పర్యావరణం పెను విధ్వంసం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Image result for Uranium mining kadapaకడప జిల్లా ఎం.తుమ్మలపల్లెలో కాలుష్యాన్ని ఏ వ్యవస్థా పట్టించుకోవడంలేదు
పునరుత్పాదక వనరులెన్నో వస్తున్నాయ్‌
ప్రస్తుత పరిస్థితుల్లో యురేనియం అవసరమేంటి?
పర్యావరణ నిపుణులు బాబూరావు
పంటలను, పర్యావరణాన్ని ఛిద్రం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎం.తుమ్మలపల్లెలో సాగుతున్న యురేనియం ఉత్పత్తిపై పర్యావరణవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై పట్టించుకున్నవారే లేకపోయారని.. అధికార యంత్రాంగం దీనిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పర్యావరణ నిపుణులు కె.బాబూరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన ఎం.తుమ్మలపల్లెలో యురేనియం కారణంగా భూగర్భం విషతుల్యం అవుతుండటంపై తొలినుంచీ అధ్యయనం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల అంశంపై ‘ఈనాడు’తో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలివి..
అణు విద్యుత్తు అవసరమేముంది?
ప్రపంచమంతటా ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్‌ వనరులు బాగా అందుబాటులోకి వస్తున్న తరుణంలో అణు విద్యుత్తు అవసరాల కోసం యురేనియం తవ్వకాలకు ఆరాటపడాల్సిన పనేలేదు.
ప్రభుత్వ శాఖల వైఫల్యమిది..
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి.. రెండూ తాము పెట్టిన నిబంధనలను యురేనియం కార్పొరేషన్‌తో అమలు చేయించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. అందుకే ఎం.తుమ్మలపల్లెలో ఇంతటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆ విషాన్ని 2017లోనే గుర్తించా..
ఎం.తుమ్మలపల్లె వద్ద భూగర్భజలం కలుషితం కావడాన్ని నేను 2017లోనే గుర్తించా. దీనిపై అప్పటి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించా. ఫలితమే లేదు. మొదట ఒక రైతుకు జరిగిన నష్టం బయటకు వచ్చినప్పుడు ఇతరులెవరిలోనూ స్పందనలేదు. ప్రమాదం విస్తరించడం మొదలు కాగానే జనం ఆందోళనలు నిర్వహించారు. దీనిపై అప్పట్లో రైతులతో కలిసి యురేనియం సంస్థ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. రైతులకు నచ్చచెప్పేందుకు బార్క్‌ నుంచి శాస్త్రవేత్తలను రప్పించింది. రైతుల కోరిక మేరకు వారి తరఫున.. సైన్సు తెలిసిన నేను వెళితే పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
ఆ దేశాల్లో ఉన్న వ్యవస్థలు మనకేవి?
వివిధ ఖనిజాల తవ్వకాల వల్ల కలిగే ప్రభావాన్ని మదింపు చేసేందుకు అభివృద్ధి చెందిన దేశాల్లో జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. మన దగ్గర అలాంటివి లేవు. ఉదాహరణకు అమెరికాలో ఇలాంటి సందర్భం వస్తే రైతులకు జరిగే నష్టంపై ప్రభుత్వమే శాస్త్రీయంగా అంచనా వేయిస్తుంది. ఇందుకోసం ‘నేషనల్‌ క్రాప్‌ లాస్‌ అసెస్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌’ అనే వ్యవస్థ ఉంది. మనవద్ద ఎం.తుమ్మలపల్లెలో రైతులకు జరుగుతున్న నష్టం గురించి పట్టించుకునే దిక్కేలేదు.
తెలంగాణలో 2003లోనే ప్రయత్నాలు
తెలంగాణలోని పెద్దగట్టు, లంబాపూర్‌లలో యురేనియం తవ్వకాలకు 2003-05లోనే ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో పెద్దగట్టులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో తమ వ్యతిరేకతను వ్యక్తం చేసిన ప్రజలపై దాడులు జరిగాయి. పెద్దఅడిశర్లపల్లిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ ప్రతినిధిగా వచ్చిన దీపక్‌ అరుణ్‌ ఆత్రేయ ఆ ప్రాంతం రాజీవ్‌ పులుల రక్షిత ప్రాంతం సమీపాన ఉంది కాబట్టి అక్కడ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇటీవల కేంద్రం గతంలో గనులకు ఇచ్చిన అనుమతుల కాలవ్యవధి పొడిగించడంతో తెలంగాణలో మళ్లీ తవ్వకాలు చేయాలని యురేనియం సంస్థ చూస్తోంది. తెలంగాణ ప్రజల్లో చైతన్యం ఎక్కువ. తవ్వకాలను వీరు వ్యతిరేకిస్తారనే అనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూడాలి.
నిపుణుల్లేని టాస్క్‌‘ఫార్సు’
యురేనియం ఉత్పత్తి వల్ల వచ్చే ప్రమాదకర వ్యర్థాలను నిల్వ చేసేందుకు రూపొందించిన చెరువు తగిన రక్షణ ఏర్పాట్లతో లేదని నేను గుర్తించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి, యురేనియం కార్పొరేషన్‌కు వినతిపత్రాలు పంపా. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేసిన వారే లేరు. కాలుష్య నియంత్రణ మండలి జులైలో ఒక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసి దానితో సమావేశానికి యురేనియం సంస్థ పత్రినిధులనూ పిలిచింది. ఆ టాస్క్‌ఫోర్స్‌లో సరైన నిపుణులే లేరు. ఆ సమావేశం ఎంతో మొక్కుబడిగా.. అదీ విజయవాడలో జరిగింది. సమస్య పరిష్కారానికి ఏం చేయాలో 3 నెలల్లో నివేదిక తయారు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఏడాది దాటినా ఇప్పటివరకూ నివేదికే తయారు కాలేదు. దీనిని బట్టే మన అధికారయంత్రాంగం ఎంతటి నిర్లక్ష్యంగా ఉన్నదో అర్థమవుతుంది.

(Courtacy Eenadu)

RELATED ARTICLES

Latest Updates