నెరవేర్చని వాగ్దానం – న్యాయమైన వేతనం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Workersరఘునాథ్‌ కుచిక్‌ రఘునాథ్‌ కుచిక్‌ – మహారాష్ట్ర కనీస వేతన సలహా కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌)
చందన్‌ కుమార్‌ ( చందన్‌ కుమార్‌ – జాతీయ కనీస వేతన సలహా బోర్డు సభ్యుడు.

దేశంలో విద్వేషం, హింస, 370వ అధికరణం, అయోధ్యలో మందిర నిర్మాణం గురించిన చర్చలు ఓ వైపు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి కార్మికులకు వర్తించే ‘వేతనాల కోడ్‌ చట్టం 2019’కు సంబంధించిన నిబంధనలను అమలు చేయాలన్న ఆలోచనను కేంద్రం అకస్మాత్తుగా ముందుకు తెచ్చింది. ఈ ఏడాది పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలలో ఈ చట్టాన్ని తెచ్చినందుకు ప్రభుత్వం సంతోషంతో సంబరాలు జరుపుకుంది. కనీస వేతనాల కోసం 70 ఏళ్లుగా చూస్తున్న ఎదురుతెన్నులు ఇప్పటితో ముగిశాయని ఆర్భాటంగా ప్రకటించింది.

అవే అరకొర వేతనాలు
అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితినైనా కొత్త ముసాయిదా చట్టం మారుస్తుందని, ‘వారి నుదుటి రాతలను’ తిరగ రాస్తుందని అందరూ భావించారు. మొత్తం శ్రామిక జనాభాలో అసంఘటిత రంగ కార్మికుల భాగస్వామ్యం 93 శాతం వుందని అంచనా. స్థూల జాతీయోత్పత్తిలో వారి వాటా 60 శాతం వుంటుంది. ఎట్టకేలకు వారి శ్రమకు ఒక గుర్తింపు లభించింది.
ఇప్పుడు ముసాయిదాలో తలపెట్టిన కనీస వేతన నిర్ణయ విధానం, భారత దేశంలో ఇప్పటికే అమలవుతున్న ‘చాలీ చాలని వేతన విధానాన్ని’ మెరుగు పరుస్తుందని భావించారు. అందుకే ఈ ముసాయిదాని కార్మికుల బాగు కోరుకునే సంఘాలు ఆహ్వానించాయి. జీవించే హక్కుకు అనుగుణంగా వేతనాలు ఉండాలని ‘రాప్టకోస్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును (1991), దృష్టిలో పెట్టుకునే వేతనాలను సూచిస్తారని భావించారు.

కానీ దురదృష్టవశాత్తు, ముసాయిదాను లోతుగా గనక అధ్యయనం చేస్తే ఒక విషయం బోధపడుతుంది. చట్టం అమలు చేస్తే ఏర్పడే పర్యవసానాలకు, ఇచ్చిన వాగ్దానాలకు ఏమాత్రం పొంతన లేదని, ఆ వాగ్దానాలన్నీ బూటకమని, కేవలం తేనె పలుకులేనని అర్థం అవుతుంది. ఇది అసంఖ్యాకంగా ఉన్న అసంఘటిత కార్మికుల ఆశలపై నీళ్లు జల్లింది. ‘కనీస వేతనాన్ని’ రూపొందించేందుకు అనుసరించిన ముసాయిదా నిబంధనలు, విధానమే ఇందుకు కారణం. అందువలన కడుపు నిండా అన్నం తినడానికి కూడా సరిపోని, వేతన వ్యవస్థే ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు అమలవుతున్నట్టే రోజుకు కేవలం రూ.178 మాత్రమే అందుతుంది. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంతకు ముందున్న ప్రభుత్వం లాగే కార్మికుడు బతికేందుకు అవసరమైన ‘తిండి, బట్ట, వసతి’ కి మించి అదనంగా ఏమీ ఇవ్వదు.

ఈ మధ్యే వెలువడిన ‘వినిమయదారుల ఖర్చుల సర్వే’ వివరాలు కార్మికుల దుస్థితికి అద్దం పడుతోంది. ఈ వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ఒక కుటుంబం రోజుకు రూ.83 ఖర్చు చేస్తున్నది. అదే పట్టణాలలో అయితే రూ.134 ఖర్చు చేస్తున్నది. ఈ లెక్కలు కార్మికులు ఎంత దీన స్థితిలో ఉన్నారో, ఎంతగా దోపిడీ అవుతున్నారో తెలియ చేస్తున్నాయి. రాజ్యాంగం వారికి కల్పించిన గౌరవప్రదమైన వేతనాలను అటు రాజ్యం ఇటు యాజమాన్యాలు ఉల్లంఘిస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా (పోషకాహారం, ఆరోగ్య రక్షణ, విద్య, గృహ వసతి, వృద్ధాప్యంలో అవసరాలకు సరిపడా దాచుకునేందుకు) సరిపడా వేతనాలు నిర్ణయించబడాలని సుప్రీంకోర్టు, న్యాయశాస్త్రం ఆదేశించినప్పటికీ పరిస్థితి ఇలా వుంది. అందువలన వేతనాలు నిర్ణయించడానికి అమలు చేయవలసిన ముసాయిదా నిబంధనలలో, భారతదేశ పౌరునిగా ప్రతి వ్యక్తీ గౌరవప్రదంగా జీవించే హక్కును కూడా పరిగణనలోకి తీసుకొని ఉండ వలసింది. ఈ సందర్భంలో కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు జీవించడానికి సరిపోయే వేతనాలను అమలు చేయడాన్ని ప్రస్తావించుకోవాలి. అక్కడ భారత దేశం లోనే ఎక్కడా లేనంత ఎక్కువ స్థాయిలో వేతనాలు నిర్ణయించ బడ్డాయి. ఢిల్లీలో నెలకి రూ.14,842 నిర్ణయించగా, కేరళలో రోజుకి రూ.600 నిర్ణయించారు.

సంస్కరణల పేరుతో వెనుకబాటుతనం
‘నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న, అభివృద్ధి చెందని దేశాలలో కార్మికులకు ఇచ్చే కనీస వేతనాలు ఆకలిని కూడా తీర్చడానికి సరిపోక పోవచ్చు’ అని యు.యూనిచోయి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. భారతదేశంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి వున్నది. ఇక్కడ శ్రామిక మార్కెట్‌లో అవసరాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా కార్మికులు అందుబాటులో ఉంటున్నారు. దీని వలన కనీసం జీవించడానికి సరిపడా వేతనాలు కూడా కార్మికునికి అందడం లేదు. కార్మికుడు దోపిడీకి గురవుతున్నాడు. కార్మికులను వీలైనంత తక్కువ జీతానికి పనిలో పెట్టుకొంటున్నారు. కనీస వేతనం అంటూ ఒక దానిని ఏర్పాటు చేసి ఉంటే ఈ వెనుకబాటు చట్రం నుండి బయట పడేవారు. కనీస వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడేది. కార్మికునికి బలవంతంగా పని చేయాల్సిన అవసరం తప్పేది. కానీ అలా జరగలేదు. చట్టంలో మరో తీవ్రమైన అంశం వుంది. కార్మికుడు తక్కువ పని చేసాడని, సంస్థ నష్టాలలో నడుస్తున్నదని, కార్మికునికి ఇచ్చిన అప్పులు తిరిగి వసూలు చేసే పేరు మీద లేదా ఇతర కారణాలు చూపి కార్మికునికి ఇవ్వవలసిన వేతనంలో కోతలు పెట్టడానికి యాజమాన్యానికి హక్కు ఉంది. ఇటువంటి విధానాలు భారతదేశం లాంటి దేశాలలో యజమానులు ఉన్నత సామాజిక స్థాయిలో ఉండడం వలన, వారు కార్మికులను యథేచ్ఛగా దోచుకునే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. కార్మికుల వేతన బేరసారాల శక్తిని మరింత దెబ్బతీస్తుంది. వారు సంఘటితమయ్యే హక్కును నీరుగారుస్తుంది. చట్టంలో ‘కార్మికుల పర్యవేక్షక విధానం’ స్పష్టంగా లేక పోవడం వలన, ఏ సంస్థలు ఇందుకు బాధ్యత వహిస్తాయో స్పష్టం చేయక పోవడం వలన కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా మారే అవకాశాలను ఈ చట్టం కల్పిస్తున్నది.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ఆధ్వర్యంలో కార్మిక పర్యవేక్షక సదస్సు (1947) జరిగింది. ఇందులో పేర్కొన్న అంశాలను భారత దేశం కూడా అంగీకరించింది. కార్మికుల పని ప్రదేశాన్ని పర్యవేక్షకులు స్వతంత్రంగా పర్యవేక్షించడానికి తగినంత స్వేచ్ఛ, అవసరమైనన్ని వనరులు ఏర్పరచాలి. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి ముసాయిదాలో ‘పర్యవేక్షక విధానం’ అంటూ అస్పష్టమైన, తాత్కాలికమైన కొత్త విధానాన్ని నేటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వేతనాల కోతల భయంతో కార్మికులు కనీస వేతనాన్ని సైతం డిమాండ్‌ చేసే పరిస్థితి ఇకపై ఉండదు. అందువలన ఇకపై కూడా అణచి వేయబడుతూనే ఉంటారు. తక్కువ వేతనాలకు పని చేస్తూనే ఉంటారు. గత వర్షాకాల సమావేశాలలో ఈ వేతన బిల్లును హడావుడిగా ప్రవేశ పెట్టి, పాస్‌ చేయించుకోవడాన్ని బట్టే అందులోని విధానాలు కార్మిక వ్యతిరేకమైనవని తెలిసిపోతోంది.

భారతదేశంలో రోజువారీ బతుకీడ్చడమే కష్టమవుతున్నందు వలన, లక్షలాది కార్మికులకు నిరంతరం జీవన పోరాటం చేయడానికే సమయం సరిపోతున్నందు వలన ఈ విషయాలు ఎక్కువగా చర్చకు నోచుకోలేదు. పైగా ఇక్కడ శ్రమజీవులను యాజమాన్యంతో, అధికార గణంతో పోల్చి చూసినప్పుడు వారు సామాజికంగా వెనకబడిన తరగతులవారై ఉంటారు.
అత్యధిక ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా న్యాయం చేకూరుస్తుం దని ఆశించిన చట్టం వారిని మరింత దోపిడీకి గురిచేస్తుండడం నిరుత్సాహ పరుస్తుంది. శ్రామికులకు గౌరవప్రదమైన, సమంజసమైన వేతనాలు ఇప్పిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులకు ఉండాలి. ‘2019 కార్మిక వేతనాల కోడ్‌’, ముసాయిదా నిబంధనలు… 50 కోట్ల అసంఘటిత కార్మికుల ఆశలపై నీళ్లు చల్లాయి. వారి జీవితాలను ఛిద్రం చేశాయి. కార్మికులు దేశ సంపద. వారి యోగక్షేమాలను నిర్లక్ష్యం చేయడం అతి పెద్ద దేశ ద్రోహం.

(Courtesy Prajashakti)

RELATED ARTICLES

Latest Updates