భారతీయుడెవరు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for who is an indian citizen"పౌరసత్వ నిరూపణకు ధ్రువీకరణ పత్రాలపై సస్పెన్స్‌
– రుజువుకు పాస్‌పోర్టు ఆధారం కాదు : విదేశాంగ వర్గాల సమాచారం

వచ్చే ఏడాది చేపట్టనున్న జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) కోసం కేంద్రం కసరత్తులు ప్రారంభించింది. మరోవైపు దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) రూపకల్పనలో భాగంగా ఇదే మొదటి మెట్టు అనీ, దాని ముసుగులోనే ఎన్పీఆర్‌ను చేపట్టనున్నారని దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ప్రధాని, కేంద్ర హౌంమంత్రి చేసిన ప్రకటనలు ప్రజల్లో మరింత గందరగోళాన్ని పెంచుతున్నాయి.

న్యూఢిల్లీ : ఎన్పీఆరే.. ఎన్నార్సీకి మూలం అయితే భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత ధ్రువీకరణ పత్రం పాస్‌పోర్టుతో పాటు ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ గుర్తింపు కార్డు సైతం వారి పౌరసత్వాన్ని నిరూపించలేవని స్వయంగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాల ద్వారా తెలుస్తున్నది. జనగణన అధికారి ప్రజల వద్దకు వచ్చినప్పుడు ఆధార్‌, ఓటరు ఐడీ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపిస్తే చాలని కేంద్రం చెబుతున్నా.. ఆ జాబితాలో మరికొన్ని అంశాలు దాగి ఉన్నాయనీ, వాటిని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అసోంలో చేపట్టిన ఎన్నార్సీలో భాగంగా అక్కడి ప్రజలు ప్రభుత్వం అడిగిన పత్రాలన్నింటినీ సమర్పించినా.. దాదాపు మూడు తరాల వివరాలు ఇచ్చినా.. సుమారు 19 లక్షల మందిని పౌర జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో ఆందోళన చెందుతున్న ప్రజానీకం ఎన్పీఆర్‌తోమరింత భయాందోళనలకు గురవుతున్నది.

ఇందుకు సంబంధించి ‘పౌరసత్వ రుజువుకు పాస్‌పోర్టు ఆధారం కాదు. పౌరసత్వ పత్రం ద్వారా మీరు పాస్‌పోర్టు పొందవచ్చు. కానీ అది దానికి ప్రతిరూపంగా ఉండదు’ అని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి తెలిపారు. ఎన్నార్సీ ప్రక్రియకు పాస్‌పోర్టూ సరిపోదనీ, అయితే ఒక వ్యక్తి తాను భారతీయుడేనని నిరూపించుకునేందుకు ఏ పత్రాలు అందించాలంటే మాత్రం కేంద్రం దగ్గరా సమాధానం లేదని ఆయన చెప్పారు. ఇదే విషయమై హౌంశాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి స్పందిస్తూ.. ‘ఎన్నార్సీపై ఇంకా ఎటువంటి ముసాయిదానూ తయారుచేయలేదు. అయితే ఎన్నార్సీ అమలైతే మాత్రం ఓటర్‌ ఐడీ, ఆధార్‌, పాస్‌పోర్టులు పౌరసత్వ నిరూపణను చేయలేవు’ అని వెల్లడించడటం గమనార్హం. దీనిపై హౌంశాఖ గానీ, ప్రభుత్వం గానీ ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.

దేశంలో ప్రస్తుతం 6.60 కోట్ల మందికి పాస్‌పోర్టులున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానాల ప్రకారం.. ఒక దేశం తమ పౌరుల అంతర్జాతీయ ప్రయాణాల కోసం అందించే ప్రాథమిక ధ్రువీకరణ పత్రం పాస్‌పోర్టు. భారత్‌లో పౌరులకు ఇచ్చే పాస్‌పోర్టు మొదటిపేజీలో రాష్ట్రపతి ఆమోదంతో కూడిన ధ్రువీకరణ ఉంటుంది. మూడో పేజీలో ఆ వ్యక్తి పేరు, వివరాలు, జాతీయత గూర్చి వివరాలుంటాయి. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలు అందజేస్తున్నాయి.

ఒక వ్యక్తి ఏదైనా మోసానికి, నేరాలకు పాల్పడి దేశం దాటి పారిపోతున్నప్పుడు పాస్‌పోర్టు ద్వారా అతడిని పట్టుకునే అవకాశం ఉంది. పోలీసుల విచారణలోనూ ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. ‘మనదేశంలో పాస్‌పోర్టును మించిన పౌరసత్వ నిరూపణకు ఇంకోటి ఉండదు’ అని న్యాయ నిపుణలు సూచిస్తున్నారు. అయితే కేంద్రం ప్రతిపాదిస్తున్న దాని ప్రకారం.. ఎన్నార్సీలో పౌరులు అనుమానాస్పదులుగా తేలితే మాత్రం వారి భారతీయతను నిరూపించుకోవడానికి ఆధార్‌, పాస్‌పోర్టులూ సరిపోవని అధికారిక వర్గాలు చెబుతుండటం ప్రజల్లో భయాన్ని పెంచుతున్నది.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates