‘రక్షణ చట్టం.. రక్షణ ఛత్రం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
ఇంటా బయట మహిళలకు రక్షణ కరవవుతోంది. రోజుకో గగుర్పాటు కలిగించే చేదు వార్త వినాల్సి వస్తోంది. ఇటీవల జరిగిన అఘాయిత్యాలు అందరినీ నివ్వెరపాటుకు గురిచేశాయి. అదను చూసుకొని లైంగిక వేధింపులు, భౌతిక దాడులకు పాల్పడే మృగాళ్లకు ముకుతాడు వేయాల్సిన తరుణమిది. ఎవరి తోడూ లేకుండా మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లి తిరిగి క్షేమంగా చేరుకునే పరిస్థితులు రావాలి. భద్రతకు అండగా నిలబడ్డంతోపాటు ఆపత్కాలంలో తక్షణం సాయమందించే వ్యవస్థలపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సి ఉంది. దుర్మార్గుల పీచమణచేందుకు కఠిన శిక్షలు ఉన్నాయి. మహా నగరంలో ప్రతీ మహిళ ఈ దిశగా చైతన్యం పెంచుకునేలా పలు చట్టాలు, నేరస్థులకు పడే శిక్షలు.. ఇలా వివిధ అంశాలపై ‘రక్షణ చట్టం.. రక్షణ ఛత్రం’
వెంటాడి.. వేధిస్తున్నారా!
ఐపీసీ 354(డి)‘రక్షణ చట్టం.. రక్షణ ఛత్రం

ఏటా మూడు కమిషనరేట్ల పరిధుల్లో వచ్చే ఈ తరహా ఫిర్యాదులు: 1670దైనందిన జీవితం, వేర్వేరు పనుల నిమిత్తం నగరంలో నివసిస్తున్న వారు బయటకు వస్తున్నారు. వీరివెనుక ఎవరూ ఉండరు అన్న అంచనాతో పోకిరీలు, ఆకతాయిలు వేధిస్తున్నారు. కొందరైతే ఏకంగా మీదపడి రచ్చ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే కేసులు, విచారణలు అంటూ ఠాణాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు సహిస్తున్నారు.

ఎక్కడెక్కడ
కోఠి, నారాయణగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థ పక్కన బస్‌స్టాప్‌లు, కొంపల్లి, సుచిత్ర పరిసరాలు, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, బేగంపేట, ప్రకాష్‌నగర్‌ బస్‌స్టాప్‌, చిరాగ్‌ అలీలేన్‌ ప్రాంతాలు, కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ పరిసరాలు.

బాధితులెవరు..
బస్సులు, ఆటోల్లో  ప్రయాణించే యువతులు, ఒంటరి మహిళలు, ప్రజా రవాణా సాధనాలు వాడే మహిళలు బాధితులుగా మిగులుతున్నారు. నిందితుల్లో యువకులే అధికం.

శిక్షలిలా…
వెంటాడి వేధిస్తున్న ఈవ్‌టీజర్లు, పోకిరీలపై  ఐపీసీ 354(డీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తున్నారు.
కోర్టు విచారణలో నేరం రుజువైతే నిందితులకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. దీంతోపాటు జరిమానా అదనంగా ఉంటుంది.

అశ్లీల వీడియోలతో ఆగం చేస్తుంటే!
ఐటీ చట్టం 66సిఏటా చరవాణులతో  వేధింపులపై వచ్చే ఫిర్యాదులు: 900

మహిళలు, యువతులు, విద్యార్థినుల చరవాణికి అసభ్య చిత్రాలు, వీడియోలు వస్తున్నాయి. చరవాణిలో వాట్సాప్‌ చూద్దామంటే సిగ్గుతో చితికిపోతున్నారు. భరించలేక కొందరు వాట్సాప్‌ సౌకర్యాన్నే తీసేసుకుంటుండగా… మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.  కొందరిని నిందితులు బెదిరించి పబ్బం గడుపు కొంటున్నారు.

ఎక్కడెక్కడ
ఎక్కువగా మాదాపూర్‌, రాయదుర్గం, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో బాధితులు వీటి బారిన పడ్డారు.

శిక్షలిలా…
బాధితులకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్న సైబర్‌ నేరస్థులపై ఐటీ చట్టం 66సీ కింద కేసు నమోదు చేస్తున్నారు.
గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షలు విధిస్తున్నాయి.

దుశ్శాసనచేష్టను దునుమాడేద్దాం
ఐపీసీ 3 54(బి)ఏటా బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు (శాతాల్లో..):  20నగరం శివారు ప్రాంతాల్లోని మహిళలు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇలాంటి పరిస్థితులను అవకాశాలుగా మలుచుకుని మద్యం మత్తులో యువకులు, నేరాలు చేసేందుకు ఒంటరి మహిళపై దాడులు చేస్తున్నారు. వారిపై ఒత్తిడి చేసి వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి ఒడిగడుతున్నారు.

ఎక్కడెక్కడ
శివారులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిర్మాణాలు కొనసాగుతున్న చోట్ల, బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్‌ మాల్స్‌లోను వెలుగుచూస్తున్నాయి.

శిక్షలిలా…
నిందితులపై పోలీసులు ఐపీసీ 354(బీ) సెక్షన్‌ రక్షణగా ఉంటోంది.
బలవంతపు దాడులు, శీలానికి భంగం ఎదుర్కొంటే బాధితులు డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి.
నిందితులకు కోర్టు కనిష్ఠంగా మూడేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తుంది.

లైంగికంగా వేధిస్తే జైలే..
ఐపీసీ 354(ఎ)‘రక్షణ చట్టం.. రక్షణ ఛత్రం

వసతి గృహ పరిసరాల్లో ఏటా వేధింపులు(శాతాల్లో) 30మెట్రో నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో తోడు లేకుండా మహిళలు బయటకు వెళ్లలేక పోతున్నారు. హైదరాబాద్‌లో రోజుకు 4.5లక్షల యువతులు, మహిళలు, 3లక్షల విద్యార్థినులు ఉదయం వెళ్లి సాయంత్రం ఇళ్లకు చేరతారు. ఈ క్రమంలో  ముసుగేసుకున్న మృగాళ్లు లైంగికంగా వేధించినా… భౌతిక దాడులకు దిగినా ఫిర్యాదు చేస్తే చట్టం వారి పని పడుతుంది.

ఎక్కడెక్కడ?
లైంగిక వేధింపులు అబిడ్స్‌, అంబర్‌పేట, సైఫాబాద్‌, చిలకలగూడ, బేగంపేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, భౌతికంగా దాడులు కోఠి, కాచిగూడ, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌ పోలీసు ఠాణాల పరిధిలో వెలుగు చూస్తున్నాయి.

బాధితులెవరు..
బాధితుల్లో ఎక్కువ మంది 30ఏళ్లలోపు యువతులే ఉంటున్నారు. బాధితులను వారికి తెలిసిన వారు పరిచయం ఉన్నవారే లైంగికంగా వేధిస్తున్నారు.

శిక్షలిలా…
నిందితులపై పోలీసులు ఐపీసీ 354(ఎ) సెక్షన్‌  కింద కేసులు నమోదు  చేస్తున్నారు.
వేధింపులు, దాడులు చేసిన వారిలో ఎంతమంది ఉన్నా సరే ఈ సెక్షన్‌ వర్తిస్తుంది.
నేరం రుజువైతే మూడేళ్ల నుంచి ఏడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది.

తొంగి చూస్తే తోలు తీస్తుంది!
ఐపీసీ 354(సి)‘రక్షణ చట్టం.. రక్షణ ఛత్రం

ఏటా నగరంలో రహస్య కెమెరాతో చూస్తున్న ఘటనలు 50 నుంచి 100సైఫాబాద్‌ పరిధిలో ఓ యువతికి అవమానభారంతో కుంగిపోయే అనుభవం ఎదురయ్యింది. ఆమె స్నానం చేసేందుకు వెళ్తుండగా… బాత్‌రూమ్‌ కిటీకి వద్ద ఏదో వస్తువు ఉన్నట్టు గమనించింది. అనుమానంతో అక్కడికి వెళ్లి చూడగా… కెమెరా ఫోన్‌ కనిపించింది. షాక్‌కు గురై ‘షి’బృందానికి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు యువకులను పట్టుకున్నారు.

ఎక్కడెక్కడ
వస్త్ర దుకాణ ట్రయల్‌ రూం, దుకాణ సముదాయాల్లో, పెద్దహోటళ్ల గదుల్లో, రెస్టారెంట్ల బాత్‌రూంలలోనూ ఈ నేత్రాలు ఉన్నట్లు ఆయా ఠాణాల పరిధుల్లోని కేసుల్లో చూశాం. ఎక్కువగా పశ్చిమ మండలం, మాదాపూర్‌,  ఎల్బీనగర్‌ జోన్లలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి.

బాధితులెవరు..
బాధితులు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు యువతులే ఉన్నారు. తోటి పనివారు, ఒంటరిగా ఉండే యువకులు ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు.

శిక్షలిలా…
మహిళల మానానికి భంగం కలిగిలేలా ప్రవర్తించిన నిందితులపై ఐపీపీ 354(సి) సెక్షన్‌ కింద కేసు పెడతారు
కనిష్ఠంగా ఏడాది, గరిష్ఠంగా మూడేళ్ల శిక్షలు ఉంటుంది.
ఈ ఏడాది ఇప్పటి వరకూ ఈ కేసుల్లో 18 మంది నిందితులకు జైలుశిక్ష పడింది.

కసిదీరా.. కాల్చేస్తున్నారు..
ఐపీసీ 302, 195ఎ‘రక్షణ చట్టం.. రక్షణ ఛత్రం

ఏటా నమోదయ్యే కేసులు శాతాల్లో.. 4విపరీత మనస్తత్వం ఉన్నవారు యువతులు, మహిళలను అపహరించకుని వచ్చి లైంగిక కోర్కెలు తీర్చుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే జైలుకు వెళ్లాలని బాధితులను కాల్చేస్తున్నారు. అసోంలో పనిచేస్తున్న ఓ ఇంజినీర్‌ స్నేహితుడు ఇంజినీర్‌ భార్యను ఇలా చేసే నిప్పటించి చంపేశాడు.హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో క్రమంగా పెరుగుతున్నాయి.

ఎక్కడెక్కడ
హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లోని జనం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు నమోదవుతున్నాయి. శంషాబాద్‌,రాజేంద్రనగర్‌, నార్సింగి, మాదాపూర్‌, మియాపూర్‌, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఇలాంటి ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి.

బాధితులెవరు..
నగరంలో ఉంటున్న కొందరు యువకులు, శివార్లలో మద్యం, కల్లు దుకాణాల వద్ద తిరిగే మందుబాబులు ఈ నేరాలకు  పాల్పడుతున్నారు. ఎవరినైనా బాధితులుగా మార్చేస్తున్నారు.

శిక్షలిలా…
పశువాంఛలు తీర్చుకునేందుకు మహిళలు, యువతులను కసిదీరా కాల్చేస్తున్న మదాంధులపై పోలీసులు ఐపీసీ 302, 195-ఎ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు.
సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానాలు నేరగాళ్లకు యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తున్నాయి.

డేటింగ్‌ సైట్లలో మీ ఫోన్‌ నంబరా!
ఐటీ చట్టం 66సి
ఐపీసీ సెక్షన్లూ ఉన్నాయ్‌  ‘రక్షణ చట్టం.. రక్షణ ఛత్రం

డేటింగ్‌ సైట్లో వివరాలు ఉంచారని గతేడాది వచ్చిన ఫిర్యాదులు 50హైదరాబాద్‌లో నివసిస్తున్న ఒక సినీనటి ఫొటోను కొద్దిరోజుల క్రితం ఓ డేటింగ్‌ వెబ్‌సైట్‌లో సైబర్‌ నేరస్థులు పోస్ట్‌ చేశారు. ఆమెను గురించి అసభ్యకర సమాచారం తోపాటు ఆమె ఫోన్‌ నంబరును ప్రకటించారు. ఈ విషయం స్నేహితులు చెప్పడంతో తెలుసుకుని షాక్‌కు గురైన ఆమె ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసింది. మరో ఘటనలో నారాయణగూడలో ఉంటున్న ఓ వైద్యుడి భార్యకూ ఇలానే జరిగింది.

ఎక్కడెక్కడ
బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, నారాయణగూడ, మాదాపూర్‌, కూకట్‌పల్లి పోలీసు ఠాణాల పరిధుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లోని ఐటీ కారిడార్లలో ఇప్పుడిప్పుడే ఇలాంటి ఫిర్యాదులు తమకు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.

బాధితులెవరు..
వివిధ రంగాల్లో ఇప్పుడిప్పుడే పాపులారిటీ పొందుతున్న వారు, ఎవరికీ చెప్పుకోలేరు ఏమి డిమాండ్‌ చేసినా ఇస్తారనుకునే వాళ్లను లక్ష్యంగా చేసుకుంటారు.

శిక్షలిలా…
పరువు ప్రతిష్ఠలకు భంగ కలిగేలా ప్రవర్తించిన సైబర్‌ నేరస్థులపై ఐటీ 66సీ చట్టం ప్రకారం కేసులు పెడతారు.
నిందితులకు కోర్టులు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నాయి.
ఈ ఏడాది ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ కోర్టులు ఉత్తర్వులు జారీ చేశాయి.

ఫేస్‌బుక్‌లో పెడచూపులు చూస్తుంటే!
ఐటీ చట్టం 66సి‘రక్షణ చట్టం.. రక్షణ ఛత్రం

ఏటా ఇలాంటి ఫిర్యాదులు మూడు కమిషనరేట్ల పరిధుల్లో 2800యువతులు, విద్యార్థినుల పేరుతో వారి పరిచయస్థులు, స్నేహితులు, అపరిచితులు నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను సృష్టిస్తున్నారు. బాధితురాలి స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల వివరాలను తెలుసుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అసభ్యకర చిత్రాలను పోస్టు చేస్తున్నారు. బాధితురాలి స్నేహితులు చెప్పేంత వరకూ ఈ విషయం ఆమెకు తెలియదు.

ఎక్కడెక్కడ
నగరం, శివార్లలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలు, నార్సింగి, మాదాపూర్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌, కొంపల్లి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్‌, కీసర, ఉప్పల్‌, అల్వాల్‌ ప్రాంతాల్లోని కొన్ని కళాశాలల్లో ఈ చర్యలు నమోదయ్యాయి.

బాధితులెవరు..
నారాయణగూడ, కోఠి కాచిగూడ, బర్కత్‌పురలోని విద్యార్థులు బాధితులుగా, నిందితులుగా ఉన్నారు.  కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ ఇలాగే వేధిస్తున్నారు.

శిక్షలిలా…
నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు సృష్టించిన సైబర్‌ నేరస్థులపై ఐటీ చట్టం 66సీ ప్రకారం కేసులు పెడతారు.
ఈ నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది.
గ్రేటర్‌లో గతేడాది 135 మందికి జైలు శిక్షలు పడ్డాయి. వీరిలో 76 మంది  చదువు మధ్యలో వదిలేసినవారు.

పసిమొగ్గలపై పైశాచికమా..
పోక్సో చట్టం 2012‘రక్షణ చట్టం.. రక్షణ ఛత్రం

మూడు పోలీసు కమిషనరేట్ల పరిధుల్లో ఏటా నమోదయ్యే కేసులు 209అమాయకమైన మోము… కల్తీలేని చిరునవ్వులతో సంతోషంగా ఉండే చిన్నారులను చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. కొందరు కామాంధులకు మాత్రం వారితో పైశాచిక కోర్కెలు తీర్చుకోవాలన్న మృగతృష్ణ కలుగుతుంది. వారు ఆటవస్తువులు కొనిస్తామనే నెపంతో పిల్లలను నిర్జన ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

ఎక్కడెక్కడ
పాతబస్తీలోచి చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్‌, గోల్కొండ, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, మల్కాజిగిరి, అల్వాల్‌, తిరుమలగిరి, గోపాలపురం, కార్ఖానా, చిలకలగూడ, సైదాబాద్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌ఠాణాల పరిధుల్లో ఇవి ఎక్కువ.

బాధితులెవరు..
అభంశుభం తెలియని చిన్నారులే బాధితులు. పాఠశాలకు వచ్చిపోయేవారు, తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఇంటి వద్ద ఉన్నవారే వీరి లక్ష్యం. ఒంటరి పురుషులే నిందితులు.

శిక్షలిలా…
చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై  పోక్సో-2012 చట్టం ప్రకారం కేసులుంటాయి.
నిందితులకు తప్పని సరి ఉరి శిక్ష చేస్తూ కేంద్రం చట్టం సవరించారు.
ఇటీవలే బాలమిత్ర కోర్టు ఓ నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

అర్ధరాత్రి ఫోన్లు ఆకతాయి చేష్టలు
ఐటీ చట్టం 66సి
ఐపీసీ 354(డి)‘రక్షణ చట్టం.. రక్షణ ఛత్రం

గతేడాది మూడు పోలీసు కమిషనరేట్ల పరిధుల్లో ఫిర్యాదులు 358రాత్రిళ్లు పదేపదే ఫోన్లు చేసి చికాకుపెడుతున్నారా! ఎవరో తెలుసుకునే లోపే కట్‌ చేస్తున్నారా! ఆఖరికి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారా..అలాంటి వారిని ఐటీ చట్టం కటకటాల వెనక్కి పంపుతోంది. ఫోన్లు చేసేవారెవరో తెలీదు… భర్త లేదా తల్లిదండ్రులకు చెబుదామంటే భయం.. ఇలా ఇబ్బందిపడే మహిళలకు భరోసా ఇస్తున్నారు సైబర్‌ పోలీసులు.

ఎక్కడెక్కడ
పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, అల్వాల్‌, మల్కాజిగిరి, కాప్రా, మాదాపూర్‌ ప్రాంతాల్లో బాధితులు ఎక్కువ ఉన్నారు. ఈ ఘటనలు ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయి.

బాధితులెవరు..
బ్యూటీ క్లినిక్‌ నిర్వాహకులు, మహిళా దంతవైద్యులు, కోచింగ్‌ కేంద్రాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయినులు.ఈ ఏడాది 236 ఫిర్యాదులు వచ్చాయి.

శిక్షలిలా…
అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా  మహిళలను వేధిస్తున్న నిందితులపై ఐటీ చట్టం 66సీ ప్రకారం కేసులు ఉంటాయి.
మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.
ఐపీసీ 354(డీ) సెక్షన్‌ కింద మరో నాలుగేళ్ల శిక్ష కూడా ఉంటుంది.

(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates