ఇద్దరికి కరోనా లక్షణాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హైదరాబాద్‌ : కర్ణాటకకు చెందిన 76 సంవత్సరాల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయాడు. దేశంలోనే ఇది కరోనా వైరస్‌ కారణంగా సంభవించిన తొలి మరణంగా నిర్ధారించారు. దాంతో, అతను ఎవరెవరిని కలిశాడనే వివరాలను వైద్య ఆరోగ్య శాఖ సేకరించింది. గురువారం రాత్రే మొత్తం 34 మందిని గుర్తించింది. వీరందరినీ ఐసొలేషన్‌లో ఉంచింది. వీరిలో ఇద్దరికి ఇప్పటికే కరోనా లక్షణాలు మొదలైనట్లు సమాచారం. వెంటనే, అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారందరి నమూనాలను సేకరించినట్లు తెలుస్తోంది. శనివారం నాటికి వారి ఫలితాలు వస్తాయంటున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకలేదు. తాజాగా వృద్ధుడు మరణించడం.. అతను కలిసిన ఇద్దరిలో లక్షణాలు బయటపడటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

వికారాబాద్‌, దూలపల్లిల్లో ఏకాంతవాసం
కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ 14 రోజులపాటు క్వారంటైన్‌ (ఏకాంత వాసం) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం (మార్చి 13) అర్ధరాత్రి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రస్తుతం 126 దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఏడు దేశాల (చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌) నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడినీ ప్రభుత్వమే క్వారంటైన్‌ చేయనుంది. ఆ సమయంలో వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించనుంది. ఇందుకు వికారాబాద్‌లోని హరిత హోటల్‌; దూలపల్లిలోని ఫారెస్టు అకాడమీని సిద్ధం చేసింది.  రిసార్ట్స్‌లోని పర్యాటకులను ఖాళీ చేయించి వాటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరుగా విమానాశ్రయం నుంచే వారిని కరోనా కేంద్రాలకు తరలిస్తారు. ప్రయాణికుల్లో కరోనా అనుమానిత లక్షణాలుంటే వారిని ఐసొలేషన్‌లో ఉంచుతారు. లక్షణాలు లేకపోయినా 14 రోజులపాటు ఏకాంతవాసం తప్పనిసరి. తద్వారా, కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చన్న యోచనలో సర్కారు ఉంది. అవసరాన్నిబట్టి వీటితోపాటు ప్రభుత్వ శిక్షణ కేంద్రాలను కూడా క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చనుంది. అయితే, పర్యాటక కేంద్రమైన హరిత రిసార్ట్స్‌లో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రినీ అధికారులు పరిశీలించారు.

104కు తాకిడి
అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ఫోన్‌ నంబర్లను విమానాశ్రయం నుంచి సేకరించారు. వారందర్నీ ఇంటి వద్దే ఐసొలేషన్‌లో ఉంచారు. ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ హెల్ప్‌లైన్‌ నుంచి 3000 మందికి ఉదయం, సాయంత్రం ఫోన్‌ చేస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. మరోవైపు, ఇంటి వద్దే ఐసొలేషన్లో ఉండే విదేశీ ప్రయాణికులందరికీ కలిపి వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేయనున్నారు.  కాగా, కరోనాకు సంబంధించి 104 హెల్ప్‌లైన్‌ నంబరుకు వచ్చే ఫోన్‌ కాల్స్‌ రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం మొత్తం 1800 కాల్స్‌ రాగా.. కరోనాకు సంబంధించినవే 250పైగా వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇటీవల కొంతమంది కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. వారందరికీ నెగెటివ్‌ వచ్చింది. దాంతో, తమకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ వారంతా శుక్రవారం గాంధీ ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు. వారంతా హైదరాబాద్‌లో పని చేస్తున్న సౌదీ దేశీయులు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే సౌదీ వెళ్లే వీలుంటుందని చెప్పా రు. ప్రభుత్వం నుంచి  ఆదేశాలు లేవని, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని సూపరింటెండెంట్‌ స్పష్టం చేయడంతో వెళ్లిపోయారు.

కరోనాపై కేసీఆర్‌ సమీక్ష
కరోనాపై సీఎం కేసీఆర్‌ అసెంబీల్లో సమీక్ష చేశారు. మంత్రి ఈటల, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ శాంతికుమారిలతో కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా, సీఎం కేసీఆర్‌ వారికి కొన్ని ముఖ్య ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. శనివారం శాసనసభలో కరోనాపై స్వల్పకాలిక చర్చ ఉండటంతో దానిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీలో కలకలం
పిగ్‌ బ్రీడింగ్‌ పాలసీపై మంత్రి కేటీఆర్‌తో మాట్లాడేందుకు కెనడా దేశీయుడు, ఆ దేశ పోలార్‌ జెనెటిక్స్‌ అధ్యక్షుడు ఆల్‌ఫ్రెడ్‌ వాల్‌ శుక్రవారం అసెంబ్లీ లాబీల్లోకి వెళ్లారు. మంత్రి కేటీఆర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. కెనడాలో కరోనా విజృంభిస్తుండడం, ఆ దేశ ప్రధాని భార్యకే సోకిన నేపథ్యంలో ఆల్‌ఫ్రెడ్‌ రావడం చర్చనీయాంశమైంది.

26 మంది నమూనాల సేకరణ
కరోనా అనుమానిత లక్షణాలతో శుక్రవారం 26 మంది ఆస్పత్రిలో చేరారు. వారందరి నమూనాలను సేకరించారు. వాటిలో మూడింటి ఫలితాలు నెగెటివ్‌ రాగా.. మిగిలిన  ఫలితాలు రావాల్సి ఉంది. అలాగే, శంషాబాద్‌ విమానాశ్రయంలో 3,654 మందికి స్ర్కీనింగ్‌ చేశారు. వారిలో 143 మందికి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. 117 మందిని ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంచారు. ఇక, ఖమ్మంలో ఇద్దరికి, జగిత్యాలలో ఒకరికి లక్షణాలు కనిపించగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల సౌదీ నుంచి వచ్చిన ఇద్దరు ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. అలాగే, దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి  కరో నా లక్షణాలు కనిపించడంతో గాంధీకి తరలించారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates