలతో వాణిజ్య ఒప్పందాలు పెట్టుకుని ప్రత్యామ్నాయ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం దిశగా అడుగులు వేశాయి. ఉదాహరణకు భారతదేశానికి రష్యా అమ్మిన సరుకులన్నింటికీ రూపాయి ల్లోనే ఖరీదు కట్టింది. దాంతో నేడు మనం చూస్తున్నట్టు విదేశీ మారకద్రవ్య సంక్షోభాలు నాటికి మొదలు కాలేదు. చైనా కూడా రష్యా తరహాలో ఆఫ్రికా దేశాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ద్వారా ఆయా దేశాలను అభివృద్ధి పథంలో నడిపించటంలో కీలకపాత్ర పోషించింది. వర్ధమాన దేశాల పాలక వర్గాలు ఈ మార్గాన్ని విడనాడి అమెరికా నాయకత్వంలోని వాణిజ్య కూటముల చంకనెక్కటం మొదలయ్యాకనే ఆయా దేశాల్లో విదేశీ మారకద్రవ్య సంక్షోభాలు మొదలయ్యాయి. 1970 దశకంలో భారతదేశంలో తొలిసారి తలెత్తిన ఆర్థిక సంక్షోభం కూడా ఈ కోవకు చెందినదే.
చైనా విప్లవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విముక్తి శక్తులు, ప్రజాతంత్ర శక్తుల్ని తట్టి లేపింది. పెట్టుబడిదారీ విధానానికి పెట్టన కోటగా ఉన్న అమెరికాలో సైతం యంగ్‌లార్డ్స్‌ పేరుతో 1960 దశకంలో ఏర్పడ్డ యువజన బృందాలు అమెరికా నయా వలస విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని కదిలించే ప్రయత్నం చేశాయి. ప్రపంచ ప్రఖ్యాత మానవావరణ శాస్త్రవేత్త, ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరుడు దు బాయిస్‌తో చైనా విప్లవ సారధి మావో సంప్రదింపులు జరిపితే బ్లాక్‌ పాంథర్స్‌ పార్టీ అధినేత హ్యుయే న్యూటన్‌ చైనా ప్రధాని చౌ ఎన్‌లైతో సంభాషణలు నడిపారు. ఈ ప్రయత్నాల ముగింపే అమెరికాలో చెలరేగిన వియత్నాం యుద్ధ వ్యతిరేక ఆందోళనలు. నాటి అమెరికా కళాశాలల్లో చైనా గెరిల్లా యుద్ధ నైపుణ్యం గురించి పరిశోధనలు సాగించటంతో పాటు మావో రచనలు కూడా పెద్దఎత్తున జనాదరణ పొందాయి.
జనచైనా ఏర్పాటు నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ముందు రెండు కర్తవ్యాలున్నాయి. విశాల ప్రజానీకాన్ని పేదరికం నుంచి విముక్తి చేయటం మొదటి కర్తవ్యం. రైతాంగాన్ని, కార్మికవర్గాన్ని సాధికారవంతుల్ని చేయటం రెండో కర్తవ్యం. ఈ లక్ష్యాల సాధన దిశగా చైనా కమ్యూనిస్టు పార్టీ అనేక నిర్ణయాలు తీసుకుంది. పరస్పర విరుద్ధమైన, పలు దొంతరలతో కూడిన అభివృద్ధి వ్యూహాలు రూపొందించింది. ఈ అభివృద్ధి వ్యూహాల నుంచి ఆవిర్భవించిందే చైనా లక్షణాలతో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం అన్న సూత్రం. సంబంధిత ఆచరణ. ఈ ఏడు దశాబ్దాల్లో చైనా మానవాభివృద్ధిలో అద్భుత ఫలితాలే సాధించింది. ఈ క్రమంలో రెండో పంచ వర్ష ప్రణాళిక చెప్పుకోదగిన పరిణామం. 1960 దశకంలో అమలు చేసిన గ్రేట్‌ లీప్‌ ఫార్వార్డ్‌ పథకం చైనా వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో మొదలైంది. తొలిదశలో ప్రజలందరికీ కనీస ఆహార అవసరాలు తీర్చేందుకు గాను గ్రామీణ కమ్యూన్‌ల ఏర్పాటు కీలకమైన ముందడుగు. ఈ కాలంలో చేపట్టిన భారీ సాగునీటి పథకాలే తర్వాతి కాలంలో ప్రతికూల వాతావరణం నుంచి చైనాను ఆదుకున్నాయి. ఈ కాలంలోనే మహిళలు పెద్దఎత్తున శ్రామికులుగా మారి పారిశ్రామిక, వ్యవసాయోత్పత్తుల్లో క్రియాశీలక పాత్ర పోషించటం మొదలైంది.
సాంస్కృతిక విప్లవంగా పిలవబడిన ఈ కాలంలో అనేక నిర్ణయాలు, వాటి రాజకీయ పర్యవసానాల పట్ల విశ్లేషకులకు, విమర్శకులకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ కాలంలో వేసిన పునాదులపైనే చైనా ఆర్థికాభివృద్ధి పురోగమి స్తుందన్న వాస్తవం కాదనలేనిది. ఈ కాలంలో ఆహారోత్పత్తులు 149శాతం పెరిగితే పారిశ్రామి కోత్పత్తి వార్షిక సగటు 11.5శాతం వృద్ధి రేటును సాధించింది. మహిళా విముక్తిలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం విశేషమైన పురోగతి సాధించింది. జనచైనా రాజ్యాంగంలో ఆరో అధికరణం, ”మహిళలను భూస్వామ్య వ్యవస్థలో బందీలుగా మార్చే విధానాన్ని రద్దు చేస్తుంది. రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక విద్యా విషయాల్లో స్త్రీలు కూడా పురుషులతో పాటు సమాన హక్కులు కలిగి ఉంటారు. స్వేచ్ఛగా వివాహమాడే హక్కు పురుషులతో పాటు స్త్రీలకు కూడా వర్తిస్తుంది” అని స్పష్టం చేసింది. ఈ అధికరణం కింద పెద్దలు కుదిర్చే పెళ్లిండ్లు, అక్రమ సంబంధాలు, బాల్య వివాహాలు రద్దయ్యాయి.
1981-2004 మధ్య కాలంలో దాదాపు యాభై కోట్లమంది చైనా ప్రజలు దారిద్య్రరేఖను అధిగమిస్తే ఈ కాలంలో అమెరికాలో దారిద్య్రరేఖ దిగువకు చేరే జనాభా పెరిగింది. పెట్టుబడిదారీ అభివృద్ది వ్యూహానికి, సోషలిస్టు అభివృద్ధి వ్యూహానికి మధ్య ప్రజోపయోగ కోణంలో ఉన్న తేడాలను ఈ పరిణామం స్పష్టం చేస్తుంది. 1978లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు చైనాలో కూడా పెట్టుబడిదారీ వర్గం ఆవిర్భావానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో సరికొత్త వర్గపోరాటానికి చైనా వేదికవుతోంది. దశల వారీగా అమలు జరుగుతున్న ప్రజాతంత్రీకరణ సంస్కరణలు చైనాలో కమ్యూనిస్టు పార్టీ స్థానాన్ని మరింత సంఘటితం చేయనున్నాయి. చైనా ఆర్థిక సంస్కరణలు తెచ్చి పెట్టే రాజకీయ ప్రమాదాలను అధిగమించి సోషలిస్టు ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేయనుందని ఆశిద్దాం.

RELATED ARTICLES

Latest Updates