ప్రాణాలైనా ఇస్తాం… భూములను వదులుకోం..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-భూసేకరణకు వ్యతిరేకంగా గుజరాత్‌లో గిరిజనుల ఆందోళన

అహ్మదాబాద్‌ : నట్వర్‌ తాడ్వి (55) చేతిలో కిరోసిన్‌ డబ్బాతో ఆందోళనకు దిగారు. మా భూముల జోలికి వస్తే ఊరుకోం.. ప్రాణాలైనా అర్పిస్తాం.. భూములను మాత్రం వదులుకోం… అంటూ అతనితో పాటు వందలాదిమంది గిరిజనులు… పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో సర్దార్‌ సరోవర్‌ నర్మదా నిగమ్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌ఎన్‌ఎన్‌ఎల్‌) చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా గిరిజన ప్రాంతంలో వెల్లువెత్తిన ఆగ్రహమిది. నర్మదా జిల్లాలోని కెవాడియా కాలనీలోని ప్రధాని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘యూనిటీ ఆఫ్‌ స్టాట్యూ’ చుట్టుపక్కల గ్రామాల్లోని గిరిజనుల్లో తాద్వి ఒకరు. విగ్రహం చుట్టుపక్కల ఇతర ప్రాజెక్టుల కోసం భూముల సేకరణను వ్యతిరేకిస్తూ అక్కడి గిరిజనులు దాదాపు నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ చుట్టూ పర్యాటక సంబంధిత ప్రాజెక్టుల కోసమే తమ భూమిని లాక్కుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.

‘వ్యవసాయం చేసుకునే మా భూములకు కంచె వస్తే.. మాకు జీవనోపాధి ఉండదు’ అని తాడ్వి ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, నిరసన ప్రాంగణంలో మోహరించిన పోలీసులు కిరోసిన్‌ చేతపట్టుకున్న తాడ్వీని నిలువరించారు. కిరోసిన్‌ డబ్బాను స్వాధీనం చేసుకొని, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

నెల రోజులుగా ఆందోళన
ఐక్యతా విగ్రహం ఉన్న సాధుబెట్‌లోని కెవాడియా కాలనీ చుట్టూ ఉన్న బహిరంగ స్థలంలో కంచె వేసే పనిని మేలో ఎస్‌ఎస్‌ఎన్‌ఎన్‌ఎల్‌ పని ప్రారంభించింది. విగ్రహం చుట్టుపక్కల వున్న ఆరు గ్రామాలు నవగం, లింబ్డి, కెవాడియా, కోటి, గోరా, వాగహడియాల్లో నిరసనలూ అప్పటి నుంచే మొదలయ్యాయి. గత వారం ఎస్‌ఎస్‌ఎన్‌ఎన్‌ఎల్‌ ఫెన్సింగ్‌ పనిని వేగవంతం చేయటంతో గిరిజనులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆ సందర్భంగా కొందరు గిరిజనులను పోలీసులు అరెస్టు కూడా చేశారు. కాగా, నెల రోజులుగా ఆందోళన కొనసాగుతుండటంతో ఎట్టకేలకు ఫెన్సింగ్‌ పనిని నిలిపివేసి.. జూన్‌ 5న స్థానికులను చర్చలకు పిలిచారు. కాగా, తమ భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని గిరిజనులు నొక్కి చెప్పారు.

మరోవైపు స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ చుట్టూ పక్కల ఆరు గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా అహ్మదాబాద్‌కు చెందిన పర్యావరణవేత్త మహేశ్‌ పాండ్యా గుజరాత్‌ హైకోర్టులో పిఐఎల్‌ దాఖలు చేశారు. పర్యాటక అభివద్ధి ప్రాజెక్టుల ముసుగులో 5,000 మందికి పైగా గిరిజనులను ఖాళీ చేయించటానికి ఎస్‌ఎస్‌ఎన్‌ఎన్‌ఎల్‌, గుజరాత్‌ ప్రభుత్వం కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. భూసేకరణ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోకుండా భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని పాండ్యా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసు విచారణ కొనసాగుతుండగా.. గిరిజనుల ఆందోళన కొనసాగుతున్నది. భూసేకరణ ఆపాలనీ, గిరిజన భూములను లాక్కోవద్దని ప్రజాసంఘాల, హక్కుల కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates