సైబరాబాద్‌లో.. ఎఫ్‌ఆర్‌సీసీ ఏమైంది?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • నేర స్థలికి 10 నిమిషాల్లో పోలీసులు
  • సరిహద్దు వివాదాల్లేకుండా పోలీసింగ్‌
  • శివార్లపై నిరంతర నిఘా, పెట్రోలింగ్‌
  • సీవీ ఆనంద్‌తోనే వ్యవస్థకు ఫుల్‌స్టాప్‌!
  • క్రైమ్‌ మ్యాపింగ్‌ ఊసేలేని అధికారులు
  • వెటర్నరీ డాక్టర్ ఉదంతంతో మళ్లీ చర్చ

ఎఫ్‌ఆర్‌సీసీ.. ఫస్ట్‌ రెస్పాన్స్‌ కమాండ్‌ కంట్రోల్‌.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మహిళా భద్రతలో భాగంగా అప్పటి ఉమ్మడి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సత్ఫలితాలను పొందారు. తొలి ఆరు నెలల్లోనే క్రైమ్‌ రేటును 30ు వరకు తగ్గించగలిగారు. ఈ వ్యవస్థలో.. సైబరాబాద్‌ వ్యాప్తంగా ‘క్రైమ్‌ మ్యాపింగ్‌’ చేశారు. ఆ ప్రాంతాలకు.. పోలీసు వాహనాలకు జియోట్యాగింగ్‌ చేసి నిరంతర నిఘా కొనసాగించారు. శివారు ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రదేశాల్లో జరిగే హత్యలు, అత్యాచారాల నిర్మూలన, దేవాలయాల వద్ద చైన్‌ స్నాచింగ్‌లు, బ్యాంకులు-ఏటీఎం కేంద్రాల వద్ద దృష్టిమళ్లింపు దొంగతనాలను అరికట్టడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. విజిబుల్‌ పోలీసింగ్‌ ప్రధాన లక్ష్యం.

ఎఫ్‌ఆర్‌సీసీలో భాగంగా సైబరాబాద్‌లో 6 వేల ప్రాంతాల్లో ‘క్రైమ్‌ మ్యాపింగ్‌’ చేశారు. ఈ ప్రాంతాలపై 24 గంటలూ నిఘా ఉండేలా.. 21 ఇంటర్‌సెప్టార్‌ వాహనాలు, 190 బ్లూకోల్ట్స్‌ బృందాలను ఎఫ్‌ఆర్‌సీసీ పరిధిలోకి తీసుకువచ్చారు. వీటికి తోడు.. ఆయా పోలీ్‌సస్టేషన్ల పరిధిలోని పెట్రోలింగ్‌ వాహనాలను వినియోగించేవారు. ఈ వాహనాలు రోజుకు 25 వేల కిలోమీటర్ల మేర గస్తీ నిర్వహించేవి. షీటీమ్స్‌, సైబరాబాద్‌ వాట్సాప్‌, డయల్‌-100కు వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే ఎఫ్‌ఆర్‌సీసీకి పంపేవారు. ఎఫ్‌ఆర్‌సీసీ సిబ్బంది పోలీ్‌సస్టేషన్ల మధ్య సరిహద్దులతో సంబంధాలు లేకుండా.. ఘటనాస్థలికి చేరుకునేవారు.

ఎందుకు పనిచేయడం లేదు?
‘‘సీవీ ఆనంద్‌ సార్‌ ఉన్నప్పుడు ఎఫ్‌ఆర్‌సీసీపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఆయన బదిలీపై వెళ్లాక.. సైబరాబాద్‌ రెండుగా విడిపోయింది. ఆ తర్వాత కొంత కాలం ఎఫ్‌ఆర్‌సీసీ ఉన్నా.. అప్పట్లో గణేశ్‌ నవరాత్రులు, దసరా, రంజాన్‌ బందోబస్తు కోసం ఈ బృందాన్ని వాడుకున్నారు. ఆ తర్వాత ఎఫ్‌ఆర్‌సీసీ ఊసే లేకుండా పోయింది’’ అని ఓ అధికారి తెలిపారు.

వెటర్నరీ డాక్టర్ విషయంలో..
ఎఫ్‌ఆర్‌సీసీ ఉండి ఉంటే వైద్యురాలి విషయంలో ఘోరం జరిగి ఉండేది కాదనే చర్చ జరుగుతోంది. ఈ బృందం నిరంతరం ఓఆర్‌ఆర్‌కు సమాంతరంగా ఉండే సర్వీస్‌ రోడ్లలో గస్తీ తిరిగేది. శంషాబాద్‌ ఔటర్‌ టోల్‌ సమీపంలోని జాతీయ రహదారిపై నిరంతరం ప్రమాదాలు జరిగేవి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎఫ్‌ఆర్‌సీసీ బృందాల నిఘా ఉండేది. వైద్యురాలి ఉదంతంలో.. నిందితులు వెళ్లిన మార్గాన్ని ఎఫ్‌ఆర్‌సీసీ జల్లెడపట్టేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. – సెంట్రల్‌ డెస్క్‌

Courtesy AndhraJyothy..

RELATED ARTICLES

Latest Updates