వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌; 11 మంది మృతి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

విశాఖపట్నం: జనమంతా నిద్ర మత్తులో ఉండగా విషవాయువు విశాఖ వాసులపై దండెత్తింది. బహుళజాతి కంపెనీ నుంచి బయటకు వచ్చిన కూలకూట విషం అమాయకుల ప్రాణాలు తీసింది. ఏం జరుగుతుందో తెలియక విశాఖ వాసులు విలవిల్లాడారు. విష వాయువు ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఎక్కడివారక్కడ నిలువెల్లా కుప్పకూలిపోయారు. కళ్లనూ రసాయన ఘాటు కబలించడంతో చుట్టూవున్న పరిసరాలు కనబడక మరికొందరు మృత్యువాత పడ్డారు. పండు ముసలి నుంచి పసిగుడ్డు వరకు విషకోరల్లో చిక్కుకుని అంతులేని బాధను అనుభవించారు. మనుషులతో పాటు మూగ జీవాలు మాయాదారి రసాయనానికి బలైపోయాయి. పచ్చని చెట్లు మాడిపోయాయి.విశాఖలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలీమర్స్‌ కర్మాగారం నుంచి ప్రమాదకరమై స్టైరీన్‌ అనే రసాయన వాయువు లీక్‌ కావడంతో ఈ పెను ప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషవాయువు బారిన పడిన 200 మందిపైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 నుంచి 30 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఎన్డీఆఫ్‌ఎఫ్ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ గురువారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. 80 మందిపైగా వెంటిలేటర్లపైనే ఉన్నారంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్‌ఆర్‌ వెంకటాపురం నుంచి 500 మందిని  ఖాళీ చేయించారు. ఎల్‌జీ పాలీమర్స్‌ యాజమాన్యం అలసత్వమే ప్రమాదానానికి కారణమని పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం
విశాఖలో విషవాయువు బారిన పడి కేజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు చొప్పున, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తామని తెలిపారు. చనిపోయిన ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లిస్తామని హామీయిచ్చారు. విశాఖ విషవాయువు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, వివిధ రంగాలు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదం నుంచి విశాఖ వాసులు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Latest Updates