జేఎన్యూపై స్కెచ్!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– బాధితులనే ఇరికించే యత్నం
– వర్సిటీ యాజమాన్యం, మోడీ సర్కార్‌ కుమ్మక్కు
– జతకలిసిిన ఢిల్లీ పోలీసులు
– కొనసాగుతున్న జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనలు
– హైదరాబాద్‌లో ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల సంఘీభావం
– సీసీపుటేజ్‌ను భద్రపర్చాలని హైకోర్టులో ప్రొఫెసర్ల పిటిషన్‌

జేఎన్‌యూలో జరిగిన దాడిపై వర్సిటీ యాజమాన్యం, కేంద్రప్రభుత్వం మరో కుట్రకు తెరలేపాయి. ముసుగు గూండాల సాయంతో జేఎన్‌యూ విద్యార్థులపై దాడులకు పాల్పడి క్యాంపస్‌లో భయానక వాతావరణం సృష్టించాలని చూసిన అరాచకశక్తులు.. బాధితులనే బాధ్యులుగా చేసేందుకు కుట్ర పన్నాయి. విద్యార్థుల పోరాటస్ఫూర్తితో ‘దాడి మీ పనే’నని చేతులన్నీ అరాచకశక్తుల వైపునకే చూపిస్తుండటం తట్టుకోలేకపోయాయి. వీరికి పోలీసులూ జతకలిశారు. దాడిలో గాయాలపాలైన విద్యార్థులే.. జేఎన్‌యూలో దాడులకు పాల్పడ్డారని అనుమానిస్తూ శుక్రవారం ఢిల్లీ పోలీసులు ఫోటోలు విడుదల చేశారు. తొమ్మిది మంది నిందితుల్లో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు ఆ సంఘానికి చెందినవారే కావడం గమనార్హం. ఓవైపు విద్యార్థులపై ‘మేమే దాడి చేశాం.. ఇలాగే వ్యవహరిస్తే మళ్లీ చేస్తాం’ అని హిందూ రక్షాదళ్‌ చీఫ్‌ పింకి చౌదరితో పాటు ఏబీవీపీ నాయకులు సైతం బాహాటంగా ప్రకటించినా పట్టించుకోని పోలీసులు, వర్సిటీ యాజమాన్యం.. బాధితులపైనే నేరాన్ని మోపేందుకు యత్నిస్తున్నది. ఇదిలాఉంటే ‘ఇండియా టుడే’ చేపట్టిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌తో దాడులకు పాల్పడింది తామేనని ఏబీవీపీకి చెందిన సభ్యులు ఒప్పుకున్నట్టు తేలింది. అయినా కూడా ఈ కేసు మరకలు తమకు అంటకుండా ‘పోలీసుల’ సాయంతో కేంద్రమంత్రులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. మరోవైపు జేఎన్‌యూ దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వర్సిటీలలో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. హైదరాబాద్‌లో ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు.

న్యూఢిల్లీ బ్యూరో
జేఎన్‌యూలో ఈ నెల 5న జరిగిన ఘటనపై ఢిల్లీ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నుతూ కథలు అల్లుతున్నారు. అందులో భాగంగానే దాడికి గురై, గాయాలు పాలైన బాధితురాలి పేరును అనుమానితుల జాబితాలో ఉంచారు. ఢిల్లీ పోలీసులు తాజాగా విడుదల చేసిన పోటోల్లో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీఘోష్‌ ఫొటోను కూడా విడుదల చేసింది. అధ్యక్షురాలి పోటోను ఎలా చేర్చుతారని పలువురు ప్రశ్నించారు. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని మేధావులు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని.. అందుకు కారణమైన వీసీని వదిలేసి.. ఇలా ఫొటోలు వెల్లడించడమంటే సమస్యను పక్కదారి పట్టించడమేనని తెలుస్తోంది.

శుక్రవారం ఢిల్లీ పోలీస్‌ క్రైం బ్రాంచ్‌ డీసీపీ జోరు టిర్కీ తొమ్మిది మంది అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు. జేఎన్‌యూ సంఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఫీజుల పెంపుపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలపై ఆరోపణలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్‌, డీఎస్‌ఎఫ్‌ సంఘాలే కారణం అన్నట్టు చిత్రీకరించారు. ఇప్పటివరకు నిందితులను అదుపులోకి తీసుకోలేదని, త్వరలోనే నిందితులను విచారణ ప్రారంభిస్తామని చెప్పారు. ఢిల్లీ పోలీస్‌ పీఆర్‌ఓ ఎంఎస్‌ రంధ్వా మాట్లాడుతూ జేఎన్‌యూ సంఘటనలో నమోదైన క్రిమినల్‌ కేసులకు సంబంధించిన దర్యాప్తును క్రైం బ్రాంచ్‌ నిర్వహిస్తోందని, కానీ ఈ కేసులో తప్పుడు సమాచారం ప్రచారం అవుతున్నదని అన్నారు. పోలీసులు విడుదల చేసిన పోటోల్లో వికాష్‌ పటేల్‌, పంకజ్‌ మిశ్రా, చుంచున్‌ కుమార్‌, యోగేంద్ర భరద్వాజ్‌, డోలన్‌ సమనాట, సుచేత తాలూక్దార్‌, ప్రియా రంజన్‌, వాస్కర్‌ విజరు వారితో పాటు అయిషీ ఘోష్‌ ఫొటోను కూడా ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.

పోలీసులది పక్షపాత వైఖరి: అయిషీఘోష్‌, జేఎన్‌యూఎస్‌యూ
ఢిల్లీ పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని, తనపై జరిగిన దాడికి సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీఘోష్‌ స్పష్టం చేశారు. పోలీసులు చేసిన ఆరోపణలపై స్పందించిన ఆమె శాంతి భద్రతల పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని, దర్యాప్తు న్యాయబద్దంగా జరుగుతుందని విశ్వసిస్తున్నానని తెలిపారు. పోలీసులు పక్షపాత వైఖరితో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాను చేసిన ఫిర్యాదులపై ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ప్రశ్నించారు. తాను బాధితురాలినైతే, దాడెలా చేస్తానని ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా ఏమైనా ఉంటే బహిరంగ పర్చాలని సవాల్‌ విసిరారు. ”మేము ఏం తప్పు చేయలేదు. మేము పోలీ సులకు భయపడం. మేము చట్టానికి అండగా నిలుస్తాం. మా ఉద్యమాన్ని శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నాం” అని అన్నారు. జేఎన్‌యూలో జరిగిన హింసను ఢిల్లీ పోలీసులు అండర్‌ ప్లే చేస్తున్నారని జేఎన్‌యూటీఏ విమర్శించింది. ఇటువంటి సంఘటనలను అండర్‌ ప్లే చేయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడమేనని పేర్కొంది. వర్శిటీలో సాయంత్రం విద్యార్థులు భారీ మానవహారం నిర్వహించారు.
జేఎన్‌యూఎస్‌యూ అడ్మినిస్ట్రేషన్‌, జెఎన్‌యుఎస్‌యు బృందంతో ఎంహెచ్‌ఆర్‌డి భేటీ
శుక్రవారం ఏంహెచ్‌ఆర్‌డీ కార్యాలయం (శాస్త్రి భవన్‌)లో జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్‌, జేఎన్‌యూఎస్‌యూ బృందంతో వేర్వేరుగా హెచ్‌ఆర్‌డీ క్యార్యదర్శి అమిత్‌ ఖరే భేటి అయ్యారు. తొలుత ఉదయం 11:30 గంటలకు జేఎన్‌ యూ వీసీ ఎం.జగదీశ్‌ కుమార్‌, రెక్టార్‌, రిజిస్ట్రార్‌తో సమా వేశం అయ్యారు. అనంతరం వీసీ జగదీశ్‌కుమార్‌ మీడి యాతో మాట్లాడుతూ ”వర్శిటీ తన పనిని కొనసాగిస్తుంది. విద్యా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ప్రతి విద్యార్థి తన విద్యా లక్ష్యాలను కొనసాగించడానికి మేము సహాయం చేయాలనుకుంటున్నాం” అని తెలిపారు. డిసెంబర్‌ 11 ఏంహెచ్‌ఆర్‌డీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమ లు చేస్తామన్నారు. అనంతరం సాయంత్రం 3:30 గంట లకు జేఎన్‌యూఎస్‌యూ బృందంతో భేటీ అయ్యారు. హెచ్‌ ఆర్‌డీ కార్యదర్శి అమిత్‌ ఖరేతో జరిగిన సమావేశంలో జేఎన్‌ యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీఘోష్‌, ఉపాధ్యక్షుడు సాకేత్‌ మూన్‌, ప్రధాన కార్యదర్శి సతీష్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు. అయిషీఘోష్‌ మాట్లాడుతూ భవిష్యత్తు ఆందోళనపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

వీసీకి హెచ్‌ఆర్‌డీ సమన్లు
జేఎన్‌యూ వైస్‌చాన్సలర్‌ ఎం.జగదీశ్‌కుమార్‌కు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. అంతేకాకుండా వర్శిటీలో జరిగిన హింసను అదుపు చేయడంలో వీసీి విఫలం అయినట్టు హెచ్‌ఆర్‌డీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

Courtesy Nava telagana

RELATED ARTICLES

Latest Updates