ఉద్యోగ పోరు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఐదేండ్లలో భారీగా పెరిగిన నిరుద్యోగిత రేటు
– రఘుబర్‌దాస్‌ పాలనలో పారిశ్రామిక రంగం కుదేలు
– ఆకలితో అలమటిస్తున్న పేదలు
– జార్ఖండ్‌లో బీజేపీ పతనానికి ఇదే నాంది కానుందా…?

రాంచీ : అపారమైన అటవీ సంపద, ముడి ఖనిజాలు, ఇనుము, ఉక్కు గనులు అధికంగా ఉన్న జార్ఖండ్‌ గడిచిన ఐదేండ్ల బీజేపీ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. నిరుద్యోగ సమస్య ఆ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నది. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ పాలన పూర్తిగా గాడి తప్పిందని స్వయంగా ఆయన క్యాబినెట్‌ మంత్రులే ఆరోపణలు చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పారిశ్రామికరంగం కుదేలై, ఉద్యోగాలు పోయి, ఉపాధి లేక యువత రోడ్లమీదకు వస్తున్నారు. 2011-12లో 2.5 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు 2017-18 నాటికి ఏకంగా 7.7 శాతానికి చేరుకోవడమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్‌లో బీజేపీ పాలనపై నిరుద్యోగులు, అసంఘటితరంగ కార్మికులతో పాటు సాధారణ ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

ఐదు విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే మూడు విడతలు ముగిశాయి. ఇటీవల జార్ఖండ్‌లోని ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘బీజేపీ సర్కారు కృషి వల్లే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు రోడ్లు, విద్యుత్తు సదుపాయాలు కల్పించాం. కొత్తగా వేసిన రోడ్ల కారణంగా రవాణా సదుపాయాలు మెరుగై, ఉపాధికి కొత్త మార్గాలు పడ్డాయి’ అని తెలిపారు. కానీ వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. జార్ఖండ్‌లో మొత్తం 3 కోట్ల జనాభా ఉండగా వారిలో 50 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. మిగిలిన వారు మైనింగ్‌, సేవారంగం మీదే ఆధారపడ్డారు. అయితే రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. ఇటీవలే విడుదలైన నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) నివేదిక ప్రకారం.. 2011-12లో 2.5 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2017-18 నాటికి 7.7 శాతానికి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువ (బీపీఎల్‌)న ఉన్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. రాష్ట్ర జనాభాలో 39 శాతం మంది వీరే ఉండటం గమనార్హం. ఇది జాతీయ సగటు (29.8 శాతం) కంటే దాదాపు పదిశాతం ఎక్కువే. ఇదిలాఉండగా రేషన్‌కార్డులు లేక ఆకలితో అలమటించిన మరణించిన వారు జార్ఖండ్‌లోనే (సుమారు 30 మంది) అధికంగా ఉండటం గమనార్హం.

ఉద్యోగ పోరు
ఆర్థిక మందగమనంతో రాష్ట్రంలో ప్రధాన పరిశ్రమలైన ఇనుము, ఉక్కు, మైనింగ్‌ పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఈ ఏడాది గడిచిన ఐదు నెలల్లో జంషెడ్‌పూర్‌, రాంగఢ్‌, కొడెర్మ, రాంచీలలో ఉన్న దాదాపు 125 ఉక్కు పరిశ్రమలు మూతపడ్డాయి. స్టీల్‌ డిమాండ్‌ పడిపోవడంతో ఆయా సంస్థలన్నీ ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి. దీంతో ఈ రంగంలో పనిచేస్తున్న వేలాది కార్మికులు రోడ్డున పడ్డారు. మరోవైపు ఆదిత్యాపూర్‌లో సుమారు వేయి దాకా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు బంద్‌ అయ్యాయని మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆరోపించారు. ఫలితంగా 20 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన అన్నారు.

టెల్కో, హిందాల్కొ, గిరిధ్‌ వంటి బడా సంస్థలు సైతం మందగమనాన్ని తట్టుకోక ఉత్పత్తిని నిలిపేస్తున్నాయని సోరెన్‌ విమర్శించారు. ‘ఉన్న పరిశ్రమలే మూతపడుతుంటే మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడుల సమావేశం పేరిట బీజేపీ సర్కారు రూ. 900 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో దాదాపు 300 మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారు. కానీ ఇప్పటివరకూ ఒక్క సంస్థ కూడా తన కార్యకలాపాలను ప్రారంభించలేదు’ అని జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ ఆరోపించారు.

పనిలేదు : కార్మికులు, నిరుద్యోగులు
రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితిపై రాంచీకి చెందిన రాకేశ్‌ స్పందిస్తూ.. ‘జార్ఖండ్‌లో ఈ రోజు ఉద్యోగాలేమీ లేవు. ఇదే మా ప్రధాన సమస్య. రఘుబర్‌దాస్‌ ప్రభుత్వం మాకు ఉపాధిని కల్పించడంలో పూర్తిగా విఫలమైంది’ అని అన్నాడు. జంషెడ్‌పూర్‌ ఇండిస్టియల్‌ హబ్‌లో పనిచేస్తున్న శివశంకర్‌ అనే కార్మికుడు మాట్లాడుతూ.. ‘గతంలో మాకు పని భాగా దొరికేది. దానితో కుటుంబం గడిచేది. కానీ ఇప్పుడా పరిస్థితుల్లేవు. ఆర్థిక మందగమనంతో సంస్థలన్నీ మూతపడు తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పూట గడవడమే కష్టంగా ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోమొబైల్‌ రంగానికి చెందిన అశోక్‌ మాట్లాడుతూ.. ‘మాంద్యం కారణంగా ఆటోమొబైల్‌ సంస్థలన్నీ మూసివేస్తున్నారు. దీంతో మమ్మల్ని ఇంటికి పంపేస్తున్నారు. మేం బతికేదెట్లా’ అని ప్రశ్నిస్తున్నారు.

పార్టీల హామీలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తే 2024 నాటికి జార్ఖండ్‌ను ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్‌ హబ్‌గా మారుస్తామని బీజేపీ చెబుతున్నది. అంతేగాక రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్నది. ఇక తమను గెలిపిస్తే బీపీఎల్‌ దిగువన ఉన్న కుటుంబంలోని ప్రతివ్యక్తికీ ఉద్యోగం కల్పిస్తామనీ, ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని 75 శాతం మందికి ప్రయివేటురంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) చెబుతున్నది. దీంతోపాటు నిరుద్యోగ భృతిని కల్పిస్తామని పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చింది.

ముగిసిన మూడో విడత
ఐదు విడతలుగా సాగుతున్న జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో విడత ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 62.03 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. 17 నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ ఎన్నికల్లో 309 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 17 నియోజకవర్గాల్లో బీజేపీ 9 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్‌, జేఎంఎం చెరో రెండు సీట్లు గెలిచాయి. కాగా, వీటిలో మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు రెండు ఉండటంతో అధికారులు అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. నాలుగో విడత ఎన్నికలు ఈనెల 16న జరగనుండగా 23న ఫలితాలు వెలువడున్నాయి.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates