అక్కడేం తయారీ?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నాటి హిందూస్థాన్‌ పాలిమర్సే నేటి ఎల్‌జీ పాలిమర్స్‌

మన దేశంలో ‘ఎల్‌జీ’ బ్రాండు గురించి తెలియని వారుండరు. దక్షిణ కొరియాకు చెందిన అగ్రగామి సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ దాదాపు మూడు దశాబ్దాలుగా మన దేశంలో ఎన్నో రకాల గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు విక్రయిస్తోంది. వీటికి అవసరమైన పాలిస్టైరీన్‌(పీఎస్‌), ఎక్స్‌పాండబుల్‌ పాలిస్టైరీన్‌ (ఈపీఎస్‌) ముడి వస్తువులను విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలీమర్స్‌ ఇండియా తయారు చేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఎల్‌జీ ఇండియా కార్యకలాపాలకు విశాఖ ప్లాంటు ఎంతో కీలకం. ఎల్‌జీ గ్రూపునకు చెందిన ఎల్‌జీ కెమ్‌ అనే కంపెనీకి ఎల్‌జీ పాలీమర్స్‌ ఇండియా అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.

1961లో ఏర్పాటు
విశాఖపట్నంలో పెట్రో రసాయనాల పరిశ్రమ ఎంతోకాలంగా ఉంది. విశాఖపట్నం పోర్టు, హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ ఉండటం వల్ల ఇక్కడ పలు రకాల పెట్రో రసాయనాల యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలోనే 1961లో విశాఖలో హిందుస్థాన్‌ పాలిమర్స్‌ ఏర్పాటైంది. తొలుత ఈ ప్లాంటులో మొలాసిస్‌ నుంచి ఆల్కహాల్‌ తయారీకి అవసరమైన ఇథనాల్‌ తయారు చేసేవారు. మొలాసిస్‌ వ్యర్థాల వల్ల దుర్వాసన అధికంగా రావడంతో, అప్పట్లో స్థానికులు ఈ పరిశ్రమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా కొంత కాలం పాటు సంస్థను మూసేశారు. తరవాత విదేశాల నుంచి స్టైరీన్‌ దిగుమతి చేసుకుని పాలిస్టైరీన్‌ తయారీ మొదలుపెట్టారు. యునైటెడ్‌ బ్రూవరీస్‌(యూబీ) గ్రూపునకు చెందిన మెక్‌డోవెల్‌ కంపెనీ 1978లో దీన్ని సొంతం చేసుకుంది.

ఎల్‌జీ చేతికి వచ్చాక..
మన దేశంలో ఎల్‌జీ గ్రూపు 1990 దశకంలో అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలో బ్రాండ్‌ విలువ, విక్రయాల పరంగా పెద్ద సంస్థగా ఎదిగింది. తొలుత ఇతర దేశాల్లోని తన ఫ్యాక్టరీల నుంచి దిగుమతి చేసిన ఉత్పత్తులను మనదేశానికి తీసుకువచ్చి విక్రయించినప్పటికీ… ఆ తర్వాత దేశీయ తయారీ చేపట్టింది. ఆ క్రమంలో దీనికి పాలీమర్స్‌ తయారీ యూనిట్‌ అవసరమైంది. అందువల్ల విశాఖలోని హిందుస్థాన్‌ పాలిమర్స్‌ యూనిట్‌ను 1997లో ఎల్‌జీ కెమికల్స్‌ కొనుగోలు చేసింది. తనచేతికి వచ్చిన తర్వాత దాన్ని ఎల్‌జీ పాలీమర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌… అని పేరు మార్చింది. అప్పటి నుంచి పీఎస్‌, ఈపీఎస్‌ వస్తువులు ఈ యూనిట్లో తయారు చేస్తోంది.
* పీఎస్‌ వస్తువులను ఎయిర్‌ కండీషనర్లు, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు… స్టేషనరీ ఉత్పత్తుల్లో వినియోగిస్తారు.
* ఈపీఎస్‌ వస్తువులను ఎలక్ట్రికల్‌- ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ప్యాకింగ్‌, కోల్డ్‌ స్టోరేజీ, వ్యవసాయ రంగానికి అవసరమైన ట్రేలు, కంటైనర్లు, ఒకసారి వినియోగించే కప్పులు, ప్లేట్లు, గిన్నెల వంటి పలు రకాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు. దీని మాతృసంస్థ అయిన ఎల్‌జీ కెమ్‌, ప్రపంచంలోని పది అతిపెద్ద రసాయన కర్మాగారాల్లో ఒకటి.

1998లోనూ ప్రమాదం
ఈ యూనిట్లో 1998లో ఒకసారి ప్రమాదం జరిగింది. గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. కొందరికి గాయాలయ్యాయి. అప్పుడు ఈ యూనిట్‌ను తరలించాలని స్థానికులు ఆందోళన చేశారు. స్థానిక రాజకీయ నేతలు, గ్రామస్థులతో చర్చలు జరిపి వివాదం సద్దుమణిగేలా చేశారు. అంతా సాఫీగా సాగిపోతోందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఇప్పుడు విషవాయువు లీకయింది. విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక వాడల్లో భద్రతా చర్యలపై సత్వరం దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం గుర్తుచేస్తోంది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates