పునరుద్దరణీయ ఇంధనాల వైపు మొగ్గుతున్న దేశాలు : కాలుష్యకారక ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచం దృష్టిని అమితంగా ఆకర్షించిన ‘అణు శక్తి క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. ఆశించినంత వేగంగా పర్యావరణానికి స్థిరత్వాన్ని సమకూర్చలేకపోతోంది. కర్బన ఉద్గారాలను వడివడిగా తగ్గించలేకపోతోంది. కర్మాగారాల ఏర్పాటుకు మరీ ఎక్కువ సమయం అవసరమవుతుండటం, ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుండటం కూడా అణు శక్తికి ప్రతిబంధకంగా మారుతోంది. ఫలితంగా ప్రపంచ దేశాలు ‘అణు బాటను వీడి పునరుద్ధరణీయ ఇంధనాల వైపు మొగ్గుచూపుతున్నాయి.
“ప్రపంచ అణు పరిశ్రమ వార్షిక స్థాయి నివేదిక (డబ్ల్యూఎన్ఐఎస్ఆర్)’ ఈ విషయాలను స్పష్టం చేసింది. అణు విద్యుత్తు కర్మాగారాలతో పోలిస్తే ఉత్పత్తి వ్యయం, సామర్థ్యం, ఉత్పత్తికి అవసరమైన సమయం వంటి అంశాల్లో పవన, సౌర విద్యుత్తు కర్మాగారాలు మెరుగ్గా ఉన్నాయని తేల్చింది.
నిర్మాణానికి పదేళ్లు అణు కర్మాగారాల నిర్మాణానికి దాదాపుగా పదేళ్లు పడుతోంది. పర్యావరణం వేగంగా క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో అణు శక్తి కోసం ఎక్కువ కాలం వేచి చూడకుండా పవన, సౌర విద్యుత్తు సామర్థ్యాన్ని చాలా – దేశాలు పెంచుకుంటున్నాయి.
* అణు కర్మాగారాల ఏర్పాటు-నిర్వహణ వ్యయం గత దశాబ్ద కాలంలో 23% పెరిగింది. ఆ వ్యయం సౌర విద్యుత్తు కర్మాగారాల విషయంలో 88%, పవన విద్యుత్తు కర్మాగారాల విషయంలో 69% తగ్గింది.
* 2018లో చైనా పునరుద్దరణీయ ఇంధనాలపై 9,100 కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. అణు విద్యుత్తు కోసం కేవలం 650 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టింది. పర్యావరణానికి స్థిరత్వం చేకూర్చడం తక్షణావసరం. అణు విద్యుత్తు ఆ పనిని చాలా నెమ్మదిగా చేస్తోంది. కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో పునరుద్దరణీయ ఇంధనాలతో పోలిస్తే వ్యయంలోగానీ, వేగంలోగానీ, సామర్థ్యంలోగానీ అణు విద్యుత్తు మెరుగ్గా ఏమీ కనిపించడం లేదు.
– మైకల్ పీడర్, డబ్ల్యూఎన్ఐఎస్ ఆర్ రూపకర్త