ఊడిన లక్ష కొలువులు..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Image result for ఊడిన లక్ష ఉద్యోగాలు !"– వాహన విడిభాగాల పరిశ్రమకు తీవ్ర గడ్డుకాలం
– గతంలో ఎన్నడూలేని విధంగా తగ్గిన టర్నోవర్‌
– గణనీయంగా పడిన సామర్థ్యపు వినియోగం..!
– ప్రభావం చూపుతున్న తీవ్ర అనిశ్చిత పరిస్థితులు
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా దేశంలోని వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. డిమాండ్‌ పడిపోయి విక్రయాలు తగ్గిపోవడంతో ఈ పరిశ్రమల వారికి ఆర్డర్లు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమల టర్నోవర్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతింది. దీంతో ఈ రంగంలో దాదాపు లక్ష మంది తాత్కాలిక ఉద్యోగులు కొలువులు కోల్పోయినట్టుగా పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. మందగమన పరిస్థితుల నేపథ్యంలో వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమ మొత్తం టర్నోవర్‌ ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో 10.1 శాతం కుంగి రూ.1.99 లక్షల కోట్ల నుంచి రూ.1.79 లక్షల కోట్లకు పడిపోయిందని ”వాహనాల విడిభాగాల తయారీ అసోసియేషన్‌” (ఏసీఎంఏ) తెలిపింది. దీనికి తోడు మందగమనం కారణంగా పరిశ్రల దాదాపు రెండు బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులను కూడా కోల్పోయినట్టుగా ఏసీఎంఏ వివరించింది. అయితే కాస్త ఊరట కలిగించే అంశమేమిటంటే వాహన విడిభాగాల పరిశ్రల ఎగుమతుల్లో 2.7 శాతం వృద్ధి కనిపించినట్టుగా ఏసీఎంఏ తెలిపింది. అయినా ఈ వృద్ధి ఉద్యోగ తీసివేతలను నిలవరించలేకపోయిందని ఏసీఎంఏ వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ సెప్టెంబరు మధ్య కాలంలో వాహనాల విడిభాగాల దిగుమతులు 6.7 శాతం మేర తగ్గి రూ.57,674 కోట్లుగా నమోదయ్యాయని ఏసీఎంఏ వివరించింది. మందగమన పరిస్థితుల నేపథ్యంలో వాహనాల విడిభాగాల తయారీ సంస్థల సామర్థ్య వినియోగం 80 శాతం గరిష్టం నుంచి 50 శాతానికి పడిపోయిందని ఏసీఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆటోమొబైల్‌లో అంతా అనిశ్చితే..
వాహనాల కొనుగోళ్లలో స్తబ్ధత, బీఎస్‌ ప్రమాణాల మార్పునకు అనుగుణంగా విడిభాగాల తయారీకి కావాల్సిన మెషినరీ నిమిత్తం భారీగా పెట్టుబడులు పెట్టడం, నిర్వహణ నగదు కొరత, విద్యుత్‌ వాహనాలకు సంబంధించి సర్కారు ప్రకటించిన విధానంలో స్పష్టత లోపించడం వంటి అంశాలు వాహన విడిభాగా పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6 ప్రమాణాల విడిభాగాల తయారీకి మారేందుకు గాను వాహన పరిశ్రమ దాదాపు రూ.80,000 నుంచి రూ.90,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టుగా ఏసీఎంఏ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో విడిభాగాల తయారీ పరిశ్రమ వాటా రూ.30,000 కోట్ల నుంచి రూ.35000 కోట్ల వరకు ఉన్నట్టుగా ఏసీఎంఏ లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన జీఎస్టీ పన్ను విధానం కూడా పరిశ్రపై తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తోంది. దీంతో వాహన విడిభాగాల తయారీ పరిశ్రలు ఉద్యోగులను తగ్గించుకొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. వాహన విడిభాగాల తయారు చేసే వారు అత్యధికంగా ఎంఎస్‌ఎంఈ విభాగంలోని వారే కావడంతో కొలువులు కోల్పోయిన వారు కూడా అత్యధికం పేద, మధ్య తరగతి వారేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దీర్ఘకాలిక మందగమనంతో ఇబ్బంది..
దేశంలోని వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమ దీర్ఘకాలికంగా మందగమన పరిస్థితిని ఎదుర్కొంటోందని ఏసీఎంఏ అధ్యక్షుడు దీపక్‌ జైన్‌ తెలిపారు. అన్ని విభాగాల వాహన విక్రయాలలో గత ఏడాది కాలంలో కొనుగోళ్లు పడిపోతూ వస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం వాహన విడిభాగాలను తయారు చేసే పరిశ్రమలపై తీవ్రంగా ప్రతిబింబిస్తూ వస్తోందని దీపక్‌ జైన్‌ వివరించారు. వాహన విడిభాగాల తయారీ పరిశ్రమ ఎక్కువగా.. ఆటోమొబైల్‌ సంస్థల ఉత్పత్తిపైనే ఆధారపడుతూ వస్తుందని ఆయన అన్నారు. ఇటీవల ఆటో పరిశ్రమలు వాహనాల ఉత్పత్తిని 15-20 శాతం మేర తగ్గించుకుంటుండడంతో విడిభాగాల తయారీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం కనిపిస్తోందని ఆయన వివరించారు. 2013-14 మధ్య కాలంలో వాహనాల విడిభాగాల తయారీ పరిశ్రమల టర్నోవర్‌ తగ్గడం కనిపించిందని ఆయన అన్నారు. ఆ తరువాత మళ్లీ పరిశ్రమల అలాంటి గడ్డుకాలాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని జైన్‌ వివరించారు. గడ్డు పరిస్థితుల నేపథ్యంలో గతేడాది అక్టోబరు నుంచి జులై మధ్య కాలంలో సంస్థలు భారీగా తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం జరిగిందని ఆయన అన్నారు. ఆయా పరిశ్రమల వారు తమ డిమాండ్‌ మేరకు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటూ వస్తున్న నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగుల ఉద్యోగాలు కొండెక్కాయని ఆయన అన్నారు.
 (Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates