ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ ఆత్మపరిశీలన

ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలో ముఖ్య శిక్షక్‌గా 2004లో చేరిన పోరెడ్డి విజయశంకర్‌రెడ్డి మండల శారీరక్‌గా, మండల ప్రచారక్‌గా, నగర ప్రచారక్‌గా నిర్విరామంగా కృషి చేసి 2007లో మూడు మండలాలకు ప్రచారక్‌ అయ్యారు. పరకాల, భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలో ప్రచారక్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవడం వల్ల 2014లో ఈయన కాశ్మీర్‌ పరిరక్షణా సమితి తెలంగాణ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఆర్టికల్‌ 370 తొలగించాలని ఏర్పాటు చేసిన సమితి ఇది. అదే ఏడాది వరంగల్‌జిల్లా ఎన్నికల కోఆర్డినేటర్‌ అయ్యారు. 2016లో బీజేపీ అనుబంధంగా కళాశాల విద్యార్థుల ప్రముఖ్‌ అయ్యారు. దేశభక్తి పేరుతో సంస్థ చేస్తున్న దురాగతాల్ని చూడలేక, తను కూడా అందులో నిస్సహాయంగా ఓ భాగమైపోయానని, గ్రహించుకోవడం వల్ల, ఆయనలో అంతర్మధనం, ఆత్మపరిశీలన ప్రారంభమైంది. ఒక దశాబ్దానికి పైగా తను ప్రత్యక్షంగా చూసిన సంస్థ కార్యకలాపాల్లోని అనైతికత, దుర్మార్గం ఇంకా భరించలేక విజయశంకర్‌ రెడ్డి 2018లో సంస్థతో విభేదించి బయటకు వచ్చారు. సంస్థ విధానాలు నచ్చకపోవడమన్నది అంతకు ముందు నుండే ఉంటూ ఉండటం, తనలో ప్రశ్నించే తత్వం పెరిగిపోవడం, సంస్థలోని వ్యక్తులు దేనికీ సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం వల్ల ఆయనకు ఇక బయటపడక తప్పలేదు. వ్వక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, దేశభక్తి లాంటి మాటలతో జనాన్ని నమ్మించి, బుట్టలో వేసుకుని, వారితో అందుకు వ్యతిరేకమైన పనులు చేయిస్తున్నారని ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకున్న పోరెడ్డి సంస్థ నుంచి బయటికి రావడమే కాదు, అందులో తను చూసిన అఘాయిత్యాలను జనానికి తెలియజెప్పడం తన బాధ్యత అని కూడా అనుకున్నారు.
ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రచారక్‌గా పన్నెండేండ్లు పనిచేసి, ఆత్మావలోకనం చేసుకుని బయటికి రావడంతో పాటు, ఆ సంస్థతో ధర్మ యుద్ధానికి దిగిన వ్యక్తి పోరెడ్డి విజయ శంకర్‌రెడ్డి. ”దేశభక్తి ముసుగులో” అనేశీర్షికతో ఒక పుస్తకం ప్రకటించారు. దాన్ని సంఘమిత్ర ప్రచురణలు – కడపజిల్లా వారు నవంబర్‌ 2018లో ప్రచురించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ట్రాప్‌లో పడి ఎవరూ మోసపోగూడదని, అందులో పనిచేస్తున్నవారు కూడా తన లాగా కండ్లు తెరిచి, అందులోంచి బయటికి రావాలన్న ఉద్దేశంతో ఆయన ఆ పిలుపునిచ్చారు. తను రాసిన పుస్తకంలో ఏ విషయం మీదైనా ఎవరికైనా అభ్యంతరాలుంటే తనకు ఫోన్‌ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని, తను అన్నింటికీ ఆధారాలు చూపగలనని ఎంతో ఆత్మవిశ్వాసం ప్రకటించారు. ప్రతిభ, పట్టుదల గల విద్యార్థుల్ని, యువకుల్ని వారు ఆకర్షిస్తారని, వ్యక్తిత్వవికాసం పేరుతో మతోన్మాదం బోధించి ఉన్మాదులుగా తీర్చిదిద్దుతారని – అందువల్ల యువకులు అప్రమత్తంగా ఉండాలనే ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవవులు ఈ దేశ సమగ్రతకు భంగం కలిగించే వారని, వారిని అంతం చేయడం ఒక పవిత్ర దైవకార్యమని శిక్షణా కార్యక్రమాల్లో నూరిపోస్తారని.. ఆయన తన అనుభవాలు పంచుకున్నారు. భారతీయ తత్వమేమిటో కనీసమైన అవగాహన పెంచుకోకుండా మత ద్వేషం రెచ్చగొట్టడమే వారు తమ ధ్యేయంగా చేసుకున్నారని శంకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. దేశభక్తి సంస్థ ఏమాత్రం కాదని, అదొక దేశద్రోహ సంస్థ అని ఆయన ప్రకటించారు.

Related Posts

Follow Facebook Page

Subscribe YouTube

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.