మళ్లీ అబద్ధాలే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఒక శాతానికి మించని మహిళా బడ్జెట్‌

ఆర్థిక మంత్రిగా కేంద్ర బడ్జెట్‌ను రెండోసారి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. మహిళలు ఏ స్థానంలో ఉన్నా.. చిత్తశుద్ధి లేకపోతే, కీలుబొమ్మలుగా మాత్రమే ఉంటే మహిళలకు ఏమీ ఒరగదు అని మరోసారి చెప్పడానికి ఈ బడ్జెట్‌ ఉదాహరణ. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో పెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ… తాము తీసుకొచ్చిన బేటీ బచావ్‌, బేటీ పడావ్‌ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. ఇక పౌష్టికాహారం, ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కోసం భారీ నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 14శాతమే పెంపు…
మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకోసం రూ.28,600 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. అలాగే పోషకాహారం కోసం రూ. 35,600 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. గత ఏడాదితో పోల్చి చూస్తే మహిళల అభివృద్ధి, శిశుసంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్‌ 14శాతం పెంపులా కనిపిస్తున్నా.. ఈ బడ్జెట్‌లో మహిళలకు ఒరిగిందేమీ లేదనేది తేటతెల్లం. ‘బేటీ బచావో-బేటీ పడావో’ గురించి గొప్పలు చెప్పిన మంత్రి ఆ పథకం నిధుల్లో 60 కోట్లను తగ్గించారు. ఇక ప్రధానమంత్రి మాతృవందన యోజనకు కేటాయించింది రూ.2,500 కోట్లు. ఈ ఏడాది అందులో ఎలాంటి పెంపూ లేదు. అంగన్‌వాడీ సేవల కోసం పెంపుదల కేవలం రూ.698కోట్లు మాత్రమే. సెంటర్ల ప్రస్తావన, అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల వేతనాలు, పెన్షన్ల ప్రస్తావన అస్సలే లేదు. ఇంకా దేశంలోని చాలా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపం అధికంగా ఉంది. పోషకాహార కేటాయింపుల్లో పెంపు కేవలం 300 కోట్లు. మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌ పెంచలేదు. గత ఏడాది పోషకాహార లోపం వల్ల ఐదేండ్లలోపు పిల్లలు 8.8 లక్షల మంది చనిపోయారు. మోడీ సర్కారులో గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో మన దేశం పాకిస్తాన్‌, ఇథియోపియా కంటే కూడా వెనుకబడిపోయింది. దేశంలో యువతరం రక్తహీనతతో బాధపడుతున్నది. దేశం ఎదుర్కొంటున్న అలాంటి అతిపెద్ద సమస్యను బడ్జెట్‌లోచూపకపోవడం శోచనీయం.

వాగాడంబరమే…
మహిళలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే రోజులు నెమ్మదిగా పోతున్నాయి. మహిళలు బయటికి వస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. పోరాటాలు చేస్తున్నారు. చదువు మాత్రమే కాదు… ఉద్యోగాలు కూడా కోరుకుంటున్నారు. ఈ భావోద్వేగాన్ని పరిష్కరించడానికి కేవలం వాగాడంబరమే తప్ప బడ్జెట్‌లో మహిళలకు మిగిల్చిందేమీ లేదు. అందుకు నిదర్శనం మొత్తం బడ్జెట్‌లో మహిళలకు కేటాయింపులు కేవలం.. 0.98శాతమే ఉండటం. మహిళలు, ఆడపిల్లల పట్ల హింస విపరీతంగా పెరిగింది. కానీ వారి భద్రత కోసం కేటాయించినవి నామమాత్రపు నిధులు. బీజేపీ వెనుక ఉండి నడిపిస్తున్న.. ఆరెస్సెస్‌ మహిళా విభాగ అగ్రనేత్రి చెప్పిన మాట ‘మహిళలు తల్లిలాగా త్యాగాన్ని అలవాటు చేసుకోవాలి’ అని. అలాంటి భావజాలంతో నడుస్తున్న ప్రభుత్వం… బడ్జెట్‌లో మహిళలకు అంతకుమించేదో చేస్తుందనుకోవడం అత్యాశే. మాటలతో సెంటిమెంట్‌ను పండించారే తప్ప… లెక్కల్లో కేటాయింపులు లేనేలేవు.

మహిళా వ్యతిరేక బడ్జెట్‌
ఉపాధి హామీ పథకానికి నిధులు తక్కువగా కేటాయించడం వల్ల గ్రామీణ మహిళలు ఉపాధి కోల్పోయేపరిస్థితి నెలకొంది. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు, శిశు సంక్షేమానికి కేవలం ఒక శాతం నిధులు కేటాయించడమంటేనే అర్థం చేసుకోవచ్చు… ఇది మహిళల వ్యతిరేక బడ్జెట్‌. కార్పోరొట్లేకు అనుకూల బడ్జెట్‌.
మల్లు లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం

అన్నీ అబద్ధాలే…
ఈ బడ్జెట్‌ కేటాయింపులన్నీ అబద్ధాలే. పోషకాహరానికి సరిపోను కేటాయింపుల్లేవు. అంగనీవాడీ వర్కర్లకు కనీస వేతనం, పెన్షన్‌ ప్రస్తావనే లేదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నది.
పి. జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్‌, టీచర్స్‌, అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌

నిర్లక్ష్యానికి నిదర్శనం…
బడ్జెట్‌ కేటాయింపులకు అమలుకు సంబంధం లేకుండాపోయింది. స్త్రీలు, పిల్లలపై హింస పెరిగింది. ప్రత్యేకించి దళిత, ఆదివాసీ మహిళలపై మరింత పెరిగింది. డ్రాపవుట్స్‌ పెరుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ బడ్జెట్‌ అంటారు. కానీ అందులో మహిళలకంటూ ఏమీ ఉండదు. దళిత, ఆదివాసీ స్త్రీలకంటూ ఏమీ కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
సుజాత సూరేపల్లి, ప్రొఫెసర్‌, శాతవాహన యూనివర్సిటీ

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates