టుడే టాప్-10 న్యూస్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్ డౌన్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు, తెలంగాణ నుంచి 5 జిల్లాలు ఉన్నాయి. ఏపీలో ప్రకాశం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలను లాక్‌డౌన్‌ చేసింది. అటు తెలంగాణలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాలను లాక్‌డౌన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కర్ణాటకలో 4 జిల్లాలు, తమిళనాడులో చెన్నై సహా రెండు జిల్లాలు, ఢిల్లీలో 7, ఉత్తరప్రదేశ్‌లో 15 జిల్లాలలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

భారత్‌లో ఏడుకు చేరిన కరోనా మరణాలు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది. కరోనా వైరస్ (కోవిడ్‌-19) సోకడంతో గుజరాత్‌లో ఓ 69 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. గత నాలుగు రోజులుగా సూరత్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. రైలుమార్గం గుండా ఢిల్లీ నుంచి జైపూర్‌ మీదుగా ఆయన సూరత్‌కు వెళ్లినట్లు గుర్తించారు.

తెలంగాణలో జనతా కర్ఫ్యూ మార్చి 31 వరకు
హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. రేషన్ కార్డు దారులకు బియ్యంతో పాటు రూ. 1500 నగదు ఇస్తామని ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పించడంతో పాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయలు అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈనెల 29నే రేషన్ సరుకులు అందిస్తామన్నారు. జనతా కర్ఫ్యూను కూడా మార్చి 31 వరకు పొడిగించారు.

జనతా కర్ఫ్యూ విజయవంతం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరిగింది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వైద్యులు, అత్యవసర సేవలు అందిస్తున్న యంత్రాంగానికి యావత్‌ భారతావని చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు సైతం చప్పట్లు కొట్టి కృతజ్ఞతా భావాన్ని ప్రకటించారు.

తెలంగాణలో 22కు చేరిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య ఆదివారానికి 22కు చేరుకుంది. గుంటూరుకు చెందిన 24 ఏళ్ల యువకుడికి తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణైనట్టు డాక్టర్లు వెల్లడించారు. బాధితుడు లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మార్చి 31 వరకు ఢిల్లీలో 144 సెక్షన్
ఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది.
ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మార్చి 31 అర్ధ రాత్రి వరకు ఢిల్లీలో 144 సెక్షన్ విధించింది. సభలు, సమావేశాలు, గుంపులుగా తిరగడంపై ఆంక్షలు పెట్టింది. ప్రజా ఆరోగ్యం, భద్రత దృష్ణా చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇండియాలో రెండో దశలో కరోనా
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్టు తెలుస్తోంది. వైరస్‌ వ్యాప్తి మూడో దశ (సామాజిక వ్యాప్తి–కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌)లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజులు గడువే ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యలు చేట్టాలని సూచిస్తున్నారు.

చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 17 మంది మృతి
చత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు శనివారం చోటుచేసుకున్న ఎదురుకాల్పుల సందర్భంగా కనిపించకుండా పోయిన భద్రతా సిబ్బంది 17 మంది మృతదేహాలను ఆదివారం కనుగొన్నారు. బస్తర్ రేంజ్ లోని ఎల్లమ్మగుండ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు జరిగిన ఎన్ కౌంటర్ లో గాయపడిన వారిని రాయ్ పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
సియోల్‌: ప్రపంచమంతా కరోనా మహమ్మారితో ఒకవైపు తల్లడిల్లుతుండగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొన్‌ ఉంగ్‌ క్షిపణి ప్రయోగం చేపట్టారు. కిమ్‌ శుక్రవారం ఉదయం సోంచన్‌ కౌంటీలోని ఓ ప్రాంతంలో క్షిపణి ప్రయోగాలను పర్యవేక్షిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను అధికార మీడియా విడుదల చేసింది. 700 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్‌ సమావేశం ఏప్రిల్‌ 10న ఉంటుందని ఈ క్షిపణి ప్రయోగానికి ముందుగా అధికార మీడియా ప్రకటించింది.

RELATED ARTICLES

Latest Updates