అసమ్మతి నేరమైన చోట!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

పి. విక్టర్ విజయ్ కుమార్

మనకుండే కామన్ సెన్స్‌ను కూడా ఈ చట్టాల ద్వారా మనం కోల్పోతున్నాం. సహజ సూత్రాల మీద న్యాయం జరగాలి అన్న ఒక నీతిని వదిలేసుకుంటున్నాము. ఎవరిని దోషిగా పరిగణించాలి అనే ప్రశ్నకు ‘ఆధారం’ కాదు ‘అనుమానం’ మాత్రం ఉంటే సరిపోతుందని సర్ది చెప్పుకునే చట్టపు అమలులో మనం ఉన్నాము. ఈ చట్టాలు ఎప్పుడో అనివార్య పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో కొద్ది కాలం విధించాల్సిన చట్టాలు. అయితే ఈ చట్టాలు మనల్ని ప్రతి రోజు ఎమర్జెన్సీలోకి నెట్టేస్తున్నాయి. 

ఒకసమాజంలో బతికే ప్రతి వ్యక్తికి ఆ సమాజంపై ‘స్వంత భావన’ అవసరం. తాను స్వంతం కాలేని ప్రదేశంలో ఏ వ్యక్తి బతకలేడు. అయితే ఈ భావనకు విపరీత ధోరణులు కల్పించి పాలకవర్గం ఒక ‘పర్వర్షన్’తో సంఘటిత ప్రయోజనాలను పంచుకోకుండా తీవ్రమైన స్వార్థ ప్రయోజనాలను సమాజంపై పులమాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలే అంబేడ్కర్ తన జీవితాంతం గర్హించిన ‘మెజారిటేరియనిజం’కు ప్రాతిపదికలయ్యాయి. రాజ్యాంగ బద్ధంగా ఒక క్రమ రీతిలో బతకాలి అని ఈ దేశం నిర్ణయించుకోడానికి ముందు ఇక్కడి భూస్వామ్య వ్యవస్థ చరిత్రను చూడండి. బ్రాహ్మణిజం తమ జీవితంలో ఒక భాగంగా భారతీయ సమాజం బతికిందని అర్థమవుతుంది. ఎటువంటి అనంగీకారానికి కూడా బ్రాహ్మణిజం అనుమతివ్వలేదు. అది సృష్టించిన దేవుడైన రాముడి దగ్గర నుండి మొదలుకుని, అది తయారు చేసిన గుప్త చక్రవర్తుల నుండి ఈనాటి పాలకుల వరకు అసమ్మతికి అవకాశమే లేదు.

ఆ విధంగా ఇదో సాధారణీకృతమైన (normalize) విషయం అయిపోయి పాలక వర్గాల ఆలోచనా విధానాన్ని ప్రశ్నించే ప్రతి రాజకీయ అసమ్మతిదారుడు గ్రహాంతర వాసిగా పరిగణింపబడే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇది కేవలం ఆస్తులు సమకూర్చుకోడానికి లేదా ఆర్థిక దోపిడీకి సంబంధించిన విషయం కాదు. ఇది ఈ సమాజంలో భద్రంగా పేర్చుకున్న ‘సోషల్ కేపిటల్’ను బలపర్చుకోవడం. రాజకీయ అనంగీకారాన్ని తొక్కిపెట్టడం ద్వారా తమ సిద్ధాంతాలకు ఒక కృత్రిమ సమ్మతి సంపాయించడం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ అనంగీకారం బ్రాహ్మణిజం సాధించుకున్న సోషల్ కేపిటల్‌ను క్రమేపీ ‘రిడిక్యుల్’ చేయడం ద్వారా తుప్పు పట్టిస్తుంది. ఇది కేవలం బీజేపీకి సంబంధించిన సమస్య కాదు. ఇంచుమించు అన్ని పార్టీలు ‘బ్రాహ్మణిజం’ అనే ఒక స్కేల్ మీద ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు ఏదో ఒక స్థానంలో ఉండి సంభాషిస్తుంటాయి. అయితే బీజేపీ స్కేల్‌కు ఒక కొనలో ఉండడం వలన మిగతా వాటి స్థానాలు గర్హనీయంగానే అనిపిస్తాయి. ఎందుకంటే మిగతా ‘హిందుత్వ’ స్థానాలు, వాళ్ల పాలక స్థానాన్ని స్లో డౌన్ చేస్తాయి కాబట్టి. ఇదంతా సోషల్ కేపిటల్‌లో ఉండే డైనమిక్స్.

దేశ దేశానికి ఈ రాజకీయ అసమ్మతిని పరిగణించే విధానంలో తేడా ఉంటుంది. 1960లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం చైనాలో ఉండే ఖైదీలలో నలభైశాతం రాజకీయ ఖైదీలే. కాకపోతే వీళ్ళను ‘విప్లవ వ్యతిరేకులు’ అనే పేరుతో అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టడం జరిగింది. నెల్సన్ మండేలా, ఆంగ్‌సాన్ సూకీ తదితరులు అందరూ రాజకీయ ఖైదీ జీవితాన్ని నడిపిన వాళ్ళే. అందుకే ఈ రాజకీయ అనంగీకారానికి వర్గ స్వభావం కూడా ఉంది. అంబేడ్కర్ చెప్పినట్టు ‘ఈ దేశంలో శ్రామిక వర్గానికి బ్రాహ్మణిజం, కేపిటలిజం రెండూ శత్రువులే’.

హక్కుల సంపూర్ణత ఉండదని, దానిపై కొంత వరకు పరిమితి విధించాలని, అయితే ఆ పరిమితి వల్ల ప్రాథమిక హక్కులకు హాని కలగకుండా ఉండాలని రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో అంబేడ్కర్ గట్టిగా భావించాడు. ఈ విషయాన్ని నిష్కర్షగా చెప్పాడు. 1949లో జవహర్ లాల్ నెహ్రూ ‘క్రాస్ రోడ్స్’ అనే కమ్యూనిస్ట్ పత్రికను రద్దు చేసినప్పుడు, ఆయన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే– స్వాతంత్ర్య సమరయోధుడైన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ ఈ రాజకీయ అనంగీకారాన్ని మెచ్చుకోలేని పరిస్థితి మన దేశంలో ఉండింది! అయితే గుడ్డిలో మెల్ల ఏమంటే, నెహ్రూ ఆ సాకుతో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఆర్టికల్ 19 (భావప్రకటనా స్వేచ్ఛ) ప్రకారం ప్రభుత్వం మన హక్కులకు భంగం కలిగే ఎటువంటి చట్టాలు చేయరాదు. దీని పై జరిగిన చర్చలో అంబేడ్కర్ ఆ స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ప్రభుత్వానికి ఉందని అంగీకరిస్తూ అది కొన్ని ‘సహేతుక కారణాలకు’ లోబడి మాత్రమే చట్టాలను తీసుకురావచ్చని ఒప్పుకున్నాడు.

అయితే ఆ కారణాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదనే ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించాడు. కాలక్రమంలో ఆర్టికల్ 19 ద్వారా మనకు సంక్రమించిన హక్కులను ప్రభుత్వం క్రమేపీ లాగేసుకుంది. ‘క్రాస్ రోడ్స్’ పత్రికాధిపతులపై ద్వేషంతో ఉన్న నెహ్రూ ఆర్టికల్ 19ను మార్చమని కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేడ్కర్‌ను ఆదేశించాడు. అయితే అంబేద్కర్ ఆ ఆదేశాన్ని పాటించలేదు. న్యాయశాఖ మంత్రి పదవికి అంబేడ్కర్ రాజీనామా చేసిన తర్వాత 1951లో నెహ్రూ స్వయంగా ఆర్టికల్ 19కి సవరణ తెచ్చాడు. ఇదే మొదటి రాజ్యాంగ సవరణ. అందులో ‘పబ్లిక్ ఆర్డర్’ను రక్షించడానికి మాత్రం చట్టాలు చేయవచ్చనే మాటను ఇరికించారు. ‘సహేతుకం’, ‘పబ్లిక్ ఆర్డర్’ అన్నవి ఎంత విశాల అర్థంలో అయినా వాడవచ్చు. ఆ క్రమంలో కశ్మీర్ ఆందోళనలు, దక్షిణాన ద్రవిడ కజగం కలగ జేస్తున్న అసౌకర్యాన్ని ఎదురొడ్డడానికి ‘సార్వభౌమత్వాన్ని సమగ్రతను’ దెబ్బ తీసే ఏ విషయంలో అయినా చట్టం చేయవచ్చని అంటూ ఆ రెండు పదాలు ఇరికించి రాజ్యాంగానికి 16వ సవరణను నెహ్రూ తెచ్చాడు. ఇక ఏది సార్వభౌమత్వాన్ని సమగ్రతను దెబ్బ తీస్తుందో అది ప్రభుత్వ స్వయం నిర్ణయం (prerogative) అయిపోయింది. ఆ స్వయం నిర్ణయాధికారంతో టాడా వచ్చింది, తర్వాత ఉపా చట్టం వచ్చింది. మొన్నటికి మొన్న ఉపా సవరణ కూడా వచ్చింది.

ఉపా సవరణ ప్రకారం ప్రభుత్వానికి ప్రశ్నించలేని అధికారం వచ్చింది. ఎవరిని టెర్రరిస్టుగా ముద్ర వేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. కేరళలో రాజకీయ కార్యకర్తలను ఉపా చట్టం కింద అరెస్ట్ చేసారు. భీమా – కొరేగావ్ కేసులో చూస్తే, మహర్ (దళిత్) రెజిమెంట్ సాహసాలను గుర్తు తెచ్చుకుని 35,000 మంది ఒక చోట సమావేశం అయితే ఆ సమావేశానికి జిగ్నేశ్ మెవాని లాంటి రాజకీయ నాయకులు, రాధిక వేముల (రోహిత్ వేముల తల్లి), విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఖోల్సే లాంటి వాళ్ళు వక్తలుగా వచ్చారు. అయితే పోలీసులకు ఈ సమావేశం మావోయిస్టులు జరిపారనే ‘అనుమానం’ కలగడంతో రోనా విల్సన్ అనే ఉద్యమ కారుడిని, అనిల్ తేల్టుంబ్డే అనే ప్రొఫెసర్‌ను, వరవర రావు అనే రచయితను, సుధా భరద్వాజ అనే లాయర్‌ను ఇలా చాలా రేండంగా అరెస్టులు చేసారు. వీళ్ళందరు ఢిల్లీ, నాగ్‌పూర్, బాంబే ఇలా ఒక్కో ప్రదేశంలో నివసిస్తున్నవాళ్ళు. వీళ్ళల్లో ఒక్కరు కూడా పూర్వంలో గాని ప్రస్తుతం గాని ఆయుధాలు పట్టిన వాళ్ళు కాదు. ఈ అరెస్టుల విధానం మనకుండే సహజ వివేచనను కూడా ప్రశ్నిస్తుంది. ప్రొఫెసర్ సాయిబాబ కేసు చూస్తే ఆయనను మొదటగా ఒక దొంగతనం కేసు మీద అరెస్ట్ చేసారు. వీల్ చెయిర్‌లో బతికే ఒక ప్రొఫెసర్ దొంగతనం చేయడానికి మహారాష్ట్రలోని ఒక మారుమూల ప్రాంతమైన ‘అహిరే’ అనే ప్రదేశానికి ఎలా వెళ్ళగలిగాడు అన్నది ఎవరి కామన్ సెన్స్‌కు తట్టని ప్రశ్న. అయినా అరెస్ట్ జరిగింది, తర్వాత ఉపా కేసు వేయడం జరిగింది, శిక్ష విధించడం కూడా జరిగింది. మనకుండే కామన్ సెన్స్‌ను కూడా ఈ చట్టాల ద్వారా మనం కోల్పోతున్నాం.

సహజ సూత్రాల మీద న్యాయం జరగాలి అన్న ఒక నీతిని వదిలేసుకుంటున్నాము. ఎవరిని దోషిగా పరిగణించాలి అనే ప్రశ్నకు ‘ఆధారం’ కాదు ‘అనుమానం’ మాత్రం ఉంటే సరిపోతుందని సర్ది చెప్పుకునే చట్టపు అమలులో మనం ఉన్నాము. 80ఏళ్ళ వృద్ధుడు వరవరరావు. ఆయన హైదరాబాదు నుండి తన ఉద్యమాలను, రచనలను కొనసాగిస్తాడు. ఆయన భీమా కొరేగావ్‌కు వెళ్ళింది లేదు. అరెస్ట్ కంటే ముందు కూడా ఆయన పూనా వెళ్ళింది లేదు. ఆయనకు ఆ సమావేశంలో పాల్గొన్న 35,000 మంది పట్ల సానుభూతి ఉండే అవకాశం మాత్రమే ఉంది. ఆయన వివేచనే ఆయనకు శత్రువయింది ఇప్పుడు. ఆయన భావాలు, విశ్వాసాలలో ఉండే ఆ సానుభూతి ఆలోచన ఆయనను బెయిల్ దక్కని పరిస్థితుల్లో కటకటాల వెనక్కు నెట్టి వేసింది. బూతు సాహిత్యం చదివిన వ్యక్తి ఒక పొటెన్షియల్ రేపిస్టుగా అవ్వచ్చు అని భావించి అరెస్ట్ చేయకూడదు అని తలిచే మన ఇంగితం, మెచ్యూరిటీ మనకు ఈ రాజకీయ అనంగీకారంపై లేకుండా పోయింది. ఆర్టికల్ 19కి తెచ్చిన సవరణలు పాలక వర్గాల సైద్ధాంతిక నియంతృత్వానికి పోటీగా ఎటువంటి సైద్ధాంతిక ఆలోచన ఉండరాదు అనే పరిస్థితి సృష్టించబడింది. ఒక సరుకుకు సరి అయిన ధర నిర్ణయించడానికి మనకు పోటీ కావాలి.

కానీ ప్రజలకు సరి అయిన సైద్ధాంతిక ఆలోచన ఏది కావాలో తెలుసుకుని పురోగమించడానికి మాత్రం పోటీ వద్దు. రోజులు గడుస్తున్న కొద్దీ, రాజ్యాంగ నీతి (constitutional morality)ని అమలు పరిచే పరిస్థితి కోర్టుల్లో కూడా లేదు. ఎందుకంటే మన సమస్య చట్టం రూపకల్పనతో ఉంది. ఇక చట్టం అమలు గురించి ఏమి మాట్లాడగలము? సహజ సూత్రాలపై న్యాయం ప్రకటించాల్సిన కోర్టులు, ఒక తార్కిక విశ్లేషణ ద్వారా తీర్పు ఇవ్వాల్సిన కోర్టులు, ఇవన్నీ తోసిపుచ్చి రాజ్యాంగ నీతి సూత్రాలను పట్టించుకునే బలం లేకుండా పోయింది. ఈ చట్టాలు ఎప్పుడో అనివార్య పరిస్థితుల్లో ఎమెర్జన్సీలో కొద్ది కాలం విధించాల్సిన చట్టాలు. అయితే ఈ చట్టాలు మనల్ని ప్రతి రోజు ఎమర్జెన్సీలోకి నెట్టేస్తున్నాయి. మనకు దళిత దృక్పథ ఆలోచనలు కావాలి, మహిళా దృక్పథంలో ఉండే ఆలోచనలు కావాలి, సావర్కర్ దృక్పథంలో ఉండే ఆలోచనలు కావాలి, నెహ్రూ దృక్పథంతో ఉండే ఆలోచనలు కావాలి. ఇవన్నీ ఒక స్వేచ్ఛా పూరితమైన నియమాలతో మన మధ్య ఉండే, మనలోని అసంపూర్ణతను ఒక సంభాషించే కళ (art of conversation) ద్వారా గుర్తు చేయాలి. ఇది ఇప్పుడు మనకు పూర్తిగా లోపించింది. అంబేడ్కర్ తనకున్న స్థాయిలో నిమ్న వర్గాల ప్రజల ప్రయోజనాల రూప కల్పన కోసం చిన్న చిన్న రాజీలతో సరిపెట్టుకుని అటువంటి వాతావరణాన్ని నిర్మించడానికి కృషి చేసాడు. ఆ క్రమంలో రాజ్యాంగాన్ని నిర్మించాడు. అంబేడ్కర్‌ను సహజ మరణానికి కోల్పోయాము. ప్రజాస్వామ్యాన్ని బలవన్మరణానికి కోల్పోతున్నాము.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates