మాంద్యంలో కొత్త సచివాలయమా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఉన్న భవనాలకే మరమ్మతులు చేస్తే సరి
– తుది ప్లాన్‌ సమర్పించండి : సర్కారుకు హైకోర్టు ఆదేశం
 హైదరాబాద్‌

రాష్ట్రమే కాదు దేశమే ఆర్థిక మాంద్యంలో ఉందని, ఇలాంటప్పుడు కొత్తగా సచివాలయం కట్టాలా అని హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించింది. డబ్టులు లేనప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారో కూడా చెప్పాలని కోరింది. ఇప్పుడున్న 25 ఎకరాల జాగాలో ఎన్ని భవనాలు కడతారు, ఏ శాఖకు ఎంత జాగా కేటాయిస్తారు.. కొత్త కట్టడానికి తుది ప్లాన్‌ ఎక్కడ ఉంది.. వంటి వివరాలు సమర్పించాలని సర్కార్‌ను ఆదేశించింది. ఆర్థిక మాంద్యం గురించి మీడియాల్లో కూడా వార్తలు వస్తున్నాయని, ఈ తరుణంలో కొత్తగా కట్టడానికి బదులుగా ఉన్న భవనాలకే మరమ్మతులు చేస్తే సరిపోయేదని బెంచ్‌ అభిప్రాయ పడింది. సచివాలయ భవనాలు కూల్చొద్దంటూ కాంగ్రెస్‌ నాయకులు ఎ రేవంత్‌రెడ్డి, టి జీవన్‌రెడ్డి, టీజేఎస్‌ నేత పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు ఇతరులు దాఖలు చేసిన పిల్‌తోపాటు 2016లో దాఖలైన మరో రెండు పిల్స్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ అభిషేక్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ఆర్‌ఆండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

సమీక్ష చేసే అధికారం హైకోర్టుకుంది
కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి క్యాబినెట్‌ చేసిన తీర్మానాన్ని హైకోర్టు పరిశీలించింది. ప్రస్తుత స్థలంలోనే ఉన్న భవనాలకు మార్పులు చేసి వాడుకోవాలని తీర్మానంలో ఉందని, అదే తీర్మానంలో మరో చోట కొత్తగా సచివాలయం కట్టాలని కూడా ఉందని, కొత్త నిర్మాణాన్ని చేపడతారా? మార్పులు చేస్తారా? దీనిపై తుదినిర్ణయం తీసుకున్నారా?’ అని డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. క్యాబినెట్‌ నిర్ణయంలో హైకోర్టు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం తరఫు అడిషినల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు చెప్పడాన్ని బెంచ్‌ తప్పుపట్టింది. హైకోర్టు సమీక్షించకుండా ఉంటుందని అనుకోవద్దు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా గుర్తుంది. ప్రజాధనంతో చేసే పనులు ప్రజాహితంగా ఉండాలి. లేకపోతే న్యాయ సమీక్ష చేస్తాం. ప్రజలకు చెందిన అంశాల పేరుతో క్యాబినెట్‌ ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు జోక్యం చేసుకోరాదనడం కుదరదని చెప్పింది. కోట్లాది రూపాయల ప్రజా ధనం వెచ్చించేటప్పుడు, అదీ సచివాలయ భవనాలు ఉండగా వాటిని కూల్చి కొత్తగా కట్టాలనే నిర్ణయం కాబట్టి న్యాయ సమీక్ష చేసే అధికారం హైకోర్టుకు ఉంది.. అని బెంచ్‌ చెప్పింది.

సీఎం నిర్ణయం తీసుకోలేదు
కొత్తగా కట్టాలంటే కనీసం ఐదేండ్లు కాలం పడుతుందని, రాజస్థాన్‌లో అయితే హైకోర్టును ఏకంగా 12 ఏండ్లు కట్టారని, తీరుబడిగా ఇక్కడ కూడా చేస్తే సచివాలయంలోని కీలక ఫైళ్ల మాటేమిటనే సందేహాన్ని వ్యక్తం చేసింది. ఒక ప్రాంగణంలో ఉండాల్సిన ఫైళ్లు వేరువేరు చోట్ల ఉంటే అవి బయటకు వెళ్లవనే గ్యారెంటీ ఏదని ప్రశ్నించింది. క్యాబినెట్‌ నిర్ణయం తర్వాత క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పడిందని, టెక్నికల్‌ కమిటీ రిపోర్టు ఇచ్చిందని, కొత్తగా సచివాలయ భవనాలు కట్టాలని సర్కార్‌ నిర్ణయం తీసుకుందని అడిషినల్‌ ఏజీ చెప్పారు. టెక్నికల్‌ కమిటీ నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఆ నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించిందని.. దీనిపై సీఎం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గతంలో ఈ విషయంలో హైకోర్టు స్టే ఇచ్చినందున ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై డివిజన్‌ బెంచ్‌ తీవ్రంగానే స్పందించింది. ఉన్న సచివాలయ భవనాలు కూల్చరాదని మాత్రమే స్టే ఇస్తే మీరేమో స్టే కారణంగా ఏ నిర్ణయం తీసుకోలేదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ప్రభుత్వం కొత్తగా సచివాలయ భవనాలు కట్టాలనే నిర్ణయానికి వచ్చిందని, క్యాబినెట్‌ తీర్మానం తర్వాత క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు అయిందని, ఈ సబ్‌ కమిటీ టెక్నికల్‌ కమిటీని వేసిందని అదనపు ఏజీ మరోసారి చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే తగిన మార్పులతో నిర్మించాలని మంత్రివర్గ తీర్మానంలో ఉన్నందున కొత్త నిర్మాణాన్ని చేపడతారా? మార్పులు చేస్తారా? దీనిపై తుదినిర్ణయం తీసుకున్నారా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తిరిగి బెంచ్‌ కల్పించుకుని.. ఒకవేళ కొత్తగా సచివాలయ భవనాలు కట్టాలని ప్రభుత్వం భావిస్తే దానికి సంబంధించిన పలు వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ముఖ్యంగా వివిధ విభాగాలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో, కొత్తగా వాటిని ఎంత విస్తీర్ణంలో నిర్మించాలనుకుంటున్నారో, దీనికి ఎంత స్థలం అవసరముంటుందో, కొత్త భవనాలు నిర్మించేవరకు ప్రస్తుతం సచివాలయం ఎక్కడ కొనసాగిస్తారో, అప్పటి వరకూ ఆయా శాఖల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో, నిర్మాణాలకు ఎంత ఖర్చు అవుతుందో, నిధుల్ని ఎలా సమకూర్చుకుంటారో.. మొదలైన వివరాలతో అఫిడవిట్‌ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates