ఈ బడ్జెట్‌లోనైనా రైతుకు చోటుందా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 దేవీందర్‌ శర్మ

విశ్లేషణ

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న కేంద్రబడ్జెట్‌ను సమర్పిస్తున్న నేపథ్యంలో ఆర్థిక మందగమనానికి ఎలాంటి విరుగుడు ప్రకటించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దేశ జనాభాలో 50 శాతంపైగా నేటికీ ఆధారపడిన వ్యవసాయ రంగంలో గ్రామీణుల కొనుగోలు శక్తి క్షీణించిపోతుండటమే ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి ప్రధాన కారణమని అన్ని నివేదికలూ పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల చేతిలో మరింత నగదును ఉంచడంపై ఆర్థికమంత్రి దృష్టి సారించాల్సి ఉంది. పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద ప్రత్యక్ష నగదు మద్దతును పెంచడం ఆర్థిక మంత్రి ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. పీఎం–కిసాన్‌ పథకం కింద రైతు కుటుంబానికి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇస్తున్న మొత్తాన్ని రూ. 18,000లకు పెంచగలిగితే గ్రామీణ ఆర్థికంలో విస్తృతమైన డిమాండుకు వీలుంటుంది.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటిస్తారని భావిస్తున్న ఆర్థిక చర్యల జాబితాలో ప్రధానంగా మూడు అంశాలు చోటుచేసుకోవలసి ఉంది. ప్రత్యేకించి ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని గట్టెక్కించడం ఎలా అనే సవాలు ఎదురవుతున్న సమయంలో సరైన దిశలో చేపట్టే దిద్దుబాటు చర్యలు స్తంభించి పోయిన వృద్ధి రథచక్రాలను మళ్లీ రాజబాట పట్టిస్తాయి. అయిదు రూపాయల బిస్కెట్‌ ప్యాక్‌ను కొనుగోలు చేయాలంటే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారని కొన్ని నెలల క్రితం మీడియాలో విస్తృత చర్చ జరిగింది. గ్రామీణ పేదలు ఆహారం కోసం రోజుకు రూ. 19లు మాత్రమే ఖర్చుపెడుతున్నారని వారి కొనుగోలు శక్తి క్షీణించిపోతోందని నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీసు (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిర్వహించిన వినియోగదారు వ్యయ సర్వే నివేదిక కూడా పేర్కొంది. కానీ ఈ నివేదికను కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసిందనుకోండి. తాజాగా, నీతి ఆయోగ్‌ సైతం కొన్నివారాల క్రితం విడుదల చేసిన సోషల్‌ డెవలప్‌మెంట్‌ (ఎస్‌డీజీ) ఇండెక్స్‌ 2019 నివేదికలో కూడా దేశంలోని 22 నుంచి 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దారిద్య్రం, ఆకలి, అసమానత్వం వంటివి పెరిగిపోయాయని తేల్చిచెప్పింది.

ఈ మూడు నివేదికలను చూసినట్లయితే, పేదల చేతుల్లో నగదు అందుబాటులో ఉంచడమనేది మాత్రమే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళుతుందని అర్థమవుతుంది. దీన్నే ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలు డిమాండ్‌ సృష్టించడం అని చెబుతున్నారు. అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించకుండానే పేదలు 5 రూపాయల బిస్కెట్‌ ప్యాకెట్‌ను కొనుక్కోగలరంటే అసలు సమస్య డిమాండ్‌ సృష్టించడం లోనే ఉందని చాలామంది ఆర్థికవేత్తలు అంగీకరిస్తున్నారు. గ్రామీణ వ్యవసాయ, వ్యవసాయేతర వేతనాలను వృద్ధిబాటలో పయనింపచేయాలంటే వ్యవసాయాన్ని భారీస్థాయిలో పునరుద్ధరించడం జరగాలి. వ్యవసాయరంగంలో ఆదాయాలు గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయాయి. దానికి తోడు గత అయిదేళ్లుగా వ్యవసాయ వేతనాలు కూడా పతనబాట పట్టడంతో గ్రామీణ వ్యయం తగ్గుముఖం పడుతోంది. గ్రామీణ డిమాండ్‌ను ఇదే క్షీణింపచేస్తోంది.

మరోమాటలో చెప్పాలంటే, జనాభాలో దాదాపు 50 శాతం ఇప్పటికీ వ్యవసాయరంగంలోనే ఉంటున్నారు. కునారిల్లిపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసే శక్తి వ్యవసాయ రంగానికి ఉన్నందున, రైతుల చేతిలో మరింత నగదును ఉంచడంపై ఆర్థికమంత్రి దృష్టి సారించాల్సి ఉంది. ఏరకంగా చూసినా గత ఏడెనిమిదేళ్లుగా రైతుల నిజఆదాయ పెరుగుదల దాదాపు జీరోకి చేరుకుందన్న విషయాన్ని మనం మర్చిపోరాదు. అందుకే మనం కార్పొరేట్, మధ్యతరగతి వర్గాలకు పన్నురాయితీని కొంతకాలం నిలుపుదలే చేసినా ఫర్వాలేదు కానీ పేదలకు అందాల్సిన రాయితీలను అసలు నిలుపకూడదు. పైగా, జాతీయ పనికి ఆహార పథకం కింద బడ్జెట్‌ కేటాయింపులను పెంచాలంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పకుండా నాలుగు అంశాలపై దృష్టి సారించాలి. అవి ఏవంటే: ప్రధానమంత్రి–కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద ప్రత్యక్ష నగదు మద్దతును పెంచడం ఆర్థిక మంత్రి ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ. 75,000 కోట్లకు అదనంగా ఈ పథకానికి మరో రూ. 1.50 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉంది. దీంతో ప్రతి రైతుకూ గ్యారంటీ ఆదాయం కింద సంవత్సరానికి రూ. 18,000లను పీఎమ్‌–కిసాన్‌ పథకం కింద అందించవచ్చు.

అంటే దేశంలోని ప్రతి రైతు కుటుంబానికీ రూ. 1,500లు అందుతుంది. పట్టణ మధ్యతరగతి ప్రజల దృష్టిలో ఇది చాలా చిన్న మొత్తమే కావచ్చు కానీ దేశజనాభాలో సగంగా ఉన్న గ్రామీణ రైతులకు వార్షిక వ్యవసాయ ఆదాయం రూ. 20,000 మాత్రమే లభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రత్యక్ష నగదు పథకం కింద రైతులకు అందే మొత్తం వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది. ఈ పథకాన్ని ఇప్పటికే భూమి ఉన్న రైతులందరికీ వర్తింపచేశారు. దీన్ని భూమిలేని కౌలు రైతులకు కూడా వర్తింపచేయాల్సిన అవసరముంది. అందుకే ఆర్థికమంత్రికి నా మొట్టమొదటి సిఫార్సు ఏమిటంటే వ్యవసాయం కోసం ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రవేశపెట్టాలనే. ఇదే గ్రామీణ వ్యయాన్ని దీర్ఘకాలంలో పెంచగలుగుతుంది. నా రెండో సూచన ఏమిటంటే ధరల మద్దతు నిధి లేక వ్యవసాయ జీవిత నిధి పేరిట ఒక ఫండ్‌ ఏర్పర్చాలి. దీనికింద వ్యవసాయ సరుకులపై ఆధారపడిన అన్ని విలువ ఆధారిత ఉత్పత్తులపై పన్ను విధించాలి. ఉదాహరణకు పంజాబ్‌ రైతులు 120 లక్షల టన్నుల వరి పండించారు. కిలోకు ఒక రూపాయి మేరకు పన్ను విధిస్తే ఒక్క పంజాబ్‌ రాష్ట్రానికే వరి పంటపై రూ. 1,200 కోట్ల ధరల మద్దతు నిధిని ఏర్పాటు చేయవచ్చు.

మరొక ఉదాహరణగా కేరళను తీసుకుందాం. ఈ రాష్ట్రం ఏటా 40 లక్షల టన్నుల వరిని ఉత్పత్తి చేస్తోంది. అంటే ఈ పంటపై పన్ను విధిస్తే 400 కోట్ల రూపాయల నిధి ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతి కేజీ గోధుమపై రూపాయి పన్ను విధిస్తే భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. ఇక చక్కెర, పప్పులు, పాలు, పాల ఉత్పత్తులు, మసాలా దినుసులు, వంట నూనెలు, పత్తి దుస్తులు వంటి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై కూడా పన్ను విధిస్తే ప్రతి సంవత్సరం భారీ నిధి ఏర్పడుతుంది. ప్రధాన వ్యవసాయ సరుకులపైనే కాకుండా, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల ఉత్పత్తులపై కూడా పన్ను విధించాలి. ఈ ఉత్పత్తుల లాభాల మార్జిన్‌పై ఆధారపడి పన్ను విలువను మదింపు చేయవచ్చు.

ఇన్నేళ్లుగా దేశ రైతులు వినియోగదారులకు సబ్సిడీలను అందిస్తూ వచ్చారు. ఓఈసీడీ–ఐసీఆర్‌ఐఈఆర్‌ అధ్యయనం ప్రకారం 2000 నుంచి 2016 మధ్యలో రైతులు తమకు రావలసిన న్యాయమైన ఆదాయాన్ని పొందకపోగా రూ. 45 లక్షల కోట్ల నష్టాన్ని భరిస్తూ వచ్చారు. రైతులు ఇలా నష్టపోయిన మొత్తం నుంచే వినియోగదారులు 25 శాతం తక్కువ ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను పొందగలిగారు. అందుకే రైతులకు ఇప్పుడు వినియోగదారులు తిరిగి చెల్లించవలసిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. దీనికి సరైన మార్గం ధర మద్ధతు నిధికి వినియోగదారులు ఇప్పుడు పన్ను రూపేణా చెల్లించాల్సి ఉండటమే.

గత సంవత్సర బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి జీరో బడ్జెట్‌ సహజ వ్యవసాయం గురించి మాట్లాడారు కానీ ఆర్థిక కేటాయింపులు చేయకుండా మౌనం పాటించారు. తర్వాత ప్రధాని నరేంద్రమోదీ కూడా స్వాతంత్య్ర దినోత్సవంనాడు రైతులు రసాయన ఎరువులకు దూరం జరగాలని పిలుపునిచ్చారు. పావుశాతం గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలకు రసాయన ఎరువులతో సాగుతున్న వ్యవసాయమే కారణమని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని సూచన చాలా విలువైనది. ప్రపంచమంతటా రసాయన ఎరువులతో వ్యవసాయం వల్ల తీవ్రమైన పర్యావరణ విధ్వంసం చోటు చేసుకుందని, భూగర్బ జలాలు అడుగంటిపోయాయని, మొత్తం ఫుడ్‌ చెయిన్‌నే ఇది కలుషితం చేసేసిం దని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. జీరో బడ్జెట్‌ అనే పదం వాడుకలో ఉంటున్నప్పటికీ, సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం, విస్తరణకు బడ్జెట్‌ కేటాయింపులు ఏవీ అవసరం లేదని చెప్పలేము.

ఇక నా మూడో సూచన ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహజ వ్యవసాయంపై చేస్తున్న ప్రయోగం కోసం దశలవారీగా రూ. 25,000 కోట్లను కనీసంగా అయినా ఆర్థికమంత్రి అందించాలి. దీంతోపాటు ఆర్గానిక్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంది.  చివరగా , తగిన స్థాయిలో మార్కెటింగ్‌ వ్యవస్థాపన లేమి అనేది రైతులకు తమ పంటలపై న్యాయమైన ధరలను పొందకుండా అడ్డుపడుతోంది. దేశమంతటా 42,000 వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీల నియంత్రణలో పనిచేసే మండీలు అవసరం కాగా, ప్రస్తుతం 7 వేల మండీలు మాత్రమే ఉంటున్నాయి. కేంద్రప్రభుత్వం రెండేళ్లకు ముందు ఒక ప్రకటన చేస్తూ 22 వేల గ్రామీణ గిడ్డంగులను అభివృద్ధి చేస్తానని ప్రకటించింది కానీ ఇంతవరకు ఎలాంటి పురోగతీ లేదు. వీటిని వేగంగా ఏర్పరుస్తూ ఇప్పటికే ఉన్న మండీలు, గ్రామీణ లింక్‌ రోడ్ల నెట్‌ వర్క్‌ను విస్తృతం చేసి మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు

(Courtesy Sakshi)

RELATED ARTICLES

Latest Updates