రాష్ట్రమంతా  జీరో ఎఫ్‌ఐఆర్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఇక ఫిర్యాదుకు పరిధి ఉండదు!
ప్రాథమిక విద్యలో నైతిక విలువలకు స్థానం
ప్రత్యేకంగా పాఠ్యాంశాల రూపకల్పన
పాఠ్య పుస్తకాల్లోనూ సహాయ నంబర్ల ముద్రణ
నేరస్థులపై నిఘాకు పంచాయతీ కార్యదర్శులు
నేరాలపై చైతన్యం తెచ్చేలా గ్రామ, పట్టణ కమిటీలు
దిశ ఘటన నేపథ్యంలో సమూల సంస్కరణలు
ఉన్నత స్థాయి సమావేశంలో సిద్ధమైన కార్యాచరణ

హైదరాబాద్‌: ఇకపై ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిధితో సంబంధం లేకుండా పోలీసులు కేసు(జీరో ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేయనున్నారు. దాంతోపాటుగా ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు నైతిక విలువలు బోధించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తారు.  నేరస్థులపై నిఘా కోసం పంచాయతీ కార్యదర్శుల సాయం తీసుకోవడంతోపాటు.. నేరస్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా తరచూ కౌన్సెలింగ్‌ ఇస్తారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు రూపొందించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు బుధవారం హోంమంత్రి మహమూద్‌ అలీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, పోలీసు కమిషనర్లు, అదనపు డీజీలు, ఐజీలు పాల్గొన్నారు. దిశ ఉదంతం నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తీసుకున్న నిర్ణయాలివి
అన్ని పోలీస్‌ స్టేషన్లలో జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌.విధానం అమలు చేయాలి. ఏదైనా నేరం, అదృశ్యం తాలూకూ ఫిర్యాదు వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం కాకుండా, పరిధి గురించి ఆలోచించకుండా కేసు నమోదు చేయాలి.
వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి..మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించి అనుసరించాల్సిన స్వల్ప, దీర్ఘకాలిక విధానాలు అమలు చేయాలి.
‘షి’ బృందాలను మరింత పటిష్టపరచాలి.
హాక్‌ఐ యాప్‌ను మరింత సులభంగా వాడేలా తీర్చిదిద్దాలి.
100, 181, 1098, 112 నంబర్లతోపాటు వివిధ రక్షణ యాప్‌లపై బాలికలు, మహిళలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థల నోటీసు బోర్డులు, ప్రజా రవాణా వాహనాలు, ఆటోలు, క్యాబ్‌లలోనూ వాటిని ప్రదర్శించాలి. పాఠ్య పుస్తకాల్లోనూ ముద్రించాలి.
భద్రతపై మహిళలను చైతన్యపరిచేలా, సాధికారత సాధించేలా వివిధ ఈ-లెర్నింగ్‌ కోర్సులు ఆరంభించాలి. వీటికి సంబంధించిన లఘుచిత్రాలు, చిన్నచిన్న నాటికలు తదితరాలను టీవీలు, సినిమా హాళ్లలో ప్రదర్శించాలి.
* బాలికలు, మహిళలను గౌరవించేలా ప్రాథమిక విద్య స్థాయిలోనే నైతిక విలువలు బోధించే విధానాలను విద్యాశాఖ అమలు చేయాలి. అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించాలి. ఆ అంశంలో పరీక్షలు నిర్వహించి, ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి.
‘షి’ బృందాల సాయంతో విద్యార్థులకు భద్రతపై శిక్షణ ఇప్పించాలి.
పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో అసాధారణ (నేర) ప్రవృత్తి కలిగిన వారిని గుర్తించి..వారిపై పోలీసు నిఘా పెట్టాలి. వారితోపాటు.. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.
మహిళలపై జరిగే నేరాలు, హింస..ఫిర్యాదు చేసే విధానంపై చైతన్యంతెచ్చేలా గ్రామ, పట్టణ స్థాయిలో కమిటీలు వేయాలి. ఇందుకోసం స్వయం సహాయక సంఘాలు, సెర్ప్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల సహకారంతో ప్రణాళిక రూపొందించాలి.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి. విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజెప్పి వారిని అప్రమత్తం చేయాలి.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates