విశాఖలో అసలేం జరిగిందో తెలుసా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా విలయం నుంచి కోలుకోకముందే ‘విశాఖపట్నం గ్యాస్ లీకేజీ’ దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. చిన్నాపెద్దా అంతా కలిపి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, వేల మంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాబోయే రాజధానిగా భావిస్తోన్న విశాఖపట్నం సిటీకి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది రాజా రత్నం వెంకటాపురం(ఆర్ఆర్ వెంకటాపురం) గ్రామం. అక్కడి ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లో ‘స్టెరీన్’ అనే విషవాయువు లీకేజీనే ప్రమాదానికి అసలు కారణంగా పోలీసులు చెబుతున్నారు. అంతటి ప్రమాదకర స్టెరీన్ గ్యాస్ ను దేనికోసం వాడుతున్నారు?, అసలా ప్లాంట్ లో ఏం తయారు చేస్తున్నారు? ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఓ లుక్కేద్దాం.. 

మనం రోజూ వాడే వస్తువులే..
విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన గురించి చదివేటప్పుడు.. ఆ ప్రమాదం జరిగిన ‘ఎల్జీ పాలిమర్స్’ గురించి ఓ క్లారిటీ అవసరం. మనందరం ఇళ్లలో వాడే ఎల్జీ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్.. తదితర ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తయారు చేసే సౌత్ కొరియన్ కంపెనీకి సిస్టర్ కంపెనీయే ఈ ‘ఎల్జీ కెమ్’. ఆ సంస్థకు మన దేశంలో 20కిపైగా ప్లాంట్లు ఉన్నాయి. అందులో ఒకటే విశాఖ ఆర్ఆర్ వెంటాపురంలోని ప్లాంట్. 200 పైచిలుకు ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాంట్‌లో ప్రధానంగా పాలిస్టెరీన్, సింథటిక్ ఫైబర్ ను తయారు చేస్తారు. మనం నిత్యజీవితంలో వాడే ప్లాస్టిక్ వస్తుల్లో మెజార్టీ శాతం పాలిస్టెరీన్ నుంచి తయారైనవే. ఫుడ్ ప్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్ డబ్బాల నుంచి టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితర పరికరాల్లో వాడే ప్లాస్టిక్ వస్తులునూ పాలిస్టెరీన్ తోనే రూపొందిస్తారు. ప్లాస్టిక్ వేస్టేజీతో ప్రమాదాలకు పక్కనపెడితే, మానవాళి మనుగడలో పాలిస్టెరీన్ వాడకం నిత్యావసరంగా తయారైంది. మన అవసరాలు తీర్చే ఈ వస్తువులను స్టెరీన్ అనే పదార్థం నుంచి తయారు చేస్తారు. ఈ విశ్వంలో ప్రతీదీ కెమికల్ కాంపోనెంటే అన్న సంగతి మనకు తెలిసిందే. విశ్వంలో ఇప్పటిదాకా కనిపెట్టిన 118 మూలకాల్లో ఒకటైన బెంజీన్ నుంచి పుట్టిందే ఈ స్టెరీన్ అనే కెమికల్ కాంపోనెంట్. చాలా ఏళ్ల కిందట శాస్త్రవేత్తలు స్వీట్‌గమ్ చెట్ల నుంచి జిగురు రూపంలో స్టెరీన్ ఉత్పత్తికావడాన్ని సైంటిస్టులు గుర్తించారు. తర్వాతి కాలంలో పారిశ్రామికంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ స్టెరీన్ తియ్యటి వాసన అలాగే కొనసాగింది.

స్టెరీన్ వర్సెస్ పాలిస్టెరీన్
గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారినట్లు.. అత్యంత ప్రమాదకరమైన స్టెరీన్‌(కెమికల్ ఫార్ములా C6H5CH=CH2) ను నిర్ధిష్టవిధానంలో ప్రాసెస్ చేయడం ద్వారా మనందరం వాడుకునే పాలిస్టెరీన్(కెమికల్ ఫార్ములా (C8H8)n) పుడుతుంది. రసాయన సంబంధిత విషయాలు చాలా వరకు మన కంటికి కనిపించవు. కానీ వాటి ఫలితాల్ని అనుభవిస్తుంటాం. ఉదాహరణకు అణువిద్యుత్ ఉత్పత్తి ప్లాంట్స్ లో యురేనియం అణువుల మధ్య కంటికి కనబడని హైడ్రామా సాగుతుంది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులోనూ అలాంటిదే జరిగింది. అత్యధిక ఉష్ణోగ్రత ఉండే బాయిలర్లలో.. స్టెరీన్ లిక్విడ్ గ్యాస్ లోని కార్బన్ అణువులు బాగా వేడెక్కి, కొత్త రసాయన బంధాలు ఏర్పడి పాలిస్టెరీన్ తయారవుతుంది. అలాంటి గ్యాస్ లీకైనప్పుడు..మోస్ట్ ఎఫెక్టెడ్.. ఫెవీ స్టిక్ ఎలాగైతే గాలి సోకగానే గడ్డకట్టి పోతుందో.. స్టెరీన్ గ్యాస్ పీల్చుకున్నప్పుడు మన అవయవాలు కూడా దాదాపు అలానే అవుతాయని నిపుణులు చెబుతున్నారు. దాన్ని పీల్చినవెంటనే మనకు విపరీతమైన ఇరిటేషన్ పుడుతుంది, తలనొప్పి, వినికిడి సమస్య, కళ్లు మంటలు, కొన్నాసార్లు చూపు కోల్పోయే ప్రమాదం కూడా సంభవిస్తుంది. దీన్ని ఎక్కువ సేపు పీల్చితే మన కణజాలాన్ని పాడైపోయి, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయనే వాదన ఉంది. స్టెరీన్ గ్యాస్ ప్రభావం మనుషులకంటే మూగజీవాలపైనే ఎక్కువగా ఉంటుంది.

విశాఖలో వేలాది కుక్కలు, బర్రెలు, పిల్లులు ఇతరత్రా జీవాల పరిస్థితి మన కళ్లముందే ఉంది. పాలిస్టెరీన్ తయారీకి స్టెరీన్ గ్యాస్ వాడటంపై మొదటి నుంచీ భిన్నవాదనలు ఉన్నాయి. స్టెరీన్ విషయవాయువు దీర్ఘకాలికంగానూ ప్రభావం చూపుతుందని కొందరు సైంటిస్టులు అంటున్నారు. అమెరికాలో ఆటిజం బారిపడుతోన్న పిల్లల్లో 60 శాతం మంది స్టెరీన్ గ్యాస్ పీల్చడం వల్లే రుగ్మతకు లోనవుతున్నట్లు రిపోర్టులు ఉన్నాయి. దీనిపై ఇప్పటికీ అడపాదడపా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వాలు, కెమికల్ బోర్డులు మాత్రం స్టెరీన్ తో పాలిస్టెరీన్ తయారీ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఘంటాపథంగా చెబుతున్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు, కార్పొరేట్లు స్టెరీన్ కు సంబంధించిన అసలు నిజాల్ని ప్రజలకు చెప్పడంలేదని, దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచడంలేదనే ఆరోపణలున్నాయి. ఆరోపణలు కూడా ఉన్నాయి.

తర్వాతేంటి?
గతంలో భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులకు ఇప్పటిదాకా సరైన సహాయం అందలేదు. ప్రస్తుతం మనదేశంలో పాలిస్టెరీన్ తయారీలో ఎల్జీ కెమికల్ కంపెనీ ప్రధాన పాత్రపోషిస్తున్నది. ఏపీ సీఎం జగన్ ఒక్కో బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. అయితే ప్రపంచంలోనే బడా కార్పోరేట్లలో ఒకటైన ఎల్జీ కంపెనీపై ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయా? లేదా? అనేది ఇంకొద్ది రోజుల్లో తేలనుంది. లాక్ డౌన్ కారణంగా 40 రోజులకుపైగా మూతపడ్డ ప్లాంటును గురువారం పున:ప్రారంభించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కెమికల్ నిపుణుల ఆధ్వర్యంలో జరగాల్సిన పనిని అల్లాటప్పాగా చేపట్టినందుకే స్టెరీన్ గ్యాస్ లీకైనట్లు తెలిసింది.

  • వెంకట్రావు మోర్లా ఫేస్‌బుక్‌ పేజీ నుంచి

RELATED ARTICLES

Latest Updates