మేము ఆత్మహత్యల్ని ఆపలేం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కార్మికులు సరైన వేదికను ఆశ్రయించడంలేదు
ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాలపై హైకోర్టు వ్యాఖ్యలు

పలు పిటిషన్‌లను ప్రజాప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణిస్తుంటే మా వద్ద మంత్ర దండం ఉందనుకుంటున్నారు. హైకోర్టుకు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టిన రాజ్యాంగం పరిమితులనూ విధించింది. చట్టపరిధికి లోబడే పనిచేయగలం.
హైకోర్టు

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు నిస్సహాయులు కారు. అలా అనుకోవడం భ్రమ, తప్పు అభిప్రాయం. వారు సరైన వేదికను ఆశ్రయించడంలేదు. కంటి జబ్బు వస్తే కిడ్నీ డాక్టరు వద్దకు వెళితే ఉపయోగం ఏమిటి? అన్యాయం జరుగుతుందనుకున్న ప్రతి కార్మికుడూ న్యాయం పొందవచ్చు. అయితే సరైన పరిష్కార వేదికను ఆశ్రయించకపోతే న్యాయం జరగదు. పారిశ్రామిక వివాదాల చట్టం కింద ప్రతి కార్మికుడు సొంతంగా కేసును దాఖలు చేయవచ్చు. నా(కార్మికుడి) పీఎఫ్‌ను వాడుకున్నారని, సర్వీసు పరిస్థితులు బాగాలేవని, సెప్టెంబరు జీతాన్ని ఇవ్వడంలేదని కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు’ అని హైకోర్డు పేర్కొంది.

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని, కార్మికులతో చర్చలు జరపకపోవడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు వ్యక్తిగత హోదాలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విశ్వేశ్వరరావు వాదనలు వినిపించారు. ‘‘ఇదో పెద్ద విషాదం. 48 వేల మంది కార్మికులు 50 రోజులుగా సమ్మె చేయడం ఒక చరిత్ర అయితే విధుల్లోకి రానివ్వకపోవడంతో వారు మరింత దయనీయ పరిస్థితుల్లోకి కూరుకుపోతున్నారు. సమ్మె నేపథ్యంలో కుటుంబ పరిస్థితులను ఎదుర్కోలేక ప్రాణం తీసుకునే ముందు ఓ ఉద్యోగి రాసిన వాంగ్మూలాన్ని పరిశీలించండి. 30 మంది దాకా ఆత్మహత్యలు, గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. అది ఆత్మహత్యలకు, సమ్మెకు సంబంధం ఉందో లేదో తేలుస్తుంది’’ అని వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పనిలేని కారణంగా గుండెపోటుకు గురయ్యారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడానికి ఆధారాలు చూపడం లేదంది. పిటిషనర్‌ స్పందిస్తూ ప్రభుత్వం సెల్ఫ్‌ డిస్మిస్‌ అని ప్రకటించడం ఎంత ఆవేదనకు గురిచేస్తుందోననగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కోర్టుకు సాక్ష్యాలు ప్రధానమని పేర్కొంది. ‘ఎవరికైనా ఉదయం లేవగానే కడుపు నొప్పి వస్తే సూర్యుడు ఉదయిస్తుండటం వల్ల వస్తోందని చెప్పవచ్చా? సెల్ఫ్‌డిస్మిస్‌ అంటూ ఆర్టీసీ ఎవరినైనా తొలగించిందా? ఎవరినీ తొలగించలేదు కదా?’ అని ప్రశ్నించింది.

సమ్మెకు వెళ్లాలన్నది యూనియన్‌ లీడర్ల నిర్ణయం
‘‘సమ్మెకు వెళ్లాలన్నది ప్రభుత్వ నిర్ణయం కాదు. యూనియన్‌ లీడర్ల నిర్ణయం. నిందించదలుచుకుంటే వారిని నిందించాల్సి ఉంటుంది. పరిస్థితులు బాగాలేవని గమనించినపుడు సమ్మె విరమించడానికి వారిని ఎవరూ నిరోధించలేదని గమనించాలి. పరిమితులకు లోబడే కోర్టులు పని చేయాలి. మేము ఆత్మహత్యలను ఆపలేం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వంతోపాటు కార్మికులూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. యూనియన్‌ వారు పేరున్న సీనియర్‌ న్యాయవాదిని పెట్టుకున్నారని, ఇక్కడ మంచి న్యాయవాదులకు కొరత లేదని, వారిని సంప్రదించి సలహా పొందవచ్చంది.

విధుల్లోకి హాజరుకానివ్వడంలేదు
కార్మికులు విధుల్లోకి వెళ్లాలనుకుంటున్నా, హాజరుకాకుండా అడ్డుకుంటున్నారని పిటిషనర్‌ తెలిపారు. ‘‘వారి ఆవరణలోకి వారిని వెళ్లనివ్వడంలేదు. మీరు జోక్యం చేసుకోకపోతే మరిన్ని ఆత్మహత్యలు జరుగుతాయి. ఇంట్లోకి వంట గ్యాస్‌ తెప్పించుకోలేకపోతున్నారు. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు. ఇంతటి ఘోర విషాదాన్ని 68 ఏళ్ల జీవితంలో చూడలేదు’ అని పిటిషనర్‌ వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ ‘చర్చలు జరపకపోవడాన్ని, ఆత్మహత్యలు ఆపకపోవడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు. విధుల్లోకి రానివ్వకపోవడాన్ని ప్రశ్నించలేదు. అభ్యర్థనను సవరించి పిటిషన్‌ వేస్తే పరిశీలిస్తాం’ అంటూ విచారణను వాయిదా వేసింది.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates