నాడు ఇందిర.. నేడు మోడీ..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నలభై ఐదు సంవత్సరాల క్రితం, 1975 జూన్‌ 25/26 అర్థరాత్రి ప్రాంతంలో భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధిస్తూ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. అప్పుడు నేను చండీఘర్‌ కేంద్ర పాలిత ప్రాంతానికి జిల్లా మెజిస్ట్రేట్‌ గా ఉన్నాను. జయప్రకాశ్‌ నారాయణ (జె.పి), ప్రభుత్వానికి ప్రథమ విరోధిగా, నా ఖైదీ గా ఉన్నారు. కాబట్టి, ఢిల్లీ లో ఉన్నత స్థాయిలో జరిగే వాస్తవాలన్నీ నా అవగాహన లో ఉన్నాయి.

‘ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిరంకుశ పద్ధతి ద్వారా’ పాలించడానికి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కి ఈ ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ (నేషనల్‌ ఎమర్జెన్సీ) ఒక సాధనం అని చెప్పవచ్చు. భారత రాష్ట్రపతి బహిరంగ ప్రకటనతో, మన రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 14, 21, ఆర్టికల్‌ 22 లోని వివిధ క్లాజ్‌ ల లోని అంశాలు అమలు జరుగకుండా నిలిపివేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అంతర్గత భద్రతా చట్టం, నియమ నిబంధనల నిర్వహణను కఠినతరం చేశారు. వాటిని సమీక్షించకుండా కోర్టులను కూడా అడ్డుకొని, ముందస్తుగా నిర్బంధించిన రాజకీయ ఖైదీలకు ఏ విధమైన ఉపశమనం కలిగించలేదు.

”పాలక పార్టీ నాయకురాలు ఈ దేశాన్ని తమ స్వంత సొత్తుగా పరిగణించారు. అది దేశవ్యాప్తంగా ప్రజలను మానసిక రోగులుగా మార్చి, భయకంపితులను చేసి తరిమి కొట్టిన దాడి”గా ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని పౌర హక్కుల సంఘం నేత, రజనీ కొఠారి వర్ణించారు. ఇదంతా అప్పుడున్న పరిస్థితి. మరి ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది?

మార్చి 24, 2020, ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ విధిస్తూ బహిరంగ ప్రకటన చేశారు. ‘పూర్తి లాక్‌డౌన్‌’ను విధించడానికి ఉపయోగించిన ‘డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌-2005’… కేంద్ర ప్రభుత్వానికి ఆ విధమైన నిర్దిష్ట అధికారాలను ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత చట్ట పరిధిలో అప్పటికే లాక్‌డౌన్‌ ను విధించినపుడు, దాంతోపాటుగా… దేశ వ్యాప్తంగా ఒక క్రూరమైన లాక్‌డౌన్‌ ను (నాలుగు గంటల కన్నా తక్కువ సమయం ముందు నోటీసు ఇచ్చి) కేంద్ర ప్రభుత్వం విధించాల్సిన అవసరం లేదు.

ఈ నయా అత్యవసర పరిస్థితి ఏ ఫలితాలు ఇచ్చింది? ఏ పద్ధతి, చట్టపరమైన అధికారం లేకుండా, ఇది దేశం లోని ప్రతి పౌరుడ్ని గృహ నిర్బంధంలో ఉంచింది. రాజ్యాంగం కల్పించిన పౌర స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను నిరాకరించింది. అదే విధంగా ఇది రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ‘జీవనోపాధి’ హక్కును ఉపయోగించుకోకుండా అడ్డుకుంది. ఫలితంగా ప్రజలు అనేక మంది పేదరికానికి, దారిద్య్రానికి గురై, దిక్కులేని వారయ్యారు. ఇది ప్రతీ పౌరుడ్ని ‘నేరస్తునిగా’ పరిగణిస్తూ వారిపై’ పోలీసు రాజ్య’ క్రూరత్వాన్ని ప్రదర్శించేందుకు అనుమతించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారిపై దేశద్రోహ ఆరోపణలు చేస్తూ, పౌరులలో, జర్నలిస్టులలో భయాందోళనలు సష్టించింది. ప్రజలను జంతువులుగా పరిగణిస్తూ, వారిని కొడుతూ, వారిపై రసాయనాలు చల్లుతూ, మానవులకు ఎంతో విలువైన గౌరవ, మర్యాదలను ప్రభుత్వం తీసివేసింది. కోట్లాదిగా ఉన్న వలస కార్మికుల ఎన్నో అవస్థలు పడుతూ తమ స్వస్థలాలకు చేరుకున్న తీరు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం సిగ్గు పడేట్లు చేశాయి.

ఇది నయా ఎమర్జెన్సీ కాబట్టి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఉండి తీరుతుంది. అనేక లోతైన గాయాలతో దేశం రక్తం చిందించే సమయంలో ఇంకా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యుత్‌ ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కఠినమైన కార్మిక చట్టాల అమలు లాంటివి జరుగుతున్నాయి. ఇంకా బలవంతంగా వసూలు చేసిన చందాల ద్వారా ఏర్పడిన పి.యం.కేర్స్‌ నిధులకు లెక్కలు లేవు.

ఈ నయా ఎమర్జెన్సీని, దాని అమలు తీరును నిజాయితీపరులైన నిపుణులు ఖండిస్తున్నారు. దీనిని ”జాతి సంహారం”గా ప్రముఖ మేథావి, తత్వవేత్త నోమ్‌ చామ్‌స్కీ పేర్కొన్నారు. ”భారత ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి లాక్‌డౌన్‌ కు నాలుగు గంటల ముందు మాత్రమే హెచ్చరించారు. అది వంద కోట్ల ప్రజలపై ప్రభావాన్ని చూపింది. వారిలో కొంత మందికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడ్డారు. పెద్ద సంఖ్యలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులను యాజమాన్యాలు బలవంతంగా వెళ్ళగొట్టాయి. వేల మైళ్ళ దూరంలో ఉన్న తమ స్వగ్రామాలకు నడిచి వెళ్ళమని చెప్పారు. రోడ్ల వెంట చావమన్నారు. ఇది ఒక పెద్ద విపత్తు” అన్నారు.

ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు నిశ్శబ్దంలో గడిపారు. వింతైన, ఆశ్చర్యకరమైన చర్యలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రభుత్వ శాఖలు, వాటి అధికారులు ఒత్తిడికి లొంగిపోయి తమ ప్రభు భక్తిని చాటుకున్నారు. ఉన్నత న్యాయస్థానం ఎమర్జెన్సీ పాలనకు తలవంచి చెప్పిన విధంగా చేయడానికి అంగీకరించి, విధానపరమైన నిర్ణయాలు కూడా చేసింది. అదే విధంగా ఆ పాలనలో పౌరులందరికీ జీవించే హక్కు కూడా లేకుండా పోయింది. అన్ని రాజకీయ పార్టీలను ఏమీ చేయనీయకుండా బలహీనపరచింది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు అప్పటి పరిస్థితులకు భిన్నంగా ఏమీ లేవు. నయా ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబడుతున్న సంస్థలు, వ్యవస్థలను ధ్వంసం చేశారు. భయోత్పాతం, హింసాయుత చర్యల ద్వారా పాలించడం కొత్త విధానం.

ఇందిర ఎమర్జెన్సీ కాలంలో వలెనే ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి మండలి ఉనికిలో లేదు. రాష్ట్రాల పాత్ర లేకుండా పోయింది. పార్లమెంట్‌లో మందబలంతో నాజీ తరహా పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చారు. మొత్తం దేశం ఆ చట్టానికి నిరసన తెలిపినపుడు మహిళలు, పిల్లలపై కూడా అత్యంత క్రూరంగా ‘పోలీసు రాజ్యాన్ని’ ప్రయోగించారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ లో అంతటా ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోలీసులు నిరసనకారులపై దేశద్రోహం కేసులు మోపుతూ, వారిని వెంబడించే పనిలో ఉన్నారు. చిన్న చిన్న కారణాలతో యువకులు, విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వారిని నిర్భందించే పనిలో నిమగమయ్యారు. క్రూరమైన నేరాలకు ఉసిగొల్పి, వాటికి పాల్పడిన హిందూత్వ శక్తులను రక్షించేందుకే ఈ చర్యలు చేస్తున్నారు.

ప్రస్తుత నయా ఎమర్జెన్సీ స్వభావం, అంతర్గత విషయాలు భిన్నమైనవి అయినప్పటికీ అప్పటి ఎమర్జెన్సీకి, భయోత్పాతంతో, హింసాయుత చర్యలతో సాగుతున్న ప్రస్తుత పాలనకు మధ్య ఒక ఉమ్మడి లక్షణం ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమంటే, అప్పుడు అనుసరించిన పద్ధతి ‘ఝట్కా’ (సిక్కు మతాచారం ప్రకారం ఒక్క వేటుతో జంతువు తల నరకడం ) అయితే, ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి (ముస్లిం మతాచారం ప్రకారం జంతువు తల తప్పించడం) ‘హలాల్‌’. కానీ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల పైన ఉండే ఈ రెండింటి ప్రభావం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. బహుశా, ఇప్పుడు మరింత హింసాయుతంగా, భయానకంగా ఉండొచ్చు! అప్పుడు ‘ఉక్కు మహిళ’ విఫలం అయ్యింది. ఇప్పుడు మాత్రం ఎందుకు భిన్నంగా ఉంటుంది? ‘గతం నుంచి పాఠాలు నేర్వని వారికి భవిష్యత్తు ఉండదు’ అని ఒక వివేకవంతుడు అన్నాడు.

– యం.జి. దేవసహాయం
(రచయిత మాజీ ఆర్మీ మరియు ఐఏఎస్‌ అధికారి)

Courtesy Prajasakti

RELATED ARTICLES

Latest Updates