ఆమెకి జాలి జాలి మాటలంటే అసహ్యం, కన్నీటి మూటలంటే చీదర… అందుకే తన పాత్రల్ని సానుభూతికి అందనంత ఎత్తులో నిలిపి నల్లజాతి ప్రజల జీవన పోరాటానికి గొప్ప సాహిత్య గౌరవాన్నిచ్చింది టోనీ మారిసన్. ఆత్మగౌరవం కంటే ప్రాణాలు ఖరీదైనవి కావని, బానిసత్వపు కోరల్లో జీవన్మ్రుతుల్లా బతకడం కంటే చావడం మేలని కన్నబిడ్డను చేతులారా చంపుకున్న నల్లతల్లి, సమాజం తన లేమిని, రంగుని త్రుణీకార దృష్టితో చూస్తుందని తెల్లవాళ్ళకు వలే తనకి కూడా అందమైన నీలి కళ్ళు ఉంటే బాగుండని ఆ నీలి కళ్ళ కోసం ఆరాటపడే నల్లజాతి అమ్మాయి వంటి సజీవమైన పాత్రలతో జాత్యాహంకార సాహిత్య విలువలపైన పెద్ద తారుడబ్బా కుమ్మరించిన ధిక్కారి టోనీ మారిసన్. అవును, సాహిత్యంలో నోబుల్ బహుమతి పొందిన మొదటి ఆఫ్రో-అమెరికన్ రచయిత్రి టోనీ మారిసన్ పాత్రలన్నీ వివక్ష, పీడనలపైన ధిక్కార పతాకాన్ని ఎగరేసి జాత్యాహంకారానికి, దాని తాలూకు అన్ని రకాల దాస్టీకాలకు ఎదురు నిలిచినవే.
భారతదేశపు కుల సమాజంలో దళిత స్త్రీల వలే అమెరికాలో నల్లజాతి స్త్రీలు అటు తెల్లజాతి నుంచి జాతి దురహంకారాన్ని, లైంగిక వేధింపులను, నల్లజాతి నుంచి పురుషాధిక్యతను ఎదుర్కొంటూ నిత్యం జీవన్మరణ పోరాటం చెయ్యడంపై టోనీ మారిసన్ పదునైన కవితాత్మక శైలిలో రాశారు. ప్రపంచంలో ఎక్కడైనా అణచివేతకు గురయ్యే సమూహాల నుంచే బలమైన సాహిత్యం వస్తుందని, వారి అక్షరాలకి రక్తం, చెమట, కన్నీరు అంటి ఉంటాయని ఆమె అంటారు.
దుర్భరమైన స్వేచ్చా రాహిత్యానికి గురౌతూ కనీసపు మనిషి హోదాకు నోచుకోని నల్లజాతి వారు అమెరికాలో బానిసత్వాన్ని అధికారికంగా రద్దు చేశాక కూడా సుమారు మరో శతాబ్దం పాటు బానిస బతుకుల్ని కొనసాగించవలసిన పరిస్థితి, వారిలో స్త్రీలు కార్చిన కన్నీరూ, చిద్రమైన వారి స్వప్నాలూ టోనీ మారిసన్ సాహిత్యంలో రక్తమాంసాలతో కనిపించడం ఆమె అక్షరాల గొప్పదనం. “చదువరులు ఎదుటివారి జాతి ఏమిటో తెలుసుకోనవసరం లేని పరిస్తితి వచ్చేదాకా చదవాలని నా కోరిక” అని ప్రకటించిన టోనీ మారిసన్ తన సాహిత్య ప్రయోజనం ఏమిటో స్పష్టంగా తెలిసిన రచయిత. ఆమె నోరులేని మూగ రోదనకు తన గొంతునిచ్చి ప్రపంచంలోని అణగారిన ప్రజలందరికీ ఆత్మబంధువైంది. She is noble, because she made her characters noble, unavailable to pity…
* Grand tributes to our ‘Beloved’ Tony Marrison on her first death anniversary
‘The Black Book’ ఆమె ప్రారంభించిన ప్రచురణల సంస్థ పేరు.
చల్లపల్లి స్వరూపరాణి