ఉపాధికి కరోనా కాటు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • రాష్ట్రంలో చురుగ్గా పనుల్లోకి వచ్చే కూలీలు 60లక్షలు
  • మినహాయింపున్నా.. ప్రస్తుతం పనిచేస్తున్నది 5.31లక్షలు
  • గతేడాది ఇదే సమయానికి పనుల్లో 8 లక్షల మంది

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ ఆంక్షలు, కరోనా భయం.. వెరసి ఉపాధి కూలీలు బేజారవుతున్నారు. లాక్‌డౌన్‌ నుంచి ఉపాధి హామీ పనులకు మినహాయింపునిచ్చినా కూలీలు రాకపోవటంతో ఆశించినంతగా పనులు సాగడం లేదు. సాధారణంగా ఏటా మార్చిలో రోజుకు సగటున 5లక్షలు, ఏప్రిల్‌లో 8లక్షల కూలీలు పనులకు వచ్చేవారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన రెండు రోజుల నుంచి ఏప్రిల్‌ 13 వరకు రోజుకు 50వేల నుంచి 60వేల మంది మాత్రమే హాజరయ్యారు. గత ఐదు రోజుల్లోనే కూలీల హాజరు 5లక్షలు దాటినా, గతేడాదితో పోలిస్తే ఇది చాలా తక్కువ.

రాష్ట్రంలో 1.09కోట్ల ఉపాధి కూలీలు నమోదై ఉండగా, వీరిలో దాదాపు 60లక్షల మంది చురుగ్గా ఉన్నారు.మూడేళ్ల వ్యవధిలో ఒక్కరోజు పనికి హాజరైనా వారిని చురుగ్గా ఉన్న కూలీగా పరిగణిస్తారు.  బ్యాచ్‌ల వారీగా పనులు కల్పించినా కనీసం 10లక్షల మంది రోజూ పనులకు రావాలి. కానీ క్షేత్రసహాయకుల సమ్మె పనులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మార్చి 12న సమ్మె మొదలైన నేపథ్యంలో పని కల్పించే బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించినా పెద్దగా ఫలితం దక్కలేదు. చెరువుల పూడికతీత, కందకాల తవ్వకం, రోడ్లు చదునుచేయటం వంటి పనులన్నీ బృందాలుగా కలిసి చేయాల్సినవే.. ఇది కూడా కూలీలు పనుల్లోకి రాకపోవడానికి కారణమని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదే సమయంలో వ్యవసాయ పనులూ మొదలుకావటం ఉపాధి పనులపై ప్రభావం చూపిందని ఆయన చెప్పారు.

గత ఐదేళ్లలో ఇలా…
గత ఆర్థిక సంవత్సరం 13.92 కోట్ల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం కాగా, కేవలం 9.75 కోట్ల పనిదినాలే చూపారు. ఐదేళ్లలో అతి తక్కువ పనిదినాలు ఈ ఏడాదే నమోదయ్యాయి. 2018-19 సంవత్సరానికి 11,77,29,000 పనిదినాలు ఇచ్చారు. గతేడాది అంతకన్నా ఎక్కువ పని చూపించాల్సి ఉండగా ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమ్మె, కరోనా తీవ్రత నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. 2020-21కి మళ్లీ 13కోట్ల పనిదినాలను కేటాయించారు.

ఉపాధి పనులపై మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్‌: ఉపాధి కూలీలు పని ప్రాంతంలో ఒక్కొక్కరి మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ రఘునందన్‌రావు శనివారం మార్గదర్శకాలు విడుదల చేశారు. కంటెయిన్‌మెంట్‌ జోన్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో పనులు ప్రారంభించొద్దన్నారు. కూలీలందరికీ ఒకే ప్రదేశంలో కాకుండా వేర్వేరు చోట్ల పనులు కల్పించాలన్నారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, జలబు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, పనికి హాజరుకాకుండా స్వీయ నిర్బంధంలో ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా కార్యక్రమ సమన్వయకర్తలు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates