ఈరోజు ముఖ్యాంశాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

145 దేశాలకు విస్తరించిన కరోనా
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. 145 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 5,423 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షా 45 వేల 631 మంది కోవిడ్-19 బారిన పడ్డారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ యూరప్ లో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. చైనాలోని వుహాన్ నగరంలో వరుసగా 9వ రోజు వైరస్ బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇటలీలో 24 గంటల్లోనే 250 మృత్యువాత పడ్డారు. దక్షిణ కొరియాలో 67 మంది బలైయ్యారు. ఇజ్రాయెల్ లో 150 మంది వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కెనడా ప్రధానికి జస్టిన్ ట్రూడోకు వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తం కావడంతో పార్లమెంట్ సమావేశాలు రద్దు చేశారు. ఇరాన్ లో 514, స్పెయిన్ లో 133, ఫ్రాన్స్ లో 79 మంది మృతి చెందారు.

తెలంగాణలో స్కూళ్లకు సెలవు
కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కోవిడ్-19 నియంత్రణ చర్యలపై ఉన్నత స్తాయి సమీక్ష నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం వెలువరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్‌, మాల్స్‌ను కూడా మూసివేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఇంటర్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్‌ ప్రకారం జరుగనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలిచ్చింది. ఉగాది రోజున ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయరాదని ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

అమెరికన్ కాన్సులేట్స్ మూసివేత
భారత్‌లోనూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉన్న అన్ని అమెరికన్ కాన్సులేట్స్‌ను సోమవారం నుంచి తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. వీసా ప్రాసెస్ కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కనుక వీసా ప్రాసెస్ రీషెడ్యూల్ చేసుకోవాలని దరఖాస్తుదారులను ఎంబసీ కోరింది. తమ దేశంలో కరోనా విస్తరిస్తుండటంతో మెడికల్ ఎమర్జెన్సీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

వాహనదారులకు వాత
పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. లీటరుకు మూడు రూపాయల చొప్పున సుంకాన్ని పెంచినట్లు ప్రకటించింది. పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకాన్ని 2 నుంచి 8 రూపాయలకు పెంచింది. డీజిల్‌పై 4 రూపాయలు వడ్డించింది. ఎక్సైజ్‌ సుంకంతో పాటు రోడ్‌ సెస్‌ను కూడా పెంచినట్లు కేంద్రం తెలిపింది. పెట్రోల్ పై రూపాయి, డీజిల్ పై 10 రూపాయల రోడ్ సెస్ పెంచింది. ఎక్సైజ్‌ సుంకం, రోడ్ సెస్ పెంపుతో కేంద్రానికి రూ. 2000 కోట్ల అదనపు ఆదాయం రావొచ్చునని అంచనా. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వచ్చిన నేపథ్యంలో మోదీ సర్కారు.. వాహనదారులకు వాత పెట్టింది.

ఐపీఎల్‌ వాయిదా
కరోనా వైరస్ కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ సీజన్‌ ఏప్రిల్‌ 15 వరకు వాయిదా పడింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. అయితే షెడ్యూల్ ను కుదించి మినీ ఐపీఎల్‌ నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా, భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా జరగాల్సిన రెండు మ్యాచ్‌లను కూడా బీసీసీఐ రద్దు చేసింది. కరోనా కల్లోలం నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌తో పాటు మూడు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ అర్థంతరంగా రద్దు చేసుకుంది.

RELATED ARTICLES

Latest Updates