నూలు సబ్సిడీ ఏమాయె…?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– సిరిసిల్ల నేత కార్మికులకు అందని రూ.9 కోట్లు
– ‘బతుకమ్మ’ కూలి పెంచుమంటే రాయితీ నిధుల ఎర
– తీరా లెక్కల్లేవంటూ అధికారుల దాటవేత
– ఈ ఏడాది చీరెల డిజైన్ల పెంపుతో పని భారం
– ఉత్పత్తి తగ్గిపోయి గిట్టుబాటుకాని వైనం

బతుకమ్మ చీరెల ఆర్డర్‌లో డిజైన్ల పెంపు కార్మికులపై తీవ్ర పని భారం మోపింది. ఫలితంగా ఈ ఏడాది ఉత్పత్తి తగ్గిపోయి, రోజువారీ కూలి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెణ్నెళ్ల క్రితం కూలి రేట్లు పెంచాలని కార్మికులు సమ్మెకు దిగడంతో ఎట్టకేలకు స్పందించిన సర్కారు…ఇప్పుడు కూలి పెంపు వీలుకాదనీ, గతేడాది ఇచ్చిన యారన్‌(నూలు)పై సబ్సిడీ మొత్తం రూ.9కోట్లు నేరుగా కార్మికుల ఖాతాలో వేస్తామనీ హామీనిచ్చింది. ప్రస్తుతం రెణ్నెల్లు దాటిపోతున్నా కార్మికుని ఖాతాలో రూపాయి జమకాలేదు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమలో 20 వేల మర మగ్గాలు ఉండగా సుమారు 10 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. చేనేత, పవర్‌లూం కార్మికులకు ఉపాధి కల్పన లో భాగంగానే రాష్ట్ర సర్కారు మహిళలకు అందిస్తున్న బతు కమ్మ చీరెల ఉత్పత్తిని సిరిసిల్లలో చేయిస్తోంది. మొదటి సారిగా 2017లో జిల్లా వస్త్ర పరిశ్రమకు రూ.200 కోట్ల విలువైన ‘బతుకమ్మ’ చీరెల ఆర్డర్‌ ఇచ్చింది. 2018లోనూ రూ.220 కోట్లతో ఇక్కడి కార్మికులతోనే బతుకమ్మ చీరెల ఉత్పత్తి చేయించింది. గతేడాది 17వేల మరమగ్గాలపై సుమారు 8 వేల మంది కార్మికులు శ్రమించి 97 లక్షల చీరెలను సకాలంలో ఉత్పత్తి చేసి అందించారు. ఈ చీరెల ఉత్పత్తికి అవసరమైన యారన్‌ (నూలు)పై 10శాతం అంటే.. రూ.9కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

డిజైన్ల పెంపు.. గిట్టుబాటుకాని కూలి 
ఈ ఏడాది ఏకంగా రూ.350 కోట్ల విలువైన చీరెల ఆర్డర్‌ను ఇక్కడి పరిశ్రమకు ఇచ్చింది. 121 మ్యాక్స్‌ సొసైటీలు, 105 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లు, టెక్స్‌్‌టైల్‌పార్కులోని 39 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లలో చీరెలను నేస్తున్నారు. ఆర్డర్‌లో భాగంగా 6కోట్లా 70లక్షల మీటర్ల చీరె గుడ్డను ఉత్పత్తి చేసి ఇవ్వాల్సి ఉంది. మీటర్‌ గుడ్డ ఉత్పత్తికి ఒక్కో యజమానికి ప్రభుత్వం రూ.32.50 చెల్లిస్తోంది. మీటర్‌ గుడ్డ ఉత్పత్తికి అవసరమయ్యే ముడిసరుకుకు రూ.16 నుంచి రూ.17 ఖర్చవుతోంది. ఆ ముడి సరుకును ఆసామికి ఇచ్చి తనకొచ్చే డబ్బుల్లోంచి రూ.8.50 చొప్పున మీటర్‌ గుడ్డ ఉత్పత్తికి యజమాని చెల్లిస్తున్నాడు.
ఆసామి తన దగ్గరి కార్మికులతో చీరెలను నేయిస్తూ ఒక్కో మీటర్‌ గుడ్డ ఉత్పత్తికి రూ.4.25 చెల్లిస్తున్నాడు. మొత్తంగా ఒక మీటర్‌ గుడ్డ ఉత్పత్తికి రూ.25.50 ఖర్చుకాగా మిగిలిన రూ.7 యజమానికి మిగులుతున్నాయి. అయితే ఈయేడు ఇచ్చిన ఆర్డర్‌లో 100 రంగుల్లో 10 రకాల డిజైన్లలో చీరెలు నేసివ్వాలని సర్కారు చెప్పింది. ఈ డిజైన్లు ఎక్కువ కావడంతో కార్మికునిపై పనిభారం పడి ఉత్పత్తి తగ్గిపోతోంది. రోజువారీ కూలి సైతం గిట్టుబాటు కావడం లేదు.

రాయితీ ఆశ చూపి…
కూలి గిట్టుబాటు కావడం లేదనీ, కూలి రేటు పెంచాలని డిమాండ్‌ చేస్తూ రెణ్నెళ్ల క్రితం బతుకమ్మ చీరెలు నేసే కార్మికులు సమ్మెబాట పట్టారు. దిగొచ్చిన సర్కారు కార్మికులతో చర్చించింది. కూలి నిర్ణయం మార్చిలోనే చేసి బతుకమ్మ చీరెల ఉత్పత్తికి బడ్జెట్‌ కేటాయించారనీ, ఇప్పుడు కూలి పెంపు వీలుకాదనీ చెప్పుకొచ్చింది. అయితే గతేడాది 2018 ఆర్డర్‌లో యారన్‌పై ఇచ్చిన 10శాతం రాయితీ రూ.9కోట్ల నిధులు నేరుగా కార్మికులకే అందిస్తామని జూన్‌ లో హామీనిచ్చారు.
ఈ లెక్కన ఒక్కో కార్మికునికి సుమారు రూ.11వేల నుంచి రూ.12వేల వరకు డబ్బులు జమ కావాలి. నెలలు గడిచిపోతున్నా హామీ అమలు నోచలేదు. సబంధిత చేనేత, జౌళిశాఖను నిలదీస్తే 2018లో బతుకమ్మ చీరెల తయారీలో పాల్గొన్న కార్మికులు ఎంతమంది? ఒక్కో కార్మికుడు ఎంత గుడ్డ ఉత్పత్తి చేశాడు? అనే వివరాలు లేవనీ, అవి తేలితేనే డబ్బులు వేస్తామనీ అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఆగ్రహిస్తున్న కార్మికులు మరోసారి సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారు.

40 దినాలుగా ఎదురుచూపు.. 
నూలు మీద ఇత్తనన్న సబ్సిడీ పైసల కోసం 40 దినాల సంది ఎదురుచూస్తున్నం. బ్యాంక్‌ ఖాతాలో వేస్తామంటే రూ.వెయ్యి అప్పు జేసి మరీ ఖాతా తెరిచినా. ఇంతవరకు ఆ పైసలు రాలేదు.
– ఎనగంటి రాజమల్లు, కార్మికుడు

కూలి నష్టపోతున్నాం.. 
గిన్ని డిజైన్లు పెంచితే రోజుకు నేసే చీరెను కూడా నేయ లేకపోతున్నం. కూలి గిట్టుబాటు అయితలేదు. సమ్మెజేస్తే నూలుకిచ్చిన సబ్సిడీ మాకు ఇస్తానన్నరు. నెలదాటినా దానిగురించే మాట్లాడుతలేరు.
– గడ్డం ఎల్లయ్య, కార్మికుడు

దాటవేత ధోరణి సరికాదు.. 
కూలి పెంచడం కుదరదని, 10 శాతం యారన్‌ సబ్సిడీని పూర్తిగా కార్మికులకే జులై వరకు అందిస్తామని అన్నారు. ఇంకా ఆలస్యం అవుతోంది. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చాం. నిధులు వచ్చాయని, కార్మికుల లెక్క తేలాలని చెబుతూ ప్రభుత్వం దాటవేస్తోంది.
– మూషం రమేశ్‌, తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియర్‌ రాష్ట్ర అధ్యక్షుడు

 

(Courtacy Nava Telangana)

RELATED ARTICLES

Latest Updates