నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రియాంకరెడ్డిని కిడ్నాప్‌ చేశారని వేడుకున్నా స్పందించని పోలీసులు
సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య వ్యవహారంలో శంషాబాద్‌ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఆమె తండ్రి బుధవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేసి.. కన్నీరు మున్నీరైనా సిబ్బందిలో స్పందన కరవైంది. గురువారం ఉదయం ఆమె మృతదేహం లభ్యమైన తరువాతే పోలీసుల్లో కదలిక వచ్చింది. తాను ఆపదలో ఉన్నానంటూ బుధవారం రాత్రి శంషాబాద్‌ సమీపంలోని చటాన్‌పల్లి ప్రాంతం నుంచి ప్రియాంకరెడ్డి తన సోదరికి ఫోన్‌ చేసింది. తరువాత కొద్దిసేపటికే ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. వెంటనే ఆమె తండ్రి, ఇతరులు గాలింపు చర్యలు చేపట్టి..అదేరోజు అర్ధరాత్రి శంషాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాధారణంగా అదృశ్యం కేసుల్లో పోలీసులు వేగంగా స్పందించరు. ఒకటి రెండు రోజుల తరువాత పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తుంటారు. ప్రియాంక అదృశ్యం సంఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఇది అదృశ్యం కేసే కాదు.. తనను ఎవరో తీసుకువెళుతున్నారంటూ ప్రియాంక భయపడుతూ తన సోదరికి చెప్పింది. అంటే ఆమె ఆపదలో ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి చెప్పగానే.. పోలీసులు రంగంలోకి దిగాలి. గస్తీ వాహనాలను అప్రమత్తం చేసి గాలింపు చేపట్టాలి. సంబంధిత మార్గాల్లో వాహనాలను ఆపి తనిఖీ చేసి అప్పటికప్పుడు అనుమానితులను అదుపులోకి తీసుకోవాలి. కానీ దీనికి భిన్నంగా పోలీసులు వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెల్లవారుజామున సత్యం అనే రైతు పాల కోసం వెళుతూ కాలిపోతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాకనే పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.

ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును చేపట్టారు. గురువారం సాయంత్రానికిగానీ నిందితులు ప్రియాంకను ఎక్కడికి తీసుకువెళ్లారన్న విషయాన్ని పోలీసులు కనుగొనలేకపోయారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టామని డీసీపీ తెలిపారు.

అదృశ్యం కేసుల్లోనూ…
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏటా వేలల్లో మహిళల అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో కింది స్థాయి సిబ్బంది వేగంగా దర్యాప్తు చేపట్టడం లేదన్న విమర్శలున్నాయి. నాలుగైదేళ్లుగా దాదాపు 2వేలకు పైగా కేసుల్లో దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగలేదని చెబుతున్నారు. దీంతో అదృశ్యమైన బాలికలు, మహిళలు ఏమయ్యారో తెలియడం లేదు. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మలక్‌పేట, అంబర్‌పేట, కాచిగూడ స్టేషన్ల పరిధిలో కొంతకాలంగా భారీగా అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి. ఇందులో చాలా మంది ఇప్పటికీ ఏమయ్యారో తెలియడం లేదని చెబుతున్నారు. ఆయా కేసుల్లో సంబంధిత కుటుంబీకులు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఆ సమయంలో ఏం జరిగింది?
ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు
మిస్టరీగా మారిన ప్రియాంక రెడ్డి హత్యోదంతం

జీవితంపై ఎన్నో బంగారు కలలు కన్న ఓ యువతి జీవితం తెల్లారిపోయింది. చదువులో ప్రతిభ చూపి పశు వైద్యరంగంలో కొలువు సాధించి అమ్మా నాన్నలు, సోదరితో కలిసి హాయిగా సాగిపోతున్న యువ వైద్యాధికారిణికి అదే ఆఖరిరోజైంది. షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి వద్ద ముష్కరుల చేతిలో దారుణంగా హత్యకు గురైన ప్రియాంకరెడ్డి ఉదంతం సంచలనం కలిగించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎన్నో ప్రశ్నలు మిస్టరీగా మారాయి.

1
రద్దీగా ఉండే రోడ్డు పక్కనే అమానుషం జరిగితే ఎవరూ గుర్తించలేదా..? లారీ డ్రైవర్లే నిందితులా..? వారంలో ఒకరోజు గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తప్పనిసరిగా ఆమె వెళ్తుందనే విషయం దుండగులకు ముందే తెలుసా..? ప్రియాంక ‘డయల్‌ 100’కు ఎందుకు ఫోన్‌ చేయలేకపోయింది..? తొండుపల్లి కూడలి వద్ద ఆమె స్కూటీ టైరును నిందితులే పంక్చర్‌ చేశారా అనేది తేలాల్సి ఉంది.

ప్రియాంక దుస్తులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న చోటు సర్వీస్‌ రోడ్డుకు పక్కనే ఉంది. దాడి చేసినపుడు ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదా? స్కూటీ పార్కింగ్‌ చేసిన చోటు నుంచి ప్రియాంక మృతదేహం లభించిన ప్రాంతం 28 కి.మీల దూరంలో ఉంటుంది. కీలకమైన జంక్షన్‌ కావడంతో పోలీసుల నిఘా నిత్యం ఉంటుంది. అంతదూరం ఎలా.. ఏ వాహనంలో తీసుకెళ్లారు..?

సాయం చేసేందుకు ఆ ఇద్దరు వాళ్లంతటవారే ముందుకొచ్చారా.. ఆమె విజ్ఞప్తి చేసిందా..? వారి ఉచ్చులో ఆమె ఎలా చిక్కుకున్నారు? అసలు హత్య ఎక్కడ జరిగింది..? చటాన్‌పల్లిలోని రోడ్డు కింది వంతెన దగ్గరే ఎందుకు దహనం చేశారు.. ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఆమెను గోడ లోపలికి తీసుకెళ్తున్నట్లుగా సమీపంలో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఆ ఇద్దరు లారీ డ్రైవర్లేనా?

http://https://www.youtube.com/watch?v=onr3pRa_460

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates