జీరో సేద్యంతో నష్టమే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for జీరో సేద్యంతో నష్టమే"– తేల్చిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌
– అలా సాగుచేస్తే ప్రమాదంలో దేశ ఆహార భద్రత
– అదో మిథ్య.. శాస్త్రీయంగా నిరూపితం కాదు : వ్యవసాయ శాస్త్రవేత్తలు

ఆరుగాలం శ్రమిస్తే…పెట్టిన పెట్టుబడితో పాటు ఎంతో కొంతమిగిలేది. ఇది గతం. ఇపుడు సేద్యానికి అవసరమైన కాడెద్దులు కనుమరుగయ్యాయి. కుటుంబసభ్యులే కాడిమోసినా…పెట్టుబడికి పెట్టిన పైసలు కూడా రావట్లేదు. వచ్చిన కొద్దిపాటి పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే..మధ్యదళారులు దోచేస్తున్నారు. రైతుకు ఏం కావాలో…పాలకులు ఏం చేయాలో స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు చేసింది. అధికారంలోకి రాకముందు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నది మోడీ సర్కార్‌. ఇపుడు జీరో సేద్యంతో అన్నదాత బాగుపడతాడని అంటున్నది. ఇంతకీ ఈ తరహా వ్యవసాయం దేశానికి మేలు చేస్తుందా..లేదా అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ జీరో సేద్యం నిరూపయోగమేనని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ : మోడీ సర్కారు ప్రతిపాదిస్తున్న జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫామింగ్‌ (జెడ్‌బీఎన్‌ఎఫ్‌)తో దేశానికి నష్టమేనని స్వయంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చఝల్‌ సైన్సెస్‌ (ఎన్‌ఏఏఎస్‌) తేల్చి చెప్పింది. ఈ మేరకు గత నెల 1న ఇందుకు సంబంధించి ‘జెడ్‌బీఎన్‌ఎఫ్‌ మిథ్యా.. లేక నిజమా.. !’ అనే పేరు మీద ఓ పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో జెడ్‌బీఎన్‌ఎఫ్‌ విధానంలో పంటలు పండిస్తే దాంతో దేశ ఆహార భద్రతకు ఎనలేని నష్టం వాటిల్లుతుందని తెలిపింది. అది దేశ ప్రజల ఆహారావసరాలను ఎంతమాత్రమూ తీర్చలేదని స్పష్టం చేసింది. దేశంలో ఉన్న పలు వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో విస్తృతమైన ప్రయోగాలు చేసి ఎన్‌ఏఏఎస్‌ ఈ పరిశోధనను రూపొందించింది. ఈ విధానాన్ని మహారాష్ట్రకు చెందిన సుభాష్‌ పాలేకర్‌ రూపొందించిన విషయం విదితమే. ఇందులో ఆవు మల మూత్రాలు, బెల్లం, పిండి పదార్థాలతో ఓ రసాయన మిశ్రమాన్ని తయారుచేసి దాంతో పంటలు పండిస్తారు.

కాగా, ఎన్‌ఏఏఎస్‌ పేర్కొన్న అంశాల ప్రకారం… ప్రపంచ జనాభాలో నాలుగోవంతు మంది ఆకలితో అలమటిస్తున్నారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా పోషకాహారలోపంతో బాధపడుతున్న చిన్నారుల్లో 40 శాతం మంది భారత్‌ నుంచే ఉన్నారు. మరోవైపు మనదేశంలో దాదాపు 80 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే. వారి ఆదాయ పరిస్థితులూ అంతంతమాత్రమే. ఈ పరిస్థితుల్లో జీరో సేద్యం విధానంతో పంటలు పండిస్తే అది దేశానికి తీవ్ర నష్టం. డెబ్బై ఏండ్లు కష్టపడి సాధించుకున్న మేధో సంపత్తి బూడిదలో పోసిన పన్నీరవుతుంది. దీనిద్వారా వరి, గోదుమ, పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల వంటి పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గుముఖం పడుతుంది.

దీనిని శాస్త్రీయంగా పరిశీలించడానికి మీరట్‌లోని మోడిపురంలో ఉన్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ ఫార్మింగ్‌ రిఫ్రెష్‌ (ఐఐఎఫ్‌ఎస్‌ఆర్‌)లో వరి, గోదుమ పంటలు వేసి పరిశోధనలు చేశారు. కానీ గోధుమలో 59 శాతం, వరిలో 32 శాతం తగ్గుదల ఉంది. ధార్వాడ్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌లోనూ గడిచిన మూడేండ్లలో పరిశోధనలు చేశారు. సోయా బిన్‌, మొక్కజొన్న, వేరుశెనగ, వంటి పంటల్లో 30శాతం తక్కువ ఉత్పత్తి కనిపించింది. దీనిపై ఎన్‌ఏఏఎస్‌ ప్రతినిధి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.పరోడా స్పంది స్తూ.. జీరో సేద్యం అనేది మిథ్య మాత్రమేననీ, అది శాస్త్రీయంగా నిరూపితం కాలేదని వివరించారు. జెడ్‌బీఎన్‌ఎఫ్‌ ప్రకారం దేశంలో బార్లీ గోధుమలను ప్రస్తుతం సాగుచేస్తున్న విస్తీర్ణం కంటే ఐదింతలు ఎక్కువ పండించాలి అని చెప్పారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో దేశం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కుంటుందని అన్నారు. 2050 నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుకోనుందనీ, అయితే ప్రజలకు తగినంత ఆహారభద్రతను కల్పించాలంటే మాత్రం జెడ్‌బీఎన్‌ఎప్‌ విధానం ద్వారా సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. అంతేగాక భారత జీడీపీ వృద్ధిరేటు 8 శాతం ఉండాలంటే దేశ ఆహారధా న్యాల ఉత్పత్తి 457 మిలియన్‌ టన్నులు ఉండాలనీ, అది 2050లో మరింత పెరగనున్నదనీ, ఈ నేపథ్యం లో జెడ్‌బీఎన్‌ఎఫ్‌ ఎంతమాత్రమూ ఉపయోగకరం కాదని స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలోని 86 శాతం చిన్న, సన్నకారు రైతులు దీనిని ఉపయోగించినా దేశం తీవ్ర ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బదులు వ్యవసాయరంగంలో పెట్టుబడులను పెంచి, నూతన వంగడాల పరిశోధనలకు అవకాశం కల్పిస్తూ, కొత్త సాంకేతికతను ఉపయోగించి దానిని రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ఈ పరిశోధన పత్రాన్ని ప్రచురించిన కమిటీ సభ్యులు సర్కారుకు సూచించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో భాగంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి జెడ్‌బీఎన్‌ఎఫ్‌ను ప్రోత్సహిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఏఏఎస్‌ పై విధంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates